నానావాదములన్ భయావహములై నష్టమ్ము కల్గింపగా
తానై పూనుచు సర్వమానవుల సందర్శించి దేశాటనన్
హానిన్ జేయని రీతి మేల్కొలుపుతో నద్వైతమాైర్గెక సం
ధానమ్మున్ కలిగించె శంకరుడు దిగ్దర్శిత్వ మేధావియై
నశ్వర భోగజాలములు నాశముజేయు నరాళి భావినం
దీశ్వరభక్తియే చిరమహేచ్ఛలు దీర్చునటంచు సాహితిన్
విశ్వముకై రచించుచు సువేద్యము జేసె గురుండు మౌనియై విశ్వము తానయై నిలువ వేదనలన్ దునుమాడె యోగియై!
సత్యము బ్రహ్మమై వెలుగు సర్వజగమ్మును మిథ్యయంచు, సం
స్తుత్యుడు జీవుడంచు పరిశోభితవాఙ్మయమున్ వెలార్చి, తా
ముత్యమువోలె నిల్చి, జనముక్తికి దారులు చూపినట్టి, యా
నిత్యపదార్థవేదిని, మనీషిని గొల్తు మనః ప్రశాంతికై!
జీవనమూల్యముల్ దెలియ జీవుడు దేవుడుగా వెలుంగడే?
భావనలోన నున్నతిని భద్రముగా నెలకొల్ప మేలనన్
సేవలొనర్చి మానవుల శ్రేయముకై నిరతమ్ము సాగెనా
పావనమూర్తి, శంకరుడు వాఙ్మయమున్ భువికిచ్చై ధన్యుడై!
శంకరుడు చూపు మార్గమ్ము శంకరమ్ము
సకల మానవాభ్యుదయ విశాలపథము
దాని వెనువెంట సాగిన దక్కు శుభము
అవనియెల్లెడలన్ సదా శివము భవము!
– డా॥ అయాచితం నటేశ్వరశర్మ