సామాజిక మాధ్యమాలు తెరిస్తే చాలు… జుట్టు ఎక్కువగా రాలుతుందా? మొటిమలు ఎక్కువవుతున్నాయా? పిగ్మెంటేషన్తో బాధపడుతున్నారా? అంటూ మొదలవుతున్నాయి ప్రకటనలు. వీటన్నిటికీ పరిష్కారం సంబంధిత కంపెనీల ఉత్పత్తులే అని చెబుతున్నారు. వీటి సంగతి ఏమో కానీ… ఈ ప్రకటనలు అమ్మాయిల మీద చూపించే ప్రభావం మాటల్లో చెప్పలేనిది. దీనివల్ల నాజుగ్గా, తెల్లగా, మొటిమ లేకుండా ఉంటేనే అందం అన్న భావనలోకి వెళ్లిపోతున్నారు చాలామంది. దీనికి భిన్నంగా ముఖం, చర్మం, శరీరంలో ఏ మాత్రం తేడా వచ్చినా అది తమలోని లోపంగా భావిస్తున్నారు. దీనికి తోడు ఎదుటి వాళ్లతో పోల్చుకుంటూ ఆత్మన్యూనతకు గురవుతున్నారు. ఇది క్రమంగా ‘బాడీ డిస్మోర్ఫియా’కు దారితీస్తుంది.
తమ శరీరంలో వచ్చే చిన్న చిన్న మార్పుల్ని కూడా పెద్దవిగా ఊహించుకోవడం, స్వీకరించలేక పోవడమే బాడీ డిస్మోర్ఫియా. ఇదో మానసిక రుగ్మత. దీనివల్ల సమస్య చిన్నదే అయినా నలుగురిలోకీ రావడానికి ఇబ్బంది పడటం, సిగ్గు, ఆందోళన వంటి భావాలకు గురవుతున్నారు. దీన్నుంచి బయటపడటానికి కొందరు అమ్మాయిలు పైపై మెరుగులు దిద్దుకుంటుంటే… కొందరు మాత్రం ఈ మానసిక పోరాటంలో అలసిపోయి యాంగ్జయిటీ, డిప్రెషన్ వంటి వాటి బారిన పడుతున్నారు. అద్దంలో కనిపించేది మాత్రమే అందం కాదు. అది కాలంతోపాటే కనుమరుగవుతుందని ఎంత చెప్పినా వినే పరిస్థితుల్లో లేరు. దీనికి ప్రభావితం అవుతున్న వాళ్లలో టీనేజర్లే ఎక్కువగా ఉన్నారని చెబుతున్నదో అధ్యయనం. కాబట్టి చిన్నప్పట్నుంచే అమ్మాయిల పెంపకంలో అందం అంటే ఇదే అన్న ఆలోచనల్ని తుడిచిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెబుతున్నారు నిపుణులు.