వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అక్టోబర్‌లో దసరా రోజున ఈ దవాఖానను ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నది. దీంతో అధికారులు పనుల్లో మరింత వేగం పెంచారు. గడువు సమీపిస్తుండడంతో ఇక్కడ మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించారు. తాజాగా దవాఖానలో ఆరు లేన్ల రహదారుల నిర్మాణ పనులను చేపట్టారు. మొదట హాస్పిటల్ ముందు భాగంలో నిర్మిస్తున్నారు. త్వరలోనే ఆటోనగర్ జంక్షన్ నుంచి వర్క్ ప్రారంభం కానున్నది. మొత్తం 2,500 మీటర్ల రోడ్డు నిర్మాణానికి ఆర్అండ్బీ ఇంజినీర్లు ప్రణాళిక రూపొందించారు.
– వరంగల్, జూలై 9(నమస్తేతెలంగాణ)
వరంగల్, జూలై 9(నమస్తేతెలంగాణ) : గ్రామీణ, పేద ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలను అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం వరంగల్‌లో రూ.1,116 కోట్లతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేపట్టింది. 2,100 పడకల సామర్థ్యంతో 24 అంతస్తులతో దీన్ని నిర్మిస్తున్నది. ప్రభుత్వ రంగంలో దేశంలోనే ఇదే అతిపెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కాబోతున్నది. ఈ హాస్పిటల్ నిర్మాణం పూర్తయితే ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు చుట్టు పక్కల జిల్లాల ప్రజలు హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇక్కడే వైద్య సేవలను పొందే అవకాశం కలుగనున్నది. ఇలాంటి హాస్పిటల్ వరంగల్‌లో ఉండాలని సీఎం కేసీఆర్ దీని నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఈ హాస్పిటల్ నిర్మాణ పనులు ప్రారంభమై ఏడాది గడిచింది. పద్దెనిమిది నెలల కాలపరిమితిలో దీని నిర్మాణాన్ని పూర్తి చేయాలని ప్రభుత్వం గడువు విధించింది. నిర్మాణ పనులను రహదారులు, భవనాల శాఖ ఇంజినీర్లు పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే 13 అంతస్తుల వరకు హాస్పిటల్ నిర్మాణం జరిగింది. స్లాబు పడిన ప్రతి అంతస్తులోనూ కరంట్, ప్లంబింగ్, ఇతర మౌలిక వసతులు కల్పిస్తున్నారు. అక్టోబర్‌లో ప్రారంభించనున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పనులపై ఉన్నతస్థాయి సమీక్షలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు పనుల పురోగతిపై అధికారులతో మాట్లాడి సూచనలు చేస్తున్నారు. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి కావాలని చెబుతున్నారు.
రాకపోకలకు అనువుగా..
సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లోకి ప్రవేశించేందుకు ప్రస్తుతం ఒకే రహదారి ఉంది. వరంగల్ – హనుమకొండ ప్రధాన రహదారి నుంచి మాత్రమే ఇంత పెద్ద దవాఖానలోకి ఎంట్రీ ఉంది. భవిష్యత్ అవసరాల మేర మరో మార్గం అవసరమని ఇటీవల అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ఉన్న మార్గం ఈ హాస్పిటల్లో విధులు నిర్వర్తించే వైద్యులు, సిబ్బందితో పాటు వీఐపీల రాకపోకలకే సరిపోనుందని, పేషెంట్లు, వారి అటెండెంట్లు, ఇతరుల కోసం రెండో మార్గం ఉండాల్సిందేనని పేర్కొన్నారు. ఆటోనగర్ నుంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌కు చేరుకునేలా రెండో రోడ్డు నిర్మాణం చేపట్టాలని ప్రతిపాదించారు.
కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ముందు నుంచి ఈ హాస్పిటల్లోకి ప్రవేశించే విధంగా రోడ్డు నిర్మిస్తే ఎమర్జెన్సీ విభాగం పనిచేసే ద్వారం వద్దకు అంబులెన్సు వంటి వాహనాలు సులువుగా చేరుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. ఆటోనగర్ జంక్షన్ నుంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కేఎంసీ వరకు సుమారు 600 మీటర్ల రోడ్డు నిర్మాణానికి అంచనాలనూ అందజేశారు. మొదట నాలుగు లేన్ల రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదనలు అందగా ప్రభుత్వం ఈ రోడ్డుతో పాటే హాస్పిటల్ లోపల అన్ని రోడ్లను కూడా ఆరు లేన్లుగా నిర్మించాలని నిర్ణయించింది. ఇటీవల ఈ హాస్పిటల్‌ను సందర్శించి నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి హరీశ్‌రావు ఆటోనగర్ జంక్షన్ నుంచి కొత్తగా ఆరు లేన్ల రహదారి నిర్మించనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు అధికారులు ప్రణాళిక రూపొందించారు.
అంతర్గత రహదారులు కూడా..
ఆటోనగర్ జంక్షన్ నుంచి హాస్పిటల్లో కేఎంసీ వరకు 600 మీటర్ల రోడ్డుతో పాటు ఈ హాస్పిటల్లో కూడా ఆరు లేన్ల రోడ్డు నిర్మాణ పనులు కొద్దిరోజుల క్రితం మొదలయ్యాయి. హాస్పిటల్ ముందుభాగంలో నిర్మాణ పనులు జెట్ స్పీడ్‌తో సాగుతున్నాయి. మొత్తం 2,500 మీటర్ల రహదారి నిర్మాణానికి ఆర్అండ్బీ ఇంజినీర్లు ప్లాన్ చేశారు. మధ్యలో డివైడర్, రెండు వైపులా మూడు వరుసల రోడ్డు, డ్రైనేజీ ఉండేలా నిర్మిస్తున్నారు.