అదొక ‘లైంగిక’ సమస్య. దాదాపు 85 శాతం మంది మహిళల ‘అంతర్గత’ సమస్య. వారిలో సగానికి సగం మందికి నోరు విప్పాలంటే భయం. చర్చించాలంటే బిడియం. ఆ నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టి, మౌనాన్ని పటాపంచలు చేస్తూ.. ఆ సమస్యపై పోరాటం చేసింది. తనలాంటి వారికోసం అధ్యయనం నిర్వహించింది హైదరాబాద్‌కు చెందిన కోమల్బల్ద్వా. ఆ ప్రయాణంలోంచి పుట్టుకొచ్చిందే ‘బ్లూ కేర్’ కండోమ్ కంపెనీ. ఇదొక కెమికల్ ఫ్రీ కండోమ్స్ తయారీ సంస్థ.
జీవితంపై కోటి ఆశలతో మెట్టినింట అడుగు పెట్టింది కోమల్. ఆ కొత్త కాపురంలో మధుర ఘట్టాలెన్నో. ఒకవైపు ఉద్యోగం, మరోవైపు కుటుంబ బాధ్యతలు. ‘అప్పుడే పిల్లలు అవసరమా?’ అనే ఆలోచనతో కోమల్ బల్ద్వా దంపతులు ప్రత్యామ్నాయ కుటుంబ నియంత్రణ పద్ధతులను పాటించారు. గర్భ నిరోధానికి నాటినుంచి నేటి వరకూ సురక్షితమైన పరిష్కారం ‘కండోమ్’. మొదట్లో లైంగిక జీవితం సాఫీగానే సాగినా కండోమ్స్లోని రసాయనాల వల్ల దురద, మంట, ఇన్ఫెక్షన్లు చుట్టుముట్టాయి. వైద్యుల్ని సంప్రదిస్తే కండోమ్‌కు బదులుగా గర్భ నిరోధక మాత్రలు వాడమని సలహా ఇచ్చారు. కానీ ఆ బిళ్లలను దీర్ఘకాలం తీసుకుంటే అసలుకే మోసం వస్తుందని గ్రహించిందామె. కొన్నిసార్లు శాశ్వతంగా సంతానలేమి సమస్యను ఎదుర్కోవాల్సి రావచ్చు. హార్మోన్లతో ముడిపడిన రుగ్మతలూ చుట్టు ముట్టవచ్చు. తనలానే అనేకమంది మహిళలకు ఈ చేదు అనుభవం ఎదురై ఉండవచ్చనే ఆలోచన ఆమెను తీవ్రంగా కదిలించింది. తనవంతు పరిష్కారంగా ఆర్గానిక్ పద్ధతిలో కండోమ్స్ తయారు చేయాలని నిర్ణయించుకుంది. సరిగ్గా అదే సమయంలో యూరప్ పర్యటనకు వెళ్లాల్సి వచ్చింది. అక్కడే ‘నాన్ టాక్సిక్ కండోమ్స్’ గురించి తెలిసింది. వాటి తయారీని క్షుణ్నంగా పరిశీలించింది కోమల్.
అధ్యయనం ఓ సవాలు
అప్పటిదాకా మనదేశంలో రసాయన రహిత కండోమ్స్ తయారీ జరగలేదు. దీంతో తాను వేసే అడుగు ఓ మైలు
రాయిగా ఉండాలని భావించింది కోమల్. అన్నిటికంటే ముందు.. వివిధ వర్గాల మహిళల అభిప్రాయాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఓ నాలుగు వందల మందిని సర్వే చేయాలని నిర్ణయించుకుంది. ఆ ప్రయత్నంలోనూ అనేక సవాళ్లు. కండోమ్స్ ప్రస్తావన రాగానే చాలామంది గృహిణులు మొహం చిట్లించారు. ‘ఇదేం పోయేకాలం’ అన్నారు. ఒకరిద్దరు మాత్రం సమస్యలు చెప్పుకొని కుమిలిపోయారు. ‘నీలాంటి వాళ్లే సమాజాన్ని నాశనం చేస్తున్నారు’ అని ఆడిపోసుకున్నవారూ ఉన్నారు. విద్యావంతులు, లైంగిక సమస్యల పట్ల అవగాహన ఉన్నవారు మాత్రం చేతులెత్తి నమస్కరించారు. దీని గురించి సోషల్ మీడియాలో చర్చ కూడా జరిగింది. సమగ్ర అధ్యయనం తర్వాత, రసాయనరహిత కండోమ్స్ తయారీ దిశగా తొలి అడుగువేసింది కోమల్. సేంద్రియ పద్ధతిలో సాగుచేసే రబ్బరు చెట్ల నుంచి పాలను సేకరించింది. వాటిని ఫ్యాక్టరీలో ప్రాసెస్ చేసి.. రసాయనాల జాడే లేని కండోమ్స్ తయారు చేయించింది.
ప్రభుత్వం నుంచి అధికారిక అనుమతులు లభించగానే మార్కెట్లో విడుదల చేసింది. అప్పటికే అందుబాటులో ఉన్న ఉత్పత్తులతో పోలిస్తే ధర కూడా తక్కువే. దీంతో అనతి కాలంలోనే ‘బ్లూ కేర్’ కండోమ్స్‌కు మంచిపేరు వచ్చింది. వివిధ రకాల పండ్ల ఫ్లేవర్లలోనూ లభిస్తున్నాయి. కోమల్ విజయ ప్రస్థానం వెనుక వీహబ్ అండదండలు ఉన్నాయి. ఆమె తన ఆలోచన చెప్పగానే ప్రత్యేకంగా ఓ మెంటర్‌ను కేటాయించింది వీహబ్. మార్కెటింగ్ వ్యూహాలను బోధించింది. లాంచ్‌ప్యాడ్ ఈవెంట్ ద్వారా ఇన్వెస్టర్లను అందించింది. ఆ కృతజ్ఞతతోనే కోమల్ తెలంగాణ నడిబొడ్డున ఉన్న మెదక్ జిల్లాలో కండోమ్స్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అలా ప్రత్యక్షంగా, పరోక్షంగా 400 మందికి ఉపాధి కల్పిస్తున్నది. తన వ్యాపార ప్రయాణంలో వీహబ్ పాత్ర మరువలేనిదని చెబుతున్నది కోమల్. కంపెనీకి వచ్చే లాభాల్లో కొంత శాతాన్ని ఎయిడ్స్ నివారణ కోసం పనిచేస్తున్న ఎన్జీఓలకు విరాళంగా ఇస్తున్నదామె. పురుషాధిక్య ప్రపంచంలో.. అదీ మగవాళ్లు మాత్రమే రాణిస్తున్న కండోమ్స్ తయారీ రంగంలో ఓ మహిళ ప్రవేశించడం.. తన ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగించడం గొప్ప విషయం. స్ఫూర్తిదాయకం.
లైంగిక ఆరోగ్యం స్త్రీ హక్కు
‘నేను పుట్టిందీ పెరిగిందీ కోల్‌కతాలోనే. వివాహం చేసుకుని స్థిరపడింది మాత్రం హైదరాబాద్‌లో. యూకేలోని క్రాన్ఫీల్డ్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ నుంచి మార్కెటింగ్‌లో మాస్టర్స్ చేశాను. ఆరోగ్యకరమైన, సురక్షితమైన లైంగిక జీవితం స్త్రీ హక్కు. రసాయన కండోమ్స్ వల్ల మహిళలు అనేక లైంగిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం మెనోపాజ్ మహిళల ఆరోగ్యంపై దృష్టిపెట్టాను. మా bleuofficial.com వెబ్సైట్ ద్వారా లైంగికత పట్ల అవగాహన కల్పిస్తున్నాం. అన్ని రీటైల్ మార్కెట్లలో, ఈ-కామర్స్ వెబ్‌సైట్స్‌లో మా కండోమ్స్ అందుబాటులో ఉన్నాయి. నా ప్రయాణంలో తోడుగా నిలిచిన కుటుంబానికి ప్రత్యేక కృతజ్ఞతలు’ అంటారు కోమల్ బల్ద్వా.