పట్నం రానక్కర్లేదు. కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరగనక్కర్లేదు. ఫీజులు కట్టే పనిలేదు. పుస్తకాల కోసం జేబులు గుల్ల చేసుకోనక్కర్లేదు. కడుపు మాడ్చుకునే పరిస్థితే లేదు. కొలువు కొట్టాలనే కసి.. మొక్కవోని సంకల్పం ఉంటే చాలు.. ఆ ఆశయాలకు దారిదీపమై నిలుస్తున్నది తెలంగాణ ప్రభుత్వం. నీడనిచ్చి.. జ్ఞానతృష్ణను తీర్చి.. పోటీలో నెగ్గేందుకు తర్ఫీదునిచ్చి.. కొలువు కలల సాకారానికి బాటలు పరుస్తున్నది. అదీ ముఖ్యమంత్రి కేసీఆర్ విజన్. రాష్ట్ర ఏర్పాటు నుంచీ నిరుద్యోగుల ఆకాంక్షలు ప్రతిఫలించేలా.. పేద, మధ్యతరగతి ఉద్యోగార్థులకు అండగా నిలిచేలా ప్రణాళికాబద్ధంగా అన్నీ చర్యలు చేపట్టారు. సకల వసతులను ఉచితంగా కల్పిస్తున్నారు. పోటీ ప్రపంచంలో పట్టణ, గ్రామీణ యువతను సమ ఉజ్జీలుగా నిలుపుతూ వారి ఉన్నత భవితకు బాటలు వేస్తున్నారు. ఆయా స్టడీ సర్కిళ్లలో కొనసాగుతున్న కార్యక్రమాలపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.
హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): ఉద్యోగార్థుల కలల సాకారానికి వెన్నుదున్నుగా నిలుస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. నూతన జోనల్ విధానాన్ని ఏర్పాటు చేసి 95% పోస్టులు తెలంగాణ యువతకే దక్కేలా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే దాదాపు 1.42 లక్షల పోస్టులను భర్తీ చేసిన ప్రభుత్వం తాజాగా 81 వేల పోస్టుల భర్తీకి వరుస నోటిఫికేషన్లు జారీ చేస్తున్నది. పేద మధ్యతరగతి ఉద్యోగార్థులపై ఆర్థికభారం పడకుండా పోటీ పరీక్షలకు శిక్షణ కార్యక్రమాలను సైతం ఉచితంగా నిర్వహిస్తున్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖల ఆధ్వర్యంలోని స్టడీ సర్కిళ్ల ద్వారా మెరుగైన శిక్షణ ఇచ్చి పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు బాసటగా నిలుస్తున్నది. గ్రూప్-4 నుంచి సివిల్స్ వరకు అన్ని పోటీ పరీక్షలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉచితంగా నాణ్యమైన శిక్షణను హైదరాబాద్‌కే పరిమితం చేయకుండా అన్ని జిల్లా కేంద్రాలకు, ముఖ్య పట్టణాలకు విస్తరింపజేసింది.
ఎక్స్‌లెన్స్ సెంటర్లుగా స్టడీ సర్కిళ్లు
గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ స్టడీ సర్కిళ్లు హైదరాబాద్‌తోపాటు ఒకటి రెండు జిల్లా కేంద్రాలకు మాత్రమే పరిమితమయ్యాయి. అందులోనూ అరకొర వసతులే ఉండేవి. తెలంగాణ ప్రభుత్వం స్టడీ సర్కిళ్లపై ప్రత్యేక దృష్టి సారించింది. వాటిని ఉమ్మడి జిల్లా కేంద్రాలకు విస్తరించింది. ఎక్స్‌లెన్స్ సెంటర్లుగా తీర్చిదిద్దుతున్నది. డిజిటల్ తరగతులను అందుబాటులోకి తీసుకొచ్చింది. యువతీ, యువకులకు వేర్వేరుగా హాస్టల్స్, నిపుణులతో ప్రత్యేక క్లాసులు నిర్వహిస్తున్నది. స్టడీ సర్కిళ్లలో గ్రంథాలయాలను నెలకొల్పుతున్నారు. ఉద్యోగార్థులు ఏ పుస్తకం కోరినా వెంటనే అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఎప్పటికప్పుడు కొత్త ఎడిషన్లు కొనుగోలు చేస్తున్నారు. సివిల్స్, గ్రూప్-1, గ్రూప్-2, రైల్వే, పోస్టల్, డీఎస్సీతోపాటు ఇతర అన్ని పోటీపరీక్షలకు సంబంధించిన పుస్తకాలను సమకూర్చుతున్నారు. స్టడీ మెటీరియల్‌ను తక్కువ ధరకే జిరాక్స్ తీసివ్వడంతోపాటు పెన్‌డ్రైవ్‌లలో కాపీ చేసి ఇస్తున్నారు. ప్రభుత్వం కంప్యూటర్ ల్యాబ్‌లను సైతం అందుబాటులో తీసుకొచ్చింది. ప్రభుత్వం కల్పించిన వసతులు, అందిస్తున్న చేయూతతో ఎంతోమంది పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన యువత ఉన్నత కొలువులను సాధిస్తున్నారు.
ఫౌండేషన్ కోర్సులు.. ఉపకార వేతనాలు
స్టడీసర్కిళ్లు ఉద్యోగార్థులకు కోచింగ్ ఇవ్వడమేగాకుండా ఫౌండేషన్ కోర్సులను నిర్వహిస్తున్నాయి. రైల్వే, బ్యాంకింగ్, గ్రూప్స్, సివిల్స్ తదితర పోటీ పరీక్షలపై అవగాహన కల్పించేందుకు 45-60 రోజుల స్వల్పకాలిక శిక్షణ కోర్సులను అందిస్తున్నాయి. పోలీస్ కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాలకు ఫిజికల్ ట్రైనింగ్, సివిల్స్ అభ్యర్థులకు పుస్తకాల కొనుగోలు కోసం ప్రత్యేకంగా గ్రాంట్‌ను అందిస్తున్నారు. గ్రూప్-1 మెయిన్స్ కోచింగ్ తీసుకుంటున్న ఎస్సీ, బీసీ అభ్యర్థులకు రూ.5,000, ఎస్టీలకు రూ.10 వేల గ్రాంట్‌ను మూడు నెలలపాటు అందిస్తున్నారు.
ఆన్లైన్ శిక్షణ
ఉద్యోగార్థులకు టెలిగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ తదితర సామాజిక మాధ్యమాల ద్వారా శిక్షణ తరగతులను నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రత్యేక డీటీహెచ్ చానళ్లను ఏర్పాటు చేసింది. టీసాట్ ద్వారా ఆయా పోటీ పరీక్షలకు సంబంధించిన అంశాలను షెడ్యూల్ ప్రకారం ప్రసారం చేస్తున్నది. నిపుణులతో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు, విజేతలు, ఉన్నతాధికారులతో ఇంటర్వ్యూలు నిర్వహిస్తూ స్ఫూర్తిని నింపుతున్నది. బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఇన్స్టాగ్రామ్ ద్వారా గ్రూప్స్, జనరల్ స్టడీస్ తదితర పోటీ పరీక్షలకు ప్రతి రోజూ 100 ప్రశ్నలను ప్రాక్టీస్ చేయిస్తున్నారు. గ్రూప్స్, ఎస్సెస్సీ, రైల్వే, బ్యాంకింగ్, యూపీఎస్సీ ఇలా అన్ని పోటీపరీక్షలకు సంబంధించి దాదాపు 300లకుపైగా వీడియోలను అందుబాటులో ఉంచారు. స్టడీ సర్కిల్లో శిక్షణ పొందుతున్నవారితో ప్రత్యేక గ్రూప్‌ను ఏర్పాటు చేసి నిపుణుల ద్వారా సందేశాలు నివృత్తి చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. దేశవ్యాప్తంగా వెలువడుతున్న ఉద్యోగ ప్రకటనల సమాచారాన్ని కూడా ఉద్యోగార్థులకు అందిస్తుండటం విశేషం. ‘తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్’ యాప్‌లో నమూనా ప్రశ్నపత్రాలు, స్టడీ మెటీరియల్స్, ప్రాక్టీస్ పేపర్లు, వీడియో పాఠాలను అప్లోడ్ చేశారు.
స్టడీ సర్కిళ్ల విజయగీతిక
ప్రభుత్వం అందిస్తున్న శిక్షణతో పేద, మధ్యతరగతి ఉద్యోగార్థులు తమ కలలను సాకారం చేసుకుంటున్నారు. పోటీపరీక్షల్లో సత్తా చాటుతున్నారు. గతంతో పోల్చితే ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టడీ సర్కిళ్ల సక్సెస్ రేట్ పెరగడమే అందుకు నిదర్శనం. ఉమ్మడి రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ స్టడీ సర్కిళ్లలో శిక్షణ పొందినవారిలో కనీసం 5%, బీసీ స్టడీ సర్కిళ్లలో 10% మంది కూడా విజయం సాధించని దుస్థితి. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీ సర్కిళ్లలో శిక్షణ పొందుతున్న వారిలో 15%, బీసీ స్టడీ సర్కిళ్లలో 22.17% మంది ఉద్యోగాలు సాధిస్తుండటం విశేషం. తెలంగాణ ప్రభుత్వం భర్తీ చేసిన కానిస్టేబుళ్లు, బీట్ ఆఫీసర్లు, హాస్టల్ వెల్ఫేర్, సింగరేణి, గురుకుల ఉపాధ్యాయ, పంచాయతీ కార్యదర్శులు, ఫైర్ ఆఫీసర్లతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలైన రైల్వే, ఎల్ఐసీ డెవలప్మెంట్ ఆఫీసర్లుగా ఎంతోమంది ఎంపికయ్యారు. అన్ని స్టడీ సర్కిళ్లు కలుపుకుని దాదాపుగా 8 వేల మందికిపైగా అభ్యర్థులు ఉద్యోగాలను సాధించడం విశేషం.
దివ్యాంగులపై ప్రత్యేక దృషి
తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగ యువతపైనా ప్రత్యేక దృష్టిని సారించింది. రాష్ట్రంలోని అన్ని శాఖల పరిధిలో 80 వేల పైచిలుకు పోస్టులను భర్తీ చేయనుండగా, అందులో 4% రిజర్వేషన్ కోటా కింద దాదాపు 3,200 ఉద్యోగాలు దివ్యాంగులకే దక్కనున్నాయి. ఈ నేపథ్యంలో దివ్యాంగ ఉద్యోగార్థులకు ఉచిత శిక్షణ అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రాష్ట్ర దివ్యాంగ సంక్షేమశాఖ హైదరాబాద్‌లో స్టడీ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. బీసీ స్టడీ సర్కిల్ సహకారంతో గ్రామీణ ప్రాంతాల్లోని దివ్యాంగులకు ఉచిత శిక్షణ అందించేందుకు కృషి చేస్తున్నది. దివ్యాంగుల ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా ట్యూషన్ ఫీజు కింద రూ.7 వేల నుంచి రూ.20 వేలు, స్టడీ మెటీరియల్ కోసం రూ.1,000, ఇతర ఖర్చులకు రూ.2,000 చొప్పున మూడు నెలల పాటు ఆర్థిక సహకారం అందిస్తున్నది. బధిరులు, అంధుల కోసం వేర్వేరుగా సైన్ లాంగ్వేజీల్లో వీడియో పాఠాలు, బ్రెయిలీ లిపిలో కొన్ని పోటీ పరీక్షల స్టడీ మెటీరియల్స్ అందుబాటులోకి తెచ్చింది.
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
ముఖ్యమంత్రి కేసీఆర్ మార్గదర్శకాల మేరకు బీసీ స్టడీ సర్కిళ్లను ఎక్సలెన్స్ సెంటర్లుగా తీర్చిదిద్దుతున్నాం. ఆన్లైన్, ఆఫ్‌లైన్ ద్వారా ఉద్యోగార్థులకు శిక్షణ అందిస్తున్నాం. విలువైన స్టడీ మెటీరియల్స్ అందుబాటులో ఉంచుతున్నాం. అన్ని పోటీపరీక్షలపై అవగాహన కల్పించడంతోపాటు అభ్యర్థులకు సమాచారం అందిస్తున్నాం. విజయం సాధించేలా ప్రోత్సహిస్తున్నాం. ఈ అవకాశాన్ని ఉద్యోగార్థులు వినియోగించుకోవాలి. – అలోక్‌కుమార్, బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్