పంట చేతికొచ్చేనా..?
ఎండల తీవ్రతకు తోడు అప్రకటిత విద్యుత్తు కోతలు రైతుల పాలిట శాపంగా మారాయి. నాణ్యమైన, ఉచిత నిరంతర విద్యుత్తు అందిస్తున్నామని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు కాగితాలకే పరిమితమయ్యాయి. రోజంతా కలిపితే 6-7 గంటల కరెంటు కూడా ఇవ్వడంలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ లో-వోల్టేజీ సమస్యలతో మోటర్లు కాలిపోతున్నాయని వాపోతున్నారు. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినా వాటిని బాగుచేయించే దిక్కులేదని మండిపడుతున్నారు.
- సాగునీటి వెతలు.. కరెంటు కోతలు.. కరువు కోరలు
- సాగునీటి కష్టాలకు తోడు కన్నీళ్లు పెట్టిస్తున్న కరెంటు కోతలు
- కండ్లముందే ఎండుతున్న పొలాలను చూసి రైతుల మౌనరోదన
- పొట్టదశలో పంటలను కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు
- వానకాలం దిగుబడిపై నీలినీడలు.. పెట్టుబడులు బూడిదపాలు
హైదరాబాద్, అక్టోబర్ 12 (నమస్తే తెలంగాణ): ఎండల తీవ్రతకు తోడు అప్రకటిత విద్యుత్తు కోతలు రైతుల పాలిట శాపంగా మారాయి. నాణ్యమైన, ఉచిత నిరంతర విద్యుత్తు అందిస్తున్నామని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు కాగితాలకే పరిమితమయ్యాయి. రోజంతా కలిపితే 6-7 గంటల కరెంటు కూడా ఇవ్వడంలేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ లో-వోల్టేజీ సమస్యలతో మోటర్లు కాలిపోతున్నాయని వాపోతున్నారు. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయినా వాటిని బాగుచేయించే దిక్కులేదని మండిపడుతున్నారు.
విద్యుత్తు పరికరాలు, మోటర్లు కాలిపోతుండటంతో రైతులు లబోదిబోమంటున్నారు. అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకొనే నాథుడే కరువయ్యాడని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. విద్యుత్తు కోతలను నిరసిస్తూ, నిరంతర విద్యుత్తు సరఫరా చేయాలంటూ రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజూ నిరసనలు కొనసాగుతున్నాయి. రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారు, సబ్స్టేషన్లను ముట్టడిస్తున్నారు. అయినప్పటికీ, ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోవడంలేదు. దీంతో నీళ్లు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో కూడా విద్యుత్తు కోతలతో పంటలకు నీళ్లు అందించలేని దుస్థితి నెలకొన్నది.
ఆటోమెటిక్ స్టార్టర్ల తొలగింపుతో మరింత కష్టం
వ్యవసాయ బావుల వద్ద నాణ్యమైన విద్యుత్తు ఇవ్వకపోగా, ఆటోమెటిక్ స్టార్టర్లు అమర్చుకోవద్దని అధికారులు ఆంక్షలు విధించడం రైతుల పాలిట శాపంగా మారింది. ఆటోమాటిక్ స్టార్టర్లను తీసేయాలని, లేనిపక్షంలో తామే వచ్చి స్టార్టర్లను పీకేస్తామంటూ విద్యుత్తు అధికారులు హెచ్చరిస్తున్నారు. విద్యుత్తు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితుల్లో అర్ధరాత్రి వేళల్లో కూడా రైతులు పొలాల వద్దే కాపలా కాయాల్సి వస్తున్నది. ఆటోమాటిక్ స్టార్టర్లను తొలగిస్తుండటంతో రైతులు రేయింబవళ్లు పొలాల వద్దే పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఏర్పడింది.
సాగునీళ్లు కరువై.. ఎండుతున్న పంటలు
ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువు అనే విమర్శలున్నాయి. చేతిలో ఉన్న నీళ్లను సముద్రంలోకి వదిలేసి ఇప్పుడు ఎల్ నినో అంటూ ప్రభుత్వం బీద అరుపులు అరుస్తున్నది. కేసీఆర్‌ను బద్నాం చేయాలన్న లక్ష్యంతో కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టింది. దీంతో వానకాలంలో కాళేశ్వరంలో నీళ్లను ఎత్తిపోయకుండా రాజకీయ కక్ష తీర్చుకున్న కాంగ్రెస్.. ఇప్పుడు రైతుల గోసకు కారణమైంది.
కాంగ్రెస్ సర్కార్ వైఫల్యం, ముందుచూపులేనితనంతో రాష్ట్రంలో సాగునీళ్లు కరువయ్యాయి. కేసీఆర్ హయాంలో ఎర్రటి ఎండల్లోనూ మత్తళ్లు దూకిన చెరువులు, కుంటలు ఇప్పుడు మైదానాలను తలపిస్తున్నాయి. చెరువులు, కాలువలు ఎండిపోవడం, భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో సాగునీటి కొరత తీవ్రరూపం దాల్చింది. ఎక్కడ చూసినా ఎండిన పొలాలే వెక్కిరిస్తున్నాయి. పచ్చగా ఉండాల్సిన పైర్లు.. నెర్రలు బారుతున్నాయి. సాగునీళ్లు కరువై, విద్యుత్తు కోతలతో రైతులు పంటలను వదిలేస్తున్నారు. పంటపొలాలు పశువులకు మేతగా మారుతున్నాయి. ఎండిపోయిన పంటలను చూసి రైతులు గుండెలు బాదుకుంటున్నారు.

కీలక దశలో పంటలు.. దిగుబడిపై నీలినీడలు
పత్తి, వరి, కంది, మక్కజొన్న ఇలా పంటలన్నీ కీలక దశలో ఉన్నాయి. పత్తి పంట ప్రస్తుతం పూత, పిందె దశలో ఉన్నది. ఈ సమయంలో చేను తేమగా లేకపోతే పూత రాలిపోయి కాయ పరిమాణం తగ్గిపోతుంది. వరి పంట ప్రస్తుతం పొట్ట దశకు వచ్చింది. ఈ సమయంలో వరి పొలాలకు నీరు అత్యంత అవసరం. అవసరమైన నీరు లేకపోతే కంకులు పెట్టదు. ఇప్పుడు సాగునీటికి ఏమాత్రం ఇబ్బందులు ఏర్పడినా ఆ ప్రభావం దిగుబడిపై పడుతుంది. ఇప్పుడు సరిగ్గా అదే జరుగుతున్నది.
వర్షాలు లేకపోవడంతో పత్తి, కంది, మక్కజొన్న వంటి వర్షాధార పంటలు వాడిపోతున్నాయి. పత్తి పూత రాలిపోతున్నది, వరి కంకులు వేయడంలేదు. సరిపడా నీరు అందకపోతే ఎకరానికి సగం దిగుబడి కూడా రాదని, వేల రూపాయిల పెట్టుబడి కూడా వెనకి రాదని రైతులు తీవ్ర భయాందోళన చెందుతున్నారు. సాధారణంగా పత్తి ఎకరానికి 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది. ప్రస్తుతం ఇది 5-6 క్వింటాళ్లకు పరిమితమయ్యే పరిస్థితి ఏర్పడింది. ఇలా పంటలకు సరైన సమయంలో నీళ్లు అందకపోవడంతో దిగుబడి తగ్గుతుందనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతున్నది.
పెట్టుబడి బూడిదపాలు
సాగునీళ్లు లేక పంటలు ఎండిపోవడం, దిగుబడులు తగ్గుతుండటంతో రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నది. పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని ఆందోళన చెందుతున్నారు. మళ్లీ అప్పులపాలవుతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఏడాది విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఎకరా వరి సాగుకు రూ.30 వేల నుంచి రూ.35 వేలు, పత్తికి రూ.40 వేలకుపైగా పెట్టుబడి పెట్టారు. సొంత నిధులు లేక వ్యాపారులు, బ్యాంకుల వద్ద నుంచి తెచ్చిన అప్పులతో సాగు చేపట్టారు. ఇప్పుడు తీరా పంట చేతికొచ్చే సమయానికి నీళ్లు అందక పంటలు ఎండిపోతుంటే పెట్టిన పెట్టుబడి కూడా దకే పరిస్థితి కనిపించడం లేదని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పంటలు కాపాడుకొనేందుకు తిప్పలు
ఏడాది పొడవునా రెకలముకలు చేసుకొని సాగు చేసిన పంటలు కండ్లముందే ఎండిపోతుంటే రైతుల గుండెలు తల్లడిల్లుతున్నాయి. పంటలను కాపాడుకొనేందుకు రాత్రింబవళ్లు నరకయాతన అనుభవిస్తున్నారు. అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా పొలాల వద్దకు పరుగులు తీస్తున్నారు. అందుబాటులో ఉన్న కొద్దిపాటి నీళ్లను చుక్కచుక్క పారిస్తూ పంటలను కాపాడుకొనే ప్రయత్నం చేస్తున్నారు.
మోసపోతే గోసపడుతం
- నాటి కేసీఆర్ మాట.. నేడు కండ్ల ఎదుట

Kcr
‘రైతులు పండుగ చేసుకునేలా తెలంగాణను ధాన్యాగారంగా మార్చాలన్నదే నా జీవితాశయం, అది కాళేశ్వరంతో నెరవేరింది. ఒకనాడు వర్షాల కోసం ఆకాశం వైపు చూసి కంటతడి పెట్టిన రైతన్నలు, ఇకపై కాలంతో సంబంధం లేకుండా రెండు పంటలు పండించుకోవచ్చు. గోదావరి జలాలు ఎగదన్ని, కొండలను దాటి మన చెరువులు, కుంటలను నింపుతున్నయ్. కాళేశ్వరం నీళ్లు రావడం వల్లే భూగర్భ జలాలు గణనీయంగా పెరిగినయ్.
వ్యవసాయ బోర్లలో నీళ్లు ఉబికి వస్తున్నయ్. ప్రాణహిత-గోదావరి సంగమ స్థలి నుంచి నీటిని ఒడిసిపట్టి ఎడారిగా మారిన బీడు భూములకు జీవం పోస్తున్నం. కాళేశ్వరం కేవలం సిమెంట్, ఇనుముతో కట్టిన కట్టడం కాదు, అది తెలంగాణ బిడ్డల కన్నీళ్లను తుడిచేందుకు నిర్మించిన సజీవ జలధార. కాళేశ్వరం తెలంగాణ లైఫ్‌లైన్. వర్షాలు సరిగా కురిస్తే అది జలభాండం. కల్పతరువు. కరువు వచ్చినప్పుడు కాళేశ్వరం విలువేందో తెలుస్తది.
– కొండపోచమ్మసాగర్ ప్రారంభ సభలో కేసీఆర్
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

