భూపాలపల్లి టౌన్, ఏప్రిల్ 21: జిల్లా కేంద్రంలో రియల్ ఎస్టేట్ దందా జోరుగా సాగుతున్నది. దిన దినం అభివృద్ధి చెందుతున్న జిల్లా కేంద్రంపై రియల్ ఎస్టేట్ వ్యాపారులు కన్నేసి అనుమతులు లేకుండా ప్లాట్లు చేసి విక్రయిస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు. అవగాహన లేని వారు తక్కువ ధరకు వస్తుందని కొనుగోలు చేసి నష్టపోతున్నారు. పంట భూములు ప్లాట్లుగా మారుతున్నాయి. వెంచర్లలో సర్వే నంబర్లు తేడా రావడంతో వివాదాలు పెరిగి చాలామంది పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. ఇల్లీగల్ ప్లాటింగ్‌పై ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఇల్లీగల్ ప్లాటింగ్‌పై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో అధికారులను పలుమార్లు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు అక్రమ వెంచర్లపై చర్యలు కరువయ్యాయి.
యథేచ్ఛగా..
జిల్లా కేంద్రంలో ఇల్లీగల్ ప్లాటింగ్ యథేచ్ఛగా కొనసాగుతున్నది. కొన్ని పర్మిషన్లతో ఏర్పాటు చేస్తుండగా, అనుమతులు తీసుకోకుండా చేస్తున్నవే ఎక్కువగా ఉన్నాయి. పంట భూములను ధర నిర్ణయించుకుని లెవలింగ్ చేసి నామమాత్రంగా రోడ్డు వేసి హద్దులు ఏర్పాటు చేసి విక్రయించి చేతులు దులుపుకుంటున్నారు. ఆతర్వాత కొనుగోలు చేసినవారు ఇంటి పర్మిషన్లు రాక, కొరవడిన సౌకర్యాల నడుమ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భూపాలపల్లిలో అనుమతులు లేకుండా అధిక సంఖ్యలో లే అవుట్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం 2020కి ముందు ఎలాంటి అనుమతులు లేకుండా చేసిన వెంచర్లలో విక్రయించిన ప్లాట్లు కొనుగోలు చేసిన వారికి రెగ్యులర్ చేసుకునేందుకు ఎల్ఆర్ఎస్ స్కీమ్ ప్రవేశపెట్టింది.రెగ్యులరైజ్ కోసం కొనుగోలుదారులు లక్షలాది రూపాయలు చెల్లించాల్సి వచ్చింది. అదే అప్రూవల్ లే అవుట్లలో ప్లాట్లు కొనుగోలు చేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అనుమతులు లేని వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసిన వారు సర్వే నంబర్లు వేర్వేరుగా వివాదాల్లో చిక్కుకొని పోలీస్ స్టేషన్లు, కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. విచారణ జరిపితే ఇల్లీగల్ ప్లాటింగ్ అనేకం బయటపడే అవకాశాలున్నాయి.
57 ఎకరాల్లో.. 13 అక్రమ వెంచర్లు
జిల్లా కేంద్రంలో 57 ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎలాంటి అనుమతులు లేకుండా ఏర్పాటు చేశారు. గుడ్ మార్నింగ్ స్కూల్ సమీపంలో 143 సర్వే నంబర్లో రెండు ఎకరాల్లో ఒక వెంచర్ ఏర్పాటు చేశారు. కేటీకే 8 ఇైంక్లెన్ రోడ్డులో 172, 173 సర్వే నంబర్లో రెండు ఎకరాల్లో వెంచర్, కుందూరుపల్లి గ్రామ రోడ్డు వెంట 174, 175 సర్వే నంబర్లలో నాలుగు ఎకరాల్లో మూడు వెంచర్లు, 181 సర్వే నంబర్లో ఐదు ఎకరాల్లో ఒక వెంచర్, ఏఎస్ఆర్ గార్డెన్ వెనుక 309, 310, 319, 320 సర్వే నంబర్లలో 25 ఎకరాల్లో మూడు వెంచర్లు, సన్‌వ్యాలీ పాఠశాల దగ్గర 146 సర్వే నంబర్లో 14 ఎకరాల్లో మూడు వెంచర్లు, భాస్కర్‌గడ్డలో 361 సర్వే నంబర్లో ఐదు ఎకరాల్లో ఒక వెంచర్ చేశారు.
చర్యలు తీసుకుంటాం
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎలాంటి అనుమతులు లేకుండా వెంచర్లు చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. గతంలోనూ మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఈ విషయమై రియల్ ఎస్టేట్ వ్యాపారులను హెచ్చరించినట్లు తెలిసింది. నేను కొత్తగా బాధ్యతలు తీసుకున్నాను. అనుమతులు లేని వెంచర్లపై విచారణ జరిపి నోటీసులు ఇచి కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి చర్యలు తీసుకుంటాం. – అనిల్‌కుమార్, ఇన్చార్జి కమిషనర్