దేశంలోనే మొదటి పది ఆదర్శ గ్రామాలు మన తెలంగాణవే! ఈ విషయాన్ని కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ తన వెబ్సైట్లో పేర్కొన్నది. సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజనా పథకం కింద ఎంపికైన గ్రామాల వివరాలను తాజాగా ఆ వెబ్సైట్లో ఉంచారు. దేశంలోని మొదటి 20 ఆదర్శ గ్రామాల్లో19 గ్రామాలు తెలంగాణకు చెందినవే కావడం విశేషం. ఇది తెలంగాణ వస్తే ఏమొస్తది? అన్నవాళ్లకు సూటి సమాధానం. ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ, సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు, ఈ శాఖను చూస్తున్న మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు అభినందనలు తెలుపుతూ రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ఇదంతా సీఎం కేసీఆర్ మానస పుత్రిక పల్లె ప్రగతి సాధించిన ఘనతేనని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు రీట్వీట్ చేశారు. ఇటీవలే వచ్చిన 19 అవార్డులకు ఇది అదనంగా వచ్చిన ప్రశంస అని ఎర్రబెల్లి పేర్కొన్నారు.
పార్లమెంట్ సభ్యులు తమ నియోజకవర్గాలు, దేశంలోని ఏవైనా గ్రామాలు ఎంపిక చేసుకుని వాటి అభివృద్ధికి కృషి చేసే విధంగా రూపొందించిన పథకమే సంసద్ ఆదర్శ్ గ్రామీణ యోజనా. ఈ పథకం కింద ఎంపీలు ఎంపిక చేసుకున్న గ్రామాల అభివృద్ధిని మదింపు చేసి కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తమ గ్రామాలను ఎంపిక చేస్తుంది. కాగా, ఈ వివరాలను SAGY – Top 10 GPs of Telangana State in SAANJHI Portal అనే వెబ్సైట్లో చూడొచ్చు.
ఇదిలా వుండగా, ఇప్పటికే స్వచ్ఛ, ఈ పంచాయతీ, ఈ ఆడిటింగ్, బహిరంగ మల విసర్జన రహిత (ఓడీఎఫ్) లాంటి అనేక అంశాల్లో తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాలు దేశానికే ఆదర్శంగా నిలిచిన విషయం తెలిసిందే. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఒక్క గంగదేవి పల్లె గ్రామాన్ని దేశానికి ఆదర్శంగా పేర్కొనేవారు. కానీ, ఈ రోజు సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని అమలు చేస్తుండగా, గ్రామ పంచాయతీలకు నిధులు, అదనపు వనరులు, హంగులు తోడై అన్ని రంగాల్లో గ్రామాలు ఆదర్శంగా మారుతున్నాయి. ఇందుకు నిదర్శనమే ఈ ఉత్తమ గ్రామాల ఎంపిక, ప్రశంస.
దేశంలోని టాప్ 10 గ్రామాల వివరాలు..
1. యాదాద్రి భువనగిరి జిల్లా వడపర్తి (స్కోర్: 92.17)
2. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం కొండాపూర్ (స్కోర్: 91.7)
3. నిజామాబాద్ జిల్లా పల్డా (స్కోర్: 90.95)
4. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం రామకృష్ణాపూర్ (స్కోర్:90.94)
5. యాదాద్రి భువనగిరి జిల్లా అలేరు మండలం కొలనుపాక (స్కోర్: 90.57)
6. నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం వెల్మాల (స్కోర్: 90.49)
7. జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం మూల రాంపూర్ (స్కోర్:90.47)
8. నిజామాబాద్ జిల్లా తానాకుర్దు (స్కోర్:90.3)
9. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం కుక్నూర్ (స్కోర్: 90.28)
10. కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్నంపల్లి (స్కోర్: 90.25)