Skill Development Courses | హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): వచ్చే విద్యాసంవత్సరంలో 100 డిగ్రీ కళాశాలల్లో స్కిల్ డెవలప్మెంట్ కోర్సులను ప్రవేశపెట్టాలని విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం శనివారం సెక్టార్ స్కిల్ కౌన్సిళ్లు, కళాశాల విద్యాశాఖ, వర్సిటీల అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. చదువుతూనే విద్యార్థులకు సంపాదించుకునే వెసులుబాటు కల్పించేలా తీర్చిదిద్దనున్నారు.
ఈ విద్యా సంవత్సరం ప్రారంభంలో 30 డిగ్రీ కాలేజీల్లోనే 36 కోర్సులను ప్రవేశపెట్టారు. ఈ సంఖ్యను 100కు పెంచాలని నిర్ణయించారు. ఏయే రంగాల్లో ఏ కోర్సులను ప్రవేశపెట్టవచ్చో గుర్తించేందుకు ఒక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వచ్చే విద్యాసంవత్సరంలో జిల్లా కేంద్రాల్లోని విద్యార్థులు అధికంగా ఉన్న కాలేజీల్లో ఈ కోర్సులకు ప్రవేశపెడతారు. ప్రైవేట్ కాలేజీలకు సైతం అవకాశం కల్పించనున్నట్టు అధికారులు తెలిపారు.