ఎదులాపురం, సెప్టెంబర్ 27 : ఆదిలాబాద్ రిమ్స్ దవాఖానలో గత సోమవారం చోటు చేసుకొన్న అగ్నిప్రమాదంలో పిల్లలను కాపాడిన స్టాఫ్‌నర్స్ ప్రమీల పరిస్థితి విషమించింది. ఆమెను ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. ప్రమాద సమయంలో పొగతో నిండిన గదిలో పిల్లలను సురక్షితంగా బయటకు తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించిన ఆమె వారం రోజులుగా ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ప్రమీలకు ఊపిరితిత్తులు, కాలేయంపై ప్రభావం పడడంతో ఆమె పరిస్థితి విషమించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం నిమ్స్‌కు తరలించారు. ప్రమీలను ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పరామర్శించారు.