Actress Seetha | తెలుగువారికి.. బేబీ సీతనే!

మూడేండ్లకే నటనలో ఓనమాలు దిద్దుకొని బేబీ సీతగా దక్షిణాదిన స్థిరపడిపోయారు నటి సీత. మూడు దశాబ్దాల.. రెండు తెరల ప్రయాణంలో అనేక సినిమాలు, సీరియళ్లలోనటించారు. అపార అనుభవాన్ని మూటగట్టుకొన్నారు. తాజాగా, జీ తెలుగు ‘ఊహలు గుసగుసలాడే’ సీరియల్ ద్వారా మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆమె ‘జిందగీ’తో పంచుకున్న ముచ్చట్లు..
మొదటి సినిమా ఏ వయసులో చేశారు?
చాలా చిన్నప్పుడు, ఏదో సినిమాలో చేశానట. కానీ నాకు గుర్తులేదు. ఊహ తెలిసి నా మొదటి సినిమా ‘బంధాలు-అనుబంధాలు’. అప్పటికి నా వయసు మూడేండ్లు. అందులో లక్ష్మి-శోభన్‌బాబు దంపతుల కూతురిగా నటించాను. ఆ తర్వాత మళ్లీ శోభన్బాబుగారే ‘బలిదానం’లో అవకాశమిచ్చారు. అప్పటినుంచీ తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో యాభైకి పైగా చిత్రాల్లో బాలనటిగా చేశాను.
మీ సొంతూరు?
నేను పుట్టిందీ పెరిగిందీ చెన్నైలోనే. మా అమ్మవాళ్ల తాతముత్తాతలు గుంటూరు జిల్లాకు చెందినవారట. చెన్నైకి వచ్చి స్థిరపడ్డారు. అందుకేనేమో, నా మాతృభాష తెలుగే అయినా తమిళంలోనే స్పష్టంగా మాట్లాడగలను.
బాలనటిగా గుర్తింపు తెచ్చిన సినిమా?
సుహాసిని-శోభన్‌బాబు కాంబినేషన్లో వచ్చిన ‘ఇల్లాలు-ప్రియురాలు’ సినిమాలో మీనా, నేను వాళ్ల పిల్లలుగా నటించాం. మీనా చెల్లెలి పాత్ర నాది. ఆ సినిమా నాకు మంచి పేరు తెచ్చింది. ఎన్నో అవకాశాలనూ అందించింది. ఆ తర్వాత, రాఘవేంద్రరావుగారి ‘వజ్రాయుధం’లో శ్రీదేవిగారికి శ్లోకం చెప్పే పాత్ర నాది. అది కూడా బాగా పాపులర్ అయ్యింది.
పెద్దయ్యాక చేసిన సినిమాలు?
అప్పుడు ఇండస్ట్రీ చెన్నైలోనే ఉండేది కాబట్టి, బాలనటిగా దక్షిణాదిన అన్ని భాషల్లో నటించే అవకాశం లభించింది. నేను పెరిగే సమయానికి తెలుగు పరిశ్రమ హైదరాబాద్‌కు మారింది. మిగతా పరిశ్రమలు కూడా చెన్నై నుంచి తరలిపోయాయి. దాంతో అన్ని భాషల్లో అవకాశం రాలేదు. తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో చేసినా.. కన్నడలో చేయలేకపోయాను. పెద్దయ్యాక ‘అమ్మాయి కాపురం’ సినిమాలో హీరో ఫస్ట్ వైఫ్ క్యారెక్టర్ చేశాను.
సెకండ్ ఇన్నింగ్స్ ఎలా ఆరంభమైంది?
వ్యక్తిగత కారణాల వల్ల 2013 నుంచి దాదాపు నాలుగేండ్లపాటు నటనకు దూరంగా ఉన్నా. 2017లో ఓ మలయాళ సీరియల్‌తో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించా. ఆ తర్వాత జీ తమిళ్ ‘సత్య’ సీరియల్లో హీరో తల్లిగా అవకాశం వచ్చింది. ఈ వయసులో తల్లి పాత్రా? అని మొదట సందేహించినా, మళ్లీ నిలదొక్కుకోవాలంటే ఏదో ఒక వేదిక కావాలి కాబట్టి, ఒప్పుకొన్నా. ఆ సీరియల్ చాలా పాపులర్ అయ్యింది.
తెలుగు ప్రేక్షకుల గురించి?
ఇన్నాళ్లకు మళ్లీ తెలుగులో కనిపిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పటికీ నన్ను బేబీ సీతగానే గుర్తుపెట్టుకున్నారు తెలుగు ప్రేక్షకులు. ‘ఊహలు గుసగుసలాడే’ సీరియల్ ద్వారా తెలుగులో అవకాశం ఇచ్చిన జీ తెలుగుకు రుణపడి ఉంటాను.
నటి కాకపోయి ఉంటే?
ఊహ తెలియని వయసులోనే ఇండస్ట్రీలోకి వచ్చాను. కానీ, చదువు అంటే చాలా ఇష్టం నాకు. సినిమాల వల్ల తొమ్మిదో తరగతి దగ్గరే ఆగిపోయాను. బాగా చదువుకుని ఉంటే ఏ టీచరో, అడ్వకేటో అయ్యేదాన్ని. అలా అని, సినిమా తక్కువని కాదు. సినిమా వల్లే మా కుటుంబం బతికింది. సినిమా దైవంతో సమానం. చదువు కూడా ముఖ్యమే కదా!
ఇష్టమైన నటీనటులు?
శ్రీదేవిగారంటే చాలా ఇష్టం. సుహాసిని, భానుప్రియ, రాధ నా అభిమాన నటీమణులు. హీరోల్లో నాగార్జున, వెంకటేశ్, పవన్ కల్యాణ్, ప్రభాస్ అంటే ఇష్టం.
ఈ తరం నటులకు మీ సలహా?
పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో మనకు తెలియదు. వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా, శ్రద్ధతో పనిచేస్తే తప్పకుండా విజయం సాధిస్తారు. ముఖ్యంగా ఎవరినీ నొప్పించకుండా మెలగాలి. మనవల్ల లాభం కలగకపోయినా ఫర్వాలేదు, నష్టం మాత్రం ఉండకూడదు.
కుటుంబం గురించి?
నన్ను పెంచి పెద్దచేసిన అమ్మ, అమ్మమ్మ చనిపోయారు. ప్రస్తుతం అన్న, వదిన, వాళ్ల పిల్లలున్నారు. కొన్ని కారణాల వల్ల మొదటి వివాహ బంధాన్ని తెంచుకున్నా. మూడేండ్ల క్రితమే నా స్కూల్‌మేట్ అబ్దుల్ ఖాదర్‌ను పెండ్లి చేసుకున్నా. తను నన్ను చాలా ప్రోత్సహిస్తాడు. ప్రేమగా చూసుకుంటాడు.
సీరియల్స్‌వైపు ఎందుకొచ్చారు?
చెన్నైనుంచి పరిశ్రమలన్నీ వెళ్ళిపోయాక, తమిళ సినిమాలు చేస్తూ వచ్చాను. ఆ సమయంలోనే సీరియల్స్ బాగా పాపులర్ అవుతుండటంతో ఇటువైపు దృష్టిపెట్టాను. సీరియల్స్ చేస్తూ సినిమాలు కొనసాగిద్దామనుకున్నా. కానీ, సీరియల్స్‌లో నటించడం ప్రారంభించాక సినిమా
అవకాశాలు రాలేదు. నేనెప్పుడూ ఎవరినీ అవకాశం అడగలేదు. అందుకే, చేతి నిండా అవకాశాలున్న సీరియళ్లపైనే దృష్టిపెట్టా. జెమినీ, ఏవీఎమ్, రాడాన్, స్టార్ మా వంటి సంస్థలు నిర్మించిన పెద్దపెద్ద సీరియల్స్‌లో నటించా. ఇప్పటికైనా, ఈతరం హీరోలకు అక్క, వదిన, అమ్మ వంటి ప్రాధాన్యమున్న పాత్రల్లో నటించే అవకాశం వస్తే తప్పకుండా అంగీకరిస్తా.
… ప్రవళిక వేముల
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Philippines | ఫిలిప్పైన్స్‌లో రెండు సైనిక విమానాలు ఢీ.. నలుగురు పైలట్లు మృతి
MLA Sunitha lakshma Reddy | రైతులతో కలిసి ఎండిన వరి పంటతో సునీత లక్ష్మారెడ్డి ధర్నా
Prashant Neel | ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. ‘సలార్ 2’ షూటింగ్ గురించి ప్రశాంత్ నీల్ ఏమన్నారంటే!
NZvIND: న్యూజిలాండ్ 10 ఓవర్లలో 66/3
Prabhas | ప్రభాస్ కొత్త లైనప్.. ‘మిరాయ్’ దర్శకుడితో రెబల్ స్టార్ నెక్స్ట్ మూవీ?
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

