హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తే తెలంగాణ) : ఏ ఫైల్ కదలాలన్న ఆ యూనియన్ నేతను ప్రసన్నం చేసుకోవాల్సిందే.. బదిలీల నుంచి డిప్యుటేషన్ల వరకు అన్నింటా ఆ నేత చెప్పిందే అక్కడ వేదం.. రోజువారీ పాలనా వ్యవహారాలూ ఆయన కనుసన్నల్లోనే జరుగుతాయి.. అక్కడి కీలకాధికారి కనుసన్నల్లోనే ఈ తంతు నడుస్తున్నదని పలువురు సిబ్బంది బాహాటంగానే చెప్తున్నారు.. ఇవన్నీ తెలంగాణ వైద్య విధాన పరిషత్(టీవీవీపీ)లో ఓ యూనియన్ నేత అన్నీతానై చక్రం తిప్పుతున్నాడనే ఆరోపణలకు నిదర్శనాలు. ఆరోగ్యశాఖ ఉన్నతస్థాయిలో ఉన్న కీలకాధికారికి బినామీగా చలామణి అవుతూ గత కొంతకాలంగా పెద్ద ఎత్తున పైరవీలకు పాల్పడుతున్నట్టు ఆ నేతపై ఆరోపణలున్నాయి. కమిషనర్ కార్యాలయంలో నిత్యం జరిగే పాలనా వ్యవహారాల నుంచి బదిలీలు, డిప్యుటేషన్ల వరకు ఆ నేత చెప్పినట్టే నడుస్తున్నాయని ఆ శాఖ వైద్యాధికారులే మండిపడుతున్నారు.
ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేకున్నా ఆ యూనియన్ నేత మితిమీరిన జోక్యంపై పలువురు ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టీవీవీపీలో డిప్యుటేషన్లకు సదరు యూనియన్ నేత రేట్ ఫిక్స్ చేసినట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి. ఒక్కో డిప్యుటేషన్‌కు డిమాండ్ ఉన్న ప్లేస్‌ను బట్టి రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు వసూలు చేస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. కొందరు మహిళా ఉద్యోగుల ఫైళ్లు కదలాలంటే తన కోరిక తీర్చాలని వేధింపులకు పాల్పడుతున్నట్టు కూడా పలువురు ఆరోపిస్తున్నారు. వైద్యశాఖ ఉన్నతాధికారుల అండలేకుంటే ఓ యూనియన్ నేత ఈ స్థాయిలో అజమాయిషీ చెలాయించడం ఎలా సాధ్యమని పలువురు ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు.
విభాగాధిపతులతో సమాంతరంగా సదరు నేత టీవీవీపీలో చక్రం తిప్పడంపై వైద్యవర్గాలు తీవ్ర ఆందోళన వ్యక్తంచేస్తున్నాయి. ఎలాంటి అర్హత, జీవో లేకున్నా సదరు యూనియన్ నేత ఏకంగా హెచ్‌వోడీల భేటీకి హాజరు కావడంపై సొంతశాఖ వైద్యాధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. టీవీవీపీలో శాఖాపరమైన రివ్యూ మీటింగ్‌లకు ఏ హోదాతో ఆ యూనియన్ నేత హాజరవుతున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ పెద్దలు దవాఖానల పర్యటనలకు ముందే ఆయా చోట్ల ఆ యూనియన్ నేత వెళ్లి పరిశీలించి వస్తున్నట్టు సమాచారం. ఈ స్థాయిలో యూనియన్ నేతకు ప్రత్యేక అధికారాలు కల్పించింది ఎవరు? అని సొంత శాఖ ఉద్యోగులే ప్రశ్నిస్తున్నారు.
టీవీవీపీ కమిషనర్‌గా పనిచేసిన డాక్టర్ అజయ్ కుమార్ గత మే 31న ఉద్యోగ విరమణ పొందారు. అప్పటినుంచి ఆ పోస్టు ఖాళీగానే ఉన్నది. టీవీవీపీకి పూర్తిస్థాయి కమిషనర్ లేకపోవడంతో పెన్షన్లు, ఇంక్రిమెంట్లు, సరెండర్ లీవ్‌లు, జీపీఎఫ్, ఫిర్యాదుల ఫైళ్లపై స్పందనే కరువైందని పలువురు ఆరోపిస్తున్నారు. టీవీవీపీ పరిధిలో ఓ మహిళా వైద్యురాలు మూడు నెలల క్రితం డిప్యుటేషన్ పొందారు. ఆ వైద్యురాలికి ఇప్పటివరకు మూడు నెలల జీతం రాని దుస్థితి నెలకొన్నది. అయినా పట్టించుకొనే నాథుడే లేడు. టీవీవీపీ కమిషనర్ పోస్టును భర్తీ చేయాలని సీఎంవో నుంచి స్పష్టమైన ఆదేశాలు ఉండటంతోపాటు ఇప్పటికే అర్హుల జాబితా సైతం సిద్ధమైంది. కానీ వైద్యశాఖ ఉన్నతాధికారులు ఆ పోస్టును భర్తీ చేయకపోవడం వెనుక ఉన్న మతలబు ఏంది? అన్నది తేలాల్సి ఉన్నది. తాము అనుకున్న పనులన్నీ చక్కదిద్దుకొనేందుకే ఈ కీలక పోస్టును భర్తీ చేయడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి టీవీవీపీ కమిషనర్ పోస్టును భర్తీ చేయడంతోపాటు.. సదరు యూనియన్ నేత ఆగడాలపై చర్యలు తీసుకోవాలని ఆ శాఖ అధికారులు, సిబ్బంది కోరుతున్నారు.