Chandrabose | తెలుగు పాటను, తెలంగాణ కీర్తిప్రతిష్ఠలను విశ్వ వేదిక మీద సగర్వంగా నిలబెట్టారు చంద్రబోస్. భారతదేశం తరఫున ఆస్కార్ పురస్కారం అందుకున్న తొలి గేయ రచయితగా చరిత్ర సృష్టించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాకే తెలంగాణ యాస, భాషలకు గొప్ప గౌరవం దక్కుతున్నదని ఆనందంగా చెబుతారు చంద్రబోస్. ఒకప్పుడు తెలంగాణ సినిమా అంటే అభ్యుదయం మాత్రమేనని, నేడు ప్రధాన స్రవంతి కథలతో ఇక్కడి సినిమా కొత్త రూపు సంతరించుకుంటున్నదని చెప్పారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా చంద్రబోస్ ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా సంభాషించారు. ఆ విశేషాలు ఆయన మాటల్లోనే…
తెలంగాణ రాష్ట్రంగా ఏర్పడిన తరువాతే మన భాషకు, యాసకు, మాండలికానికి మర్యాద, గౌరవం దక్కాయి. ఇక్కడి ఇతివృత్తాలతో కొత్త కథలు వస్తున్నాయి. నిరంతరం నూతనత్వాన్ని అన్వేషించే వారికి తెలంగాణ మాండలికం కొత్తదారి చూపు తున్నది. ఇప్పుడు చాలామంది రచయితలు తెలంగాణ నేపథ్య కథల పట్ల మక్కువ ప్రదర్శిస్తున్నారు. అయితే కేవలం భాష, యాసతో సినిమాలు విజయవంతం కావు. అందుకు తగిన విధంగా బలమైన కథ కుదరాలి. మన బతుకుల్లోని జీవన సంక్లిష్టత, సంఘర్షణకు అద్దంపట్టే కథలే ఎక్కువగా విజయం సాధిస్తాయి. దానికి ఉదాహరణ ‘బలగం’. ఈ సినిమాలో తెలంగాణ జీవితాన్ని, అందులోని లోతుపాతులను చూపించారు. కాబట్టి ఘనవిజయం సాధించింది.
తెలంగాణ సినిమా అంటే ఒకప్పుడు విప్లవం, ఉద్యమాలే అనుకునేవారు. ఇప్పుడు ప్రధాన స్రవంతి కథలతో కమర్షియల్‌గా నూతన రూపును సంతరించుకుంటున్నాయి. అదే సమయంలో విప్లవం, ఉద్యమం తాలూకు స్ఫూర్తి చిరకాలం నిలిచి ఉంటుంది. తెలంగాణ పల్లెలు ఇప్పుడు పచ్చదనంతో వికసిస్తున్నాయి. ఈ నేల మీద విభిన్న భావజాలాలు ఉన్నాయి. మన ప్రేమలు, అనుబంధాలు, ఎడబాట్లు, సంఘర్షణలు, కుటుంబ నేపథ్యాలతో కథల్ని ఆవిష్కరించాల్సిన సమయమూ వచ్చింది. మునుముందు ఆ తరహా కథలు దృశ్యమానం అయితే తెలంగాణ సినిమాకు మంచి భవిష్యత్తు ఉంటుంది.
అవకాశాలు పెరిగాయి..
ప్రత్యేక రాష్ట్రం సిద్ధించడంతో ప్రతిభావంతులకు సినిమా అవకాశాలు పెరిగాయి. హైదరాబాద్‌లోనే సినీ పరిశ్రమ స్థిరపడటంతో ఇక్కడి కళాకారులకు, సాంకేతిక నిపుణులకు ఆఫర్లు వస్తున్నాయి. ఇండస్ట్రీకి కొత్తగా వచ్చేవారు కూడా అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే బాగుంటుంది. తెలంగాణ స్వతహాగా కళాకారులకు ప్రసిద్ధి. యువ ప్రతిభను ప్రోత్సహిస్తే.. ఇంకొంతమంది పరిశ్రమలోకి వస్తారు. వెండితెర మరింతగా వెలిగిపోతుంది.
పథకాలన్నీ విప్లవాత్మకం
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాల్లో రైతుబంధు నాకు బాగా నచ్చింది. దీంతోపాటు హరితహారం, మహిళలు, వికలాంగులు, వృద్ధుల సంక్షేమం కోసం చేపడుతున్న సంక్షేమ పథకాలు బాగున్నాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పెంచడం ఎంతో నచ్చింది. హైదరాబాద్ నగరంలోఎక్కడ చూసినా అందమైన రోడ్లు, ఫ్లై ఓవర్లు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రత్యేక రాష్ట్రం వచ్చాక కరెంట్ బాధలు తప్పాయి. ఇది విప్లవాత్మకమైన మార్పు. తెలంగాణ రాక ముందు కరెంటు ఎప్పుడు ఉంటుందో, ఎప్పుడు పోతుందో తెలియని డోలాయమాన స్థితి. ఇప్పుడు 24 గంటల విద్యుత్ సరఫరాతో రాష్ట్రం సుస్థిరమైన అభివృద్ధి బాటలో పయనిస్తున్నది.
ప్రకృతి రమణీయతకు ఫిదా
పెళ్లి చూపులు, ఫిదా, మల్లేశం, బలగం లాంటి తెలంగాణ నేపథ్య చిత్రాలు రావడం సంతోషం. అందులో ముఖ్యంగా ‘బలగం’ కుటుంబ బంధాలకు దర్పణం పట్టింది. ‘మల్లేశం’ స్ఫూర్తిమంతమైన బయోపిక్. తెలంగాణలో గొప్ప ఆవిష్కర్తలు ఉన్నారు. అలాంటి వారి గురించి కళాత్మకంగా, కవితాత్మకంగా ‘మల్లేశం’ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ తరహా సినిమాలు మరిన్ని రావాలి. తెలంగాణలో ప్రకృతి రమణీయతకు అందరూ ఫిదా అవుతున్నారు. ఇక్కడ అందమైన లొకేషన్లు చాలా ఉన్నాయి. అన్ని ప్రదేశాలకు రవాణా సౌకర్యం ఉంది. వసతి సౌకర్యాలూ ఉన్నాయి. వాటిని ఇంకాస్త మెరుగుపరిస్తే మరిన్ని సినిమాలు షూటింగ్ చేసుకోవడానికి అనువుగా ఉంటుంది. ఇంకా వెలుగులోకి రాని చాలా షూటింగ్ లొకేషన్స్ ఉన్నాయి. వాటికి ప్రచారం కల్పించాలి.
తెలంగాణ జాతిపిత
కేసీఆర్‌గారు తెలంగాణ జాతిపిత, తెలంగాణ గాంధీ. తెలంగాణ కోసం ఆయన ఎన్నో త్యాగాలు చేశారు. లక్ష్యాన్ని సాధించిన తరువాత కూడా విశ్రమించకుండా.. రాష్ర్టాన్ని ప్రగతి బాటలో నడిపించడం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. కేసీఆర్, కేటీఆర్గార్ల దార్శనికత, కార్యదక్షత నాకు బాగా నచ్చుతాయి. వీరితోపాటు ప్రజా సమస్యలపై అవగాహన ఉన్న మంచి మంత్రులు ఉన్నారు. చరిత్ర, వర్తమానం, భవిష్యత్ మీద సంపూర్ణ అవగాహన కలిగినవారు మనకు పాలకులుగా ఉన్నందుకు సంతోషంగా ఉంది.
తెలంగాణ మరింత పురోభివృద్ధి సాధించాలని ఆకాంక్షిస్తూ.. ప్రజలందరికి దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు.
ముఖ్యమంత్రి ఆహ్వానం కోసం..
మన కళాకారుల కోసం ఫిల్మ్స్కూల్తోపాటు మ్యూజిక్ స్కూల్ ఏర్పాటు చేస్తే బాగుంటుంది.
కళాకారులకు ప్రభుత్వం తరఫున అవార్డులు కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుంది. నిజానికి ఆస్కార్ అవార్డు వచ్చిన తరువాత ప్రభుత్వం నుంచి ఆహ్వానం అందుతుందని అనుకున్నాను. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నుంచి పిలుపు వస్తుందని నేను నా కుటుంబం, స్నేహితులు అందరం ఎదురుచూశాం. కానీ, ఆ సమయంలో ముఖ్యమంత్రి గారు బిజీగా ఉండటం వల్ల కుదరలేదని అనుకుంటున్నా. కేసీఆర్‌గారిని కలవడం నా స్వప్నం. కేసీఆర్, కేటీఆర్ గార్లను కలిసి నా ఆనందాన్ని పంచుకోవాలనుకున్నాను. ఒకవేళ ఆహ్వానం అందితే ప్రభుత్వంతో తెలంగాణ సినిమా అభివృద్ధి గురించి కొన్ని మంచి ఆలోచనలు పంచుకోవాలనుకున్నాను. ఇలాంటి పురస్కారం వచ్చిన మొదటి భారతీయుడిని కాబట్టి ప్రభుత్వానికి కొన్ని ఆలోచనలు చెబుదామనుకున్నాను. అయితే అవకాశం రాలేదు. భవిష్యత్‌లో వస్తుందని ఆశిస్తున్నాను.