హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 30: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) విద్యార్థి సంఘ ఎన్నికల్లో లెఫ్ట్, అంబేద్కర్ విద్యార్థి సంఘాల కూటమి విజయం సాధించిన సందర్భంగా కాకతీయ యూనివర్సిటీ మొదటి గేటు వద్ద వామపక్ష, అంబేద్కర్ విద్యార్థి సంఘాల నాయకులు సంబురాలు నిర్వహించారు. స్వీట్లు తినిపించుకుని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కేయూ పరిశోధక విద్యార్థి, జేఏసీ నాయకుడు దుగ్గెల తిరుపతి మాట్లాడుతూ హెచ్‌సీయూలో లెఫ్ట్, అంబేద్కర్ విద్యార్థి సంఘాల కూటమి విజయం మతోన్మాద భావజాలాన్ని ప్రోత్సహించే సంఘాలకు విద్యార్థులు ఇచ్చిన సమాధానమన్నారు.
విద్యాసంస్థల్లో విద్యార్థుల మధ్య విభజనలు సృష్టించి ఐక్యతకు ఆటంకం కలిగించే ప్రయత్నాలను విద్యార్థులు తిరస్కరిస్తున్నారన్నారు. హెచ్‌సీయూ ఫలితాలు మతోన్మాద శక్తులకు చెంపపెట్టు లాంటిదన్నారు. కార్యక్రమంలో డీఎస్ఏ రాష్ర్ట కన్వీనర్ కామగోని శ్రావణ్, ఏఎస్ఏరాష్ర్ట కార్యదర్శి దండు నవకిరణ్, పీఎస్‌ఎఫ్‌ఐ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పసుల వినయ్‌కుమార్, ఏఎంఎస్ ఏ అధ్యక్షుడు గుండు రాజేష్, కేయూ విద్యార్థి సంఘ నాయకులు దూడపాక అశోక్, భాగ్యరాజ్, రోనాల్డ్, అనిల్, కుమార్, సతీష్ పాల్గొన్నారు.