తండ్రి రెబల్ స్టార్, అన్నయ్య పాన్ ఇండియా స్టార్. కుటుంబంలో అంతా సినిమా వాతావరణమే. ఆమె అడుగులూ అటే పడ్డాయి. అలా అని, అండ ఉందని అనుకోగానే ప్రొడ్యూసర్ కాలేదు. సినిమా ప్రొడక్షన్లో కోర్సులు చేసింది. అనుభవం సంపాదించింది.. ‘రాధేశ్యామ్’తో నిర్మాతగా మారింది.. సిస్టర్ ఆఫ్ బాహుబలి.. ప్రసీద.
రాధేశ్యామ్‌కు వస్తున్న రెస్పాన్స్ ఎలా అనిపిస్తున్నది?
నాలుగేండ్ల్ల ఒత్తిడి నుంచి బయటపడ్డాం. అన్ని చోట్లా స్పందన బాగుంది. భారీ కలెక్షన్స్ వస్తున్నాయి. అభిమానులు చాలా
సంతోషంగా ఉన్నారు.
సినిమా కుటుంబం కాబట్టి ప్రొడక్షన్లోకి వచ్చారా?
చిన్నప్పటి నుంచీ సినిమాలు చూస్తూ పెరిగాను. ఇంట్లోనూ సినిమా వాతావరణమే. వ్యాపారం వైపు వెళ్లాలని ఉండేది. లండన్‌లో బిజినెస్ మేనేజ్మెంట్లో మాస్టర్స్ చేశాను. తర్వాత, మనవాళ్లు ఉన్న సినిమా రంగమే సరైన చాయిస్ అనిపించింది. నిర్మాతగా రాణించాలనుకున్నా. అమెరికా వెళ్లి ఫిలిం ప్రొడక్షన్ కోర్సు చేశాను. తర్వాత
హాలీవుడ్లో ఓ కంపెనీ కోసం పనిచేశాను.
సినిమాలు నిర్మిస్తానంటే ప్రభాస్ ఏమన్నారు?
నేను ప్రొడక్షన్లోకి రావడం అన్నయ్యకు ఇష్టమే! కానీ, నేను వెళ్లి చెప్పేవరకూ ఆయన ఓకే అనలేదు. నాకు ఏది ఇష్టమో.. అదే రంగంలోకి వెళ్లాలనేది అన్నయ్య కోరిక. ‘నీకు నా నుంచి పూర్తి సహకారం ఉంటుంది’ అని చెప్పాడు.
నిర్మాతగా భారీ బడ్జెట్ చిత్రంతో రావడానికి కారణం?
అన్నయ్యలు ప్రభాస్, వంశీ, ప్రమోద్ నాకు సపోర్ట్‌గా ఉన్నారు. నాన్న ధైర్యం చెప్పారు. వీళ్లంతా నా చుట్టూ ఉన్నారు కాబట్టి, సందేహించలేదు. అంతకుముందు ‘సాహో’ చిత్రానికి కొంతకాలం
ప్రొడక్షన్ టీమ్‌లో ఉండి కొన్ని విషయాలు తెలుసుకున్నా.
ఈ సినిమాలో నిర్మాణపరంగా చేసిన ప్రయోగాలు ఏంటి?
ఈ సినిమా కథ ప్రకారం ఇటలీలో షూటింగ్ చేయాలి. లాక్డౌన్ వల్ల చాలాసార్లు విదేశాలకు వెళ్లాల్సివచ్చింది. ప్రొడక్షన్ ఖర్చు బాగా పెరిగింది. దాంతో వర్చువల్ ప్రొడక్షన్ చేశాం. ‘అన్ రియల్ ఇంజిన్’ టెక్నాలజీతో ఇటలీ వెళ్లకుండానే అక్కడి లొకేషన్స్‌తో ఇక్కడే షూటింగ్ చేశాం. ఈ టెక్నాలజీతో ఇండియాలోనే ఇటలీ చూడొచ్చు.
ఈ టెక్నాలజీ ఖరీదైనదా?
ఏ కొత్త టెక్నాలజీ అయినా మొదట్లో ఖరీదు ఎక్కువగానే ఉంటుంది. అందరూ వాడటం మొదలైతే ధరలు తగ్గుతాయి. మాకు ఎక్కువే ఖర్చయింది.
పని విధానంలో హాలీవుడ్ సినిమాకు, ఇక్కడికి ఏం తేడా గమనించారు?
హాలీవుడ్లో పూర్తి ప్రొఫెషనల్‌గా ఉంటారు. ఆ పని వరకే చర్చించుకుంటారు. మన దగ్గర వ్యక్తిగత అనుబంధాలు ఎక్కువ. మనకు ఇదే సరైనది.
ఒక నిర్మాతగా నాన్న కృష్ణంరాజు నుంచి ఏం నేర్చుకున్నారు?
సినిమా అత్యుత్తమంగా ఉండాలని నాన్న కోరుకుంటారు. అందుకు ఖర్చు ఎక్కువైనా ఫర్వాలేదంటారు. ఈ క్రమంలో కొంత అనవసర ఖర్చూ ఉంటుంది. నాన్న నుంచి నేను నేర్చుకోకూడదు అనుకున్నది ఇదొక్కటే. ఎక్కడా వృథాగా ఖర్చుపెట్టకూడదు. సినిమాకు ఎంత కావాలో అంతలోనే పూర్తిచేయాలి. కొవిడ్ లాంటి సందర్భాలు వచ్చినప్పుడు ఎవరూ ఏమీ చేయలేరు. బడ్జెట్ సహజంగానే పెరుగుతుంది.
ప్రభాస్ స్టార్డమ్ చూస్తే సోదరిగా ఏమనిపిస్తుంటుంది?
అన్నయ్య ఒక్కో సినిమాకు రెండేండ్లు, మూడేండ్లు కేటాయించిన సందర్భాలున్నాయి. బాహుబలికి నాలుగేండ్లపైన సమయం పట్టింది. ఆయన గొప్ప స్టార్‌గా ఎదగడానికి కారణం ఆ అంకితభావమే.
ప్రభాస్‌తో ఫొటో దిగుతామని మీ స్నేహితులు అడుగుతుంటారా?
అది తరచూ జరిగే కార్యక్రమమే. ‘అన్నయ్యా! మా ఫ్రెండ్స్‌కు హాయ్ చెప్పవా’ అంటే వెంటనే స్పందిస్తాడు. స్నేహితులు ఫొటో కావాలన్నా.. సెట్స్‌కు వెళ్లి తీసుకుంటాం. నన్ను, నా ఫ్రెండ్స్‌ను ఎప్పుడూ కాదనడు.
రాఖీ పండుగకు ప్రభాస్ ఇచ్చిన బహుమతి ఏదైనా బాగా గుర్తుందా?
ప్రతి రాఖీ పండుగకు అన్నయ్య గిఫ్ట్ ఇస్తాడు. చిన్నప్పుడు నాకంటే పెద్దగా ఉన్న కుక్క బొమ్మ కొనిచ్చాడు. అది చూసి ఆశ్చర్యపోయా.
అన్నయ్య, నాన్న వ్యక్తిత్వాల్లో ఎలాంటి పోలికలు ఉన్నాయి?
తమ చుట్టూ ఉన్నవాళ్లను బాగా చూసుకోవడం, అందరితో మంచిగా కలిసిపోవడం, సినిమా కోసం ఎంతైనా కష్టపడటం.. ఇవీ ఇద్దరిలో పోలికలు.
ప్రభాస్ సరసన ఏ హీరోయిన్ బాగుంటుంది?
పూజా హెగ్డే, అన్నయ్య కెమిస్ట్రీ బాగుందని చెబుతున్నారు. ఇప్పటికైతే తనే అన్నయ్యకు బెస్ట్ పెయిర్ అనిపిస్తుంది.
ప్రభాస్ మీ కోసం సమయం కేటాయిస్తారా?
అన్నయ్య రెగ్యులర్‌గా మాతో టచ్‌లో ఉంటాడు. ఫోన్లో చాటింగ్ చేస్తుంటాడు. వీలైనప్పుడల్లా మేం కలుస్తుంటాం. ‘ఒక గంటలో వస్తాం’ అని అన్నయ్య దగ్గరకు వెళ్తాం కదా! ఇక రోజంతా సమయమే తెలియదు. అన్నయ్య కూడా ఆయన షెడ్యూల్ వాయిదా వేసుకుంటాడు. మా రెండో చెల్లెలు ప్రకీర్తి, అన్నయ్య బెస్ట్ ఫ్రెండ్స్. మా గ్యాంగ్‌లో అల్లరంతా వాళ్లదే!
ప్రభాస్‌ను బాగా చూపించిన దర్శకుడు?
రాజమౌళి గారే అన్నయ్యను బాగా చూపించగలరు.
వదిన కావాలని మీరూ అడుగుతుంటారా?
వదిన వస్తే బాగుంటుంది. కానీ, అది అన్నయ్య వ్యక్తిగత నిర్ణయం. పెళ్లి చేసుకోమని సరదాగా జోక్ చేస్తుంటాం. ఎవరైనా అడిగినప్పుడు మాత్రమే నాన్న కూడా అన్నయ్య దగ్గర పెళ్లి ప్రస్తావన తీసుకొస్తారు.
ఇకపైనా భారీ చిత్రాలే నిర్మిస్తారా?
కంటెంట్ బాగున్న చిత్రాలు చేయాలని ఉంది. అవి చిన్నవైనా, పెద్దవైనా ఓకే. ఓటీటీకి కూడా మంచి ప్రాజెక్ట్స్ చేయాలని ఉంది. మహిళలకు ఇప్పుడు చిత్రపరిశ్రమలో చాలా అవకాశాలు వస్తున్నాయి. న్యూ ఏజ్ ఫిల్మ్ ఒకటి ప్లాన్ చేస్తున్నాం.
ప్రస్తుతం చేస్తున్న చిత్రాలు?
అన్నయ్య హీరోగా, దర్శకుడు నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న ప్రాజెక్ట్ కెలో ప్రొడక్షన్ వర్క్‌లో ఉన్నా. చెల్లి ప్రకీర్తి కూడా ఆర్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పని చేస్తున్నది. ఈమధ్య ప్రేక్షకులు కంటెంట్ బాగున్న సినిమాలే చూస్తున్నారు. కాబట్టి నిర్మాతగా మంచి కథల మీద దృష్టి పెట్టాను.
– రమేష్ గోపిశెట్టి