కరోనా… ప్రపంచాన్నే స్తంభింపచేసిన మహమ్మారి. రెండు దశలలో ఎంతోమందిని పొట్టనబెట్టుకుందీ వైరస్. ఎట్టకేలకు వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. కొత్తలో టీకా తీసుకునేందుకు జనం సందేహించారు. సెకండ్ వేవ్ దెబ్బకు వ్యాక్సిన్ కేంద్రాల వద్ద బారులు తీరారు. అయినా, రెండో దశ ఇంకా సమసిపోలేదు. అంతలోనే, థర్డ్ వేవ్ ప్రచారం తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో ‘బూస్టర్ డోస్’ మీద చర్చ మొదలైంది. రెండు డోసులూ తీసుకున్నవారు కూడా బూస్టర్ డోస్‌తో కరోనా కొత్త వేరియంట్ల నుంచి రక్షణ పొందవచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మనల్ని వేధిస్తున్న అనేకానేక సందేహాలను నివృత్తి చేస్తున్నారు డాక్టర్ నవీన్ చందర్‌రెడ్డి..
‘మిశ్రమం’ మంచిదే!
కరోనా చికిత్సకు ప్రత్యేకించి ఎలాంటి మందులూ లేవు. మహా అయితే, ‘మద్దతు చికిత్స’ అందుబాటులో ఉంది. వైరస్ నుంచి రక్షణ పొందాలంటే టీకా ఒక్కటే మార్గం. తయారీ కంపెనీల గురించి ఎక్కువగా ఆలోచించవద్దు. ఏ టీకా అయినా, రెండు డోసులు కచ్చితంగా తీసుకోవాలి. సాధారణంగా ఫస్ట్ డోస్ ఏ కంపెనీ వ్యాక్సిన్ తీసుకుంటే సెకండ్ డోస్ కూడా అదే తీసుకోవాలి. కానీ ఫస్ట్‌డోస్ తీసుకున్న కంపెనీ టీకా, సెకండ్ డోస్ సమయానికి అందుబాటులో లేకపోతే వేరే కంపెనీ టీకా అయినా తీసుకోవచ్చు. దీనివల్ల దుష్ఫలితాలేం ఉండవు. నిజానికి, వ్యాక్సిన్ మిక్సింగ్‌తో ఎంతోకొంత ప్రయోజనం ఉంటుందనే తాజా పరిశోధనలు మనకు చెబుతున్నాయి.
వ్యవధి ఎంత?
అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, రెండు డోసులూ తీసుకున్నవారిలో.. ఆరునెలలు దాటిన తర్వాత కూడా యాంటీబాడీస్ కనిపిస్తూనే ఉన్నాయి. అయితే, ఇవి శరీరంలో ఎంతకాలం ఉంటాయన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. సుమారు సంవత్సరం వరకూ ఉంటాయనేది ప్రాథమిక అంచనా. డిసెంబరు, జనవరి నాటికి కచ్చితమైన లెక్క తేలుతుంది. ఎందుకంటే, అప్పటికి టీకా వచ్చి ఏడాది అయిపోతుంది. వ్యాక్సిన్ ప్రభావంపై పూర్తిస్థాయి గణాంకాలు అందుబాటులోకి వస్తాయి. రెండు విడతల వ్యాక్సిన్లు తీసుకున్నవారిలో యాంటీబాడీస్ ఏ స్థాయిలో ఉన్నాయన్న దానిపై ఓ నిర్ణయానికి రావచ్చు. అప్పుడే, బూస్టర్ డోస్ అవసరమా కాదా..
అవసరమైతే ఎప్పుడు తీసుకోవాలనే దానిపై ఓ నిర్ణయం సాధ్యం అవుతుంది.
‘కొత్త’ బలం
బూస్టర్.. అంటే అదనపు శక్తినివ్వడం. మొదటి రెండు డోసుల వ్యాక్సిన్ల వల్ల యాంటీబాడీస్ ఏర్పడి ఉంటాయి. బూస్టర్ వల్ల అవి మరింత బలోపేతం అవుతాయి. భవిష్యత్తులో కొత్తకొత్త వేరియంట్లు వచ్చినా, అడ్డుకునేందుకు మన రోగ నిరోధక వ్యవస్థకు ఆ మాత్రం సత్తువ అవసరమే. కానీ, టీకా తీసుకున్నవారికి, బూస్టర్ అవసరం ఎంతవరకు ఉంటుందనేది మాత్రం ఇప్పుడే చెప్పలేం. కొంతకాలం ఆగాలి.
థర్డ్ వేవ్ సంకేతాలు?
నిజమే, ఏ సర్వే ప్రకారం చూసినా థర్డ్‌వేవ్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఇది సెప్టెంబర్-అక్టోబర్ మధ్య తీవ్రరూపం దాల్చి, క్రమంగా తగ్గుముఖం పట్టవచ్చు. అయితే, సెకండ్ వేవ్ అంత ఉద్ధృతంగా ఉండకపోవచ్చు. అయినా సరే, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. స్వల్ప లక్షణాలున్నవారు హోమ్ ఐసోలేషన్‌లో ఉంటే సరిపోతుంది. మధ్యస్థ లక్షణాలున్నవారు ప్రారంభ దశలోనే వైద్యులను సంప్రదించాలి. సెకండ్‌వేవ్ సమయంలో, చాలా మంది వ్యాధి ముదిరిన తరువాతే.. అంటే తీవ్ర లక్షణాలు కనిపించాకే దవాఖానకు పరుగులు తీశారు. తీవ్ర జ్వరం, ఆయాసం, శ్వాస సమస్య, పల్స్రేట్ 95కంటే తక్కువకు పడిపోతూ ఉండటం.. తదితర లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ఇప్పటికే, మన డాక్టర్లు కరోనా చికిత్సపై పట్టుసాధించారు. ప్రభుత్వ హాస్పిటల్స్ సైతం పూర్తిస్థాయి వసతులు సమకూర్చుకున్నాయి. నిష్ణాతులైన వైద్యులూ అందుబాటులో ఉన్నారు. కరోనా రోగులు సకాలంలో హాస్పిటల్‌కు వెళ్లగలిగితే ఇబ్బందే ఉండదు. ఆర్థిక భారమూ తగ్గుతుంది.
యాంటీబాడీస్‌ను బట్టి..
యాంటీబాడీస్ అన్నది అసలు ప్రామాణికమే కాదు. చాలా మంది యాంటీబాడీస్ స్థాయి ఆధారంగా టీకా వేయించుకోవడమో లేదా బూస్టర్ గురించి ఆలోచించడమో చేస్తున్నారు. సాధారణంగా, ఇప్పటికే కొవిడ్‌కు గురైన వారితో పాటు, టీకా తీసుకున్న వారిలోనూ యాంటీబాడీస్ తయారవుతాయి. కానీ, పరీక్ష జరిపినప్పుడు కొందరిలో యాంటీబాడీస్ తక్కువ స్థాయిలో కనిపిస్తాయి. దీంతో ఆందోళనకు గురవుతారు. తగినన్ని యాంటీబాడీస్ లేవన్న కారణంగా బూస్టర్ డోస్ తీసుకోవడం సరికాదు. కొంతమందిలో యాంటీబాడీస్ మెమరీ సెల్స్‌కి వెళ్లిపోతాయి. అలాంటి వారిలో వైరస్ ఎటాక్ అయితే, వెంటనే మెమరీ సెల్స్ యాక్టివ్ అయిపోయి యాంటీబాడీస్స్థాయి పెరిగిపోవచ్చు.
ఆందోళన వద్దు, నిర్లక్ష్యమూ వద్దు
థర్డ్ వేవ్ వస్తుందని ఆందోళన చెందాల్సిన పన్లేదు. ఎందుకంటే, దాదాపు 60 శాతం మందిలో యాంటీబాడీస్ వృద్ధి అయినట్టు సర్వేల ద్వారా తెలుస్తున్నది. మనం హెర్డ్ ఇమ్యూనిటీకి దరిదాపుల్లో ఉన్నాం. ప్రస్తుతం 18 ఏండ్లు పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ జరుగుతున్నది. దీనివల్ల, థర్డ్‌వేవ్ వచ్చినా ఆ ప్రభావం సెకండ్‌వేవ్ అంత తీవ్రంగా ఉండకపోవచ్చు. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో వైరస్ తీవ్రత చాలా తక్కువగా కనిపిస్తున్నది. స్వల్పమైన లక్షణాలున్న రోగులు సులువుగా కోలుకుంటున్నారు. ఇక పిల్లల విషయానికి వస్తే, వైరస్ ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. అయితే, చిన్నారుల ద్వారా వైరస్ పెద్దలకు వ్యాపించే ఆస్కారం మాత్రం ఉండవచ్చు.
… మహేశ్వర్‌రావు బండారి
డాక్టర్ నవీన్ చందర్‌రెడ్డి
జనరల్ ఫిజీషియన్
ఏఐజీ హాస్పిటల్, గచ్చిబౌలి