తమకంటూ కాస్తంత స్పేస్ ఇవ్వడమే.. టీనేజ్ పిల్లలకు తల్లిదండ్రులిచ్చే అతిపెద్ద బహుమతి అని అంటున్నది బాలీవుడ్ నటి కాజోల్. అదే పేరెంటింగ్‌లో అతిపెద్ద పాఠమని చెబుతున్నది. ఈ విషయంలో తన కూతురు నైసాతోనూ దాదాపు మూడేళ్లపాటు తీవ్రమైన విభేదాలు నడిచాయని వెల్లడించింది. తాజాగా, ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న కాజోల్.. పేరెంటింగ్, తన కూతురు నైసా దేవగన్‌తో ఉన్న అనుబంధం గురించి పంచుకున్నది. “నైసాకు 12 ఏళ్ల వయసున్నప్పుడు ఆమెపై హార్మోన్ల ప్రభావం తీవ్రంగా ఉండేది. దాంతో మా ఇద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి.
ఆ సమయంలో మేమిద్దరం చాలా అసహనంగా ఉండేవాళ్లం. లాజిక్ లేకుండా వాదించుకునేవాళ్లం” అంటూ చెప్పుకొచ్చింది. దాదాపు మూడేళ్లపాటు తల్లీకూతుళ్ల మధ్య మాటల్లేవనీ, కేవలం పోట్లాటలే ఉండేవనీ నాటి రోజులను గుర్తు చేసుకున్నది కాజోల్. అయితే, పిల్లలతో గొడవ పడటం వల్ల సమస్య పరిష్కారం కాదని తను త్వరగానే గ్రహించిందట. పెద్దదానిగా తానే ఒక అడుగు వెనక్కి వేయాలని నిర్ణయించుకున్నదట. “ఆ తర్వాత నేను మాట్లాడటం తగ్గించి, ఆమె చెప్పేది నేను ఓపికగా వినడం మొదలుపెట్టాను. దాంతో మా మధ్య ఉన్న దూరం తగ్గింది” అంటూ వెల్లడించింది.
అప్పటివరకూ ఒకరిపై ఒకరు అరుచుకున్న తామిద్దరం.. నెమ్మదిగా సుదీర్ఘమైన సంభాషణలు మొదలుపెట్టామని చెప్పింది. పేరెంటింగ్‌లో తాను నేర్చుకున్న అతిపెద్ద పాఠం ఇదేనని కాజోల్ వివరించింది. సినిమాల విషయానికి వస్తే.. కొన్నిరోజుల పాటు తెరకు దూరమైన కాజోల్, సెకండ్ ఇన్నింగ్స్‌లో దుమ్ము రేపుతున్నది. 2025లో మా, సర్జమీన్ చిత్రాలతో సత్తాచాటింది. అయితే, ఈ రెండు సినిమాల్లోనూ బిడ్డను రక్షించుకునే తల్లి పాత్రలోనే కాజోల్ నటించింది.