ఆభరణాలు అంటే అందం కోసం మాత్రమే ధరించేవన్న ఆలోచనను మార్చేస్తున్నది నేటి ఫ్యాషన్ ప్రపంచం. అలంకరణగా కనిపించడంతోపాటు అవసరమైనప్పుడు ఉపయోగించుకోగలిగే వస్తువులను నగల రూపంలో ధరించడం అన్నది ట్రెండ్‌గా మారుతున్నది. ‘ఫంక్షనల్ జువెలరీ’ లేదా ‘మల్టీపర్పస్ జువెలరీ’గా వీటిని పిలుస్తున్నారు. చిన్న దువ్వెనను అందమైన గొలుసుకు జత చేసి మెడలో ధరించే కాన్సెప్ట్ దీనికి చకని ఉదాహరణ. చూడటానికి అది ఒక విభిన్నమైన నగలా కనిపిస్తుంది. అవసరమైనప్పుడు తీసి దువ్వుకోవచ్చు. అలాగే బుజ్జి సెంటు సీసాలను పెండెంట్ రూపంలో రూపొందిస్తున్నారు.
వాటిలో అత్తరు నింపుకొని, నగలా ధరించడంతో పాటు అవసరమైనప్పుడు పరిమళాన్ని ఉపయోగించుకోవచ్చు. పెన్నులను కూడా మెడలో ధరించే ఆభరణాలుగా మార్చి రూపొందిస్తున్నాయి కొన్ని విలాసవంతమైన నగలు, యాక్సెసరీల తయారీ సంస్థలు. లిప్‌స్టిక్‌లూ ఇలా పెండెంట్లలా వస్తున్నాయి. అయితే ఇలాంటి ఆలోచన మరీ కొత్తదేమీ కాదు. గతంలో చిన్న అద్దాలు, గడియారాలు, బైనాక్యులర్స్ వంటి ఉపయోగకరమైన వస్తువులు కూడా మెడలో ధరించే అలంకరణల్లో భాగమయ్యాయి. కాబట్టి ఇప్పుడు నగలంటే ముత్యాల హారాలు, రత్నాల పెండెంట్లే కాదు… మనకు అవసరమైన వస్తువులు కూడా!
ఈ ధోరణిలో మరో ఆకర్షణ ఉంది. నగ అనేది కేవలం అందాన్ని చూపించేది కాకుండా, ధరించిన వ్యక్తి అలవాట్లను, అభిరుచిని కూడా తెలియజేయగలదు. పుస్తకాలు ఇష్టపడేవారికి కలం, పరిమళాలను ఇష్టపడేవారికి చిన్న సువాసన సీసా, ప్రయాణాల్లో వెంట ఉండే చిన్న వస్తువును ఇష్టమైన అలంకరణగా మార్చుకోవడం… ఇలా వ్యక్తిగత శైలికి కూడా చోటుంటుంది. మన దగ్గర కూడా ఈ ఆలోచనను సరళంగా అనుసరించవచ్చు. చిన్న సువాసన సీసా, అందమైన చిన్న దువ్వెన లేదా ప్రత్యేకమైన ఉపయోగకరమైన వస్తువును సున్నితమైన గొలుసుతో జతచేసి ధరించవచ్చు. అయితే ప్రతి వస్తువూ నగలా ధరించడానికి అనువుగా ఉండదు; అందం, భద్రత, ఉపయోగం-మూడింటినీ దృష్టిలో పెట్టుకుని రూపొందించినవే సరైన ఎంపిక. ఫ్యాషన్ సూత్రం… అందంగా కనిపించేది నగ కావచ్చు… అవసరమైనప్పుడు పనికొచ్చేది అయితే, ఆ నగకు మరో ప్రత్యేకత చేరుతుంది.