యురేనియంపై యూటర్న్

- తెలంగాణ సర్కార్ వ్యతిరేకతతో దిగొచ్చిన కేంద్రం
- నల్లమలలో యురేనియం తవ్వకాలు నిలిపివేత
- ఖనిజాన్వేషణ సర్వే ప్రాజెక్టు నుంచి వెనుకడుగు
- నల్లగొండ జిల్లాలోని పెద్దగుట్టకూ తప్పిన ముప్పు
- వెలికితీతను ఉద్యమనేతగానే వ్యతిరేకించిన కేసీఆర్
- వన్యప్రాణుల సంరక్షణ, చెంచుల భద్రతకే రాష్ట్రం పెద్దపీట
- పార్లమెంట్‌లోనూ గళం వినిపించిన టీఆర్ఎస్ ఎంపీలు
నల్లమలలో చెంచుల జీవన భద్రత, అటవీ జంతువుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ కోసం తెలంగాణ ప్రభుత్వ ఆవిశ్రాంత పోరాటం ఫలించింది. అడవిబిడ్డల ఆకాంక్ష నెరవేరింది. యురేనియం అన్వేషణకు చేపట్టిన సర్వేను కేంద్రం పూర్తిగా నిలిపివేసింది. యురేనియం నిక్షేపాల అన్వేషణకు చేపట్టిన బోర్‌వెల్స్, డ్రిల్లింగ్ ప్రణాళికలను నిలిపివేస్తున్నట్టు ఇండియన్ న్యూక్లియర్ సొసైటీ ఇటీవల నిర్వహించిన రేడియేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెమినార్లో ఆటమిక్ మినరల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ డీకే సిన్హా ప్రకటించారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 11 (నమస్తే తెలంగాణ): నల్లమల అటవీ ప్రాంతంతోపాటు, నల్లగొండ పెద్దగుట్టలో యురేనియం ఖనిజాన్వేషణపై కేంద్రం యూటర్న్ తీసుకున్నది. తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్రప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో యురేనియం సర్వే నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది. నిక్షేపాల అన్వేషణకు చేపట్టిన బోర్‌వెల్స్, డ్రిల్లింగ్ ప్రణాళికలను నిలిపివేస్తున్నట్టు ఆటమిక్ మినరల్ డిపార్ట్మెంట్(ఏఎండీ) డైరెక్టర్ డీకే సిన్హా తెలిపారు. దీనిపై పర్యావరణ ప్రేమికులు, అడవి బిడ్డల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
ఉమ్మడి రాష్ర్టంలోనే వ్యతిరేకించిన ఉద్యమనేత
అణువిద్యుత్తు, అణ్వాయుధాల తయారీలో యురేనియం కీలకమైనది. దీని రేడియో ధార్మికత లక్షణం చాలా ప్రమాదకరమైనది. పర్యావరణానికి తీవ్ర హాని తలపెడుతుంది. యురేనియంను వెలికితీయడం, నిల్వచేయడం సవాళ్లతో కూడుకున్నది. తెలంగాణ పరిధిలోని నల్లమల అటవీప్రాంతంలో అమ్రాబాద్ టైగర్ రిజర్వ్(ఏటీఆర్), నల్లగొండ పెద్దగుట్ట ప్రాంతాల్లో యురేనియం నిక్షేపాలు ఉన్నట్టు డిపార్ట్మెంట్ ఆఫ్ ఆటమిక్ ఎనర్జీ (డీఏఈ) 1995లోనే గుర్తించింది. అప్పటినుంచి దాని అన్వేషణ, వెలికితీతకు ప్రయత్నాలు మొదలయ్యాయి. యురేనియం వెలికితీత ప్రయత్నాలను నాడు ఉద్యమనేతగా ఉన్న కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకించారు. నల్లమల అటవీప్రాంతం జీవవైవిధ్యానికి చిరునామా అని, పులులకు నిలయమని, ప్రాజెక్టు వల్ల చెంచుల జీవనం ప్రశ్నార్థకంగా మారుతుందని నినదించారు. 2012లో నల్లమలలో ఓ ప్రైవేట్ కంపెనీ గుట్టుచప్పుడు కాకుండా తవ్వకాలను చేపట్టడంతో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆ ప్రాంతంలో విస్తృతంగా పర్యటించారు. యురేనియం వెలికితీతకు వ్యతిరేకంగా ఉద్యమించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టాక కూడా కేసీఆర్ యురేనియం వెలికితీతను తీవ్రంగా వ్యతిరేకించారు.
గుట్టుచప్పుడు కాకుండా అనుమతులు
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తెలంగాణలో యురేనియం ఖనిజాన్వేషణ మళ్లీ తెరపైకి వచ్చింది. అసలు ఈ ప్రాంతంలో యురేనియం నిక్షేపాలు ఎంత పరిధిలో విస్తరించి ఉన్నాయి? ఎంత లోతులో ఉన్నాయి? అనేది గుర్తించేందుకు డ్రిల్లింగ్ చేపట్టాలని 2015-16లో డీఏఈ నిర్ణయించింది. అమ్రాబాద్, నల్లగొండ జిల్లాల్లో మొత్తంగా 83 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 4 వేల బోర్లు వేయాలని ప్రతిపాదించిన ఆటమిక్ మినరల్స్ డెవలప్మెంట్ (ఏఎండీ).. ఇందుకోసం సుమారు రూ.45 కోట్ల అంచనా వ్యయంతో సర్వే ప్రాజెక్టును కూడా సిద్ధం చేసింది. అనుమతుల కోసం తెలంగాణ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. నల్లమల జీవవైవిధ్యం, పులుల సంరక్షణ, చెంచుల జీవన భద్రతను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం ఆ ప్రతిపాదనను తిరస్కరిస్తున్నట్టు ప్రకటించింది. రాష్ట్రప్రభుత్వ నివేదికను పట్టించుకోకుండా కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణమార్పుల మంత్రిత్వశాఖ 2019లో గుట్టుచప్పుడు కాకుండా ఆ సర్వేకు అనుమతులు మంజూరుచేసింది. దీనిపై తెలంగాణ ప్రభుత్వంతోపాటు, పర్యావరణ ప్రేమికులు, చెంచులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. టీఆర్ఎస్ ఎంపీలు ఈ విషయాన్ని పార్లమెంట్లో పలుమార్లు లేవనెత్తారు. వైల్డ్‌లైఫ్ సర్వే కోసమే అనుమతులు మంజూరుచేశామని, యురేనియం అన్వేషణ కోసం కాదంటూ అప్పటి కేంద్రమంత్రి తప్పించుకొనే ప్రయత్నం చేశారు.
అసెంబ్లీలో కేసీఆర్ అభయం
నల్లమలలో యురేనియం వెలికితీతతో కలిగే నష్టాలపై తెలంగాణ ప్రభుత్వం అటవీశాఖ ద్వారా కేంద్రానికి సవివరమైన నివేదికను సమర్పించింది. ‘యురేనియం తవ్వకాలకు మా ప్రభుత్వం వ్యతిరేకం, నల్లమల అడవులను నాశనం చేసేందుకు అనుమతించేదే లేదు. సర్వే కృష్ణానదిని కలుషితం చేస్తుంది. దానినుంచి తాగునీరు సరఫరా అయ్యే హైదరాబాద్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎట్టిపరిస్థితుల్లోనూ దీనికి అనుమతించం’ అంటూ 2019లో ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించి ఆదివాసీలకు అభయమిచ్చారు. టీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకతతో ఎట్టకేలకు కేంద్రం దిగివచ్చింది.
Read Today's Latest Top-slides News in Telugu and Telugu News
- Tags
- environment
- forest
- KCR
- Nature
RELATED ARTICLES
తాజా వార్తలు
Balmuri Venkat | కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ భూకబ్జాపై సీపీఎం నాయకుల ఆందోళన.. వీడియో
Yuvraj Singh | మొన్నటి వరకు మెంటర్.. ఇప్పుడు బ్యాటింగ్ కోచ్‌గా యువరాజ్..!
L Murugan | కేంద్ర మంత్రి పదవికి ఎల్ మురుగన్ రాజీనామా.. బీజేపీని తమిళనాడులో బలోపేతం చేసేందుకేనని ప్రకటన
Farmers Protest | విద్యుత్ సిబ్బంది పట్టించుకోవడం లేదు.. కరెంటు కోసం రైతుల రాస్తారోకో
‘యాసంగిలో రైతులు వరి సాగుకు దూరంగా ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

