అసలు కాంగ్రెస్ కాదిది కబ్జా కాంగ్రెస్!
‘ఇప్పుడున్నది అసలు కాంగ్రెస్ కాదు.. ఇది కబ్జా కాంగ్రెస్ అయ్యింది. మేము పార్టీని నమ్ముకొని ఉన్నవాళ్లం. మేమే ఓనర్లం. మాపైనే పెత్తనం చేద్దామనుకుంటున్నరు’ అంటూ సచివాలయంలోనే రాష్ర్టానికి చెందిన ఓ కీలక మంత్రి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
- ఊహించనంతగా పార్టీని నాశనం చేస్తున్నరు
- పార్టీలో, పాలనలో బ్రోకర్లకు ప్రాధాన్యమిస్తున్నరు
- మేం ఓనర్లం.. బయటకు వచ్చేరోజు వస్తుంది
- ఒరిజినల్ కాంగ్రెస్ ఏందో అప్పుడు చూపిస్తం
- సచివాలయంలో ఓ మంత్రి సంచలన వ్యాఖ్యలు
హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ) : ‘ఇప్పుడున్నది అసలు కాంగ్రెస్ కాదు.. ఇది కబ్జా కాంగ్రెస్ అయ్యింది. మేము పార్టీని నమ్ముకొని ఉన్నవాళ్లం. మేమే ఓనర్లం. మాపైనే పెత్తనం చేద్దామనుకుంటున్నరు’ అంటూ సచివాలయంలోనే రాష్ట్రానికి చెందిన ఓ కీలక మంత్రి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇటీవల రాష్ట్రంలో వరుసగా పలువురు మంత్రులు, కొంతమంది ఎమ్మెల్యేలకు మధ్య జరుగుతున్న పోరు రచ్చకెక్కిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో సెక్రటేరియట్లో ఓ సీనియర్ మంత్రిని మీడియా ప్రతినిధులు కలిశారు.
సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య ఉన్న సంబంధాలపై ఆ మంత్రి చాలా తీవ్రంగా స్పందించినట్టు తెలిసింది. పుట్టినప్పటి నుంచి కాంగ్రెస్‌లోనే ఉన్నానని, ఇప్పుడు రాష్ట్రంలోని పార్టీ పరిస్థితిని, ప్రభుత్వంలో అసలు కాంగ్రెస్ వారికి జరుగుతున్న అన్యాయాన్ని చూస్తుంటే గుండెతరుక్కుపోతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. తన పేరుతో వార్త రాయొద్దని ఆ అమాత్యుడు మీడియా ప్రతినిధులను కోరడం గమనార్హం. ఈ నేపథ్యంలో ‘నమస్తే తెలంగాణ’ ఆయన పేరును ప్రస్తావించడంలేదు. ఈ విషయంపై ఇప్పటికే ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీశాయి. సీఎంకు నివేదిక అందజేసినట్టు సమాచారం.
అంతా బ్రోకర్లు తయారైర్రు
మొదటి నుంచి కాంగ్రెస్‌లో ఉన్నవారిని కాదని ఇప్పుడు కొత్తగా చేరినవారికి సంబంధించిన పనులు పార్టీలో, ప్రభుత్వంలో అవుతున్నాయని ఆ మంత్రి తేల్చి చెప్పారు. ఎంతో చరిత్ర ఉన్న తమలాంటి వారు చెప్పినోళ్లకు కా కుండా ఇతరులకు పదవులు వస్తున్నాయని వాపోయారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల విషయంలో కూడా ఇప్పటికే బ్రోకర్లు రంగప్రవేశం చేశారని, గతంలో ప్రతిపక్ష పార్టీలో ఉండి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీచేసి ఓడిపోయిన ఓ వ్యక్తికి గవర్నర్ కోటాలో ఎమ్మె ల్సీ ఇప్పించడం ఖాయమైనట్టు కనిపిస్తున్నదని, దీనికి బ్రోకర్‌గా వ్యవహరించింది రాష్ర్టానికే చెందిన ఓ ఎమ్మెల్యే అని చెప్పారు.
ఆ ఎమ్మెల్యే వేరే రాష్ర్టానికి చెందిన ఓ ఎంపీని ప్రలోభపెట్టి ఆయన ద్వారా ఎమ్మెల్సీ పదవిని ఇప్పించేందుకు రంగం సిద్ధం చేశాడని చెప్పా రు. ఈ విషయం ఇప్పుడు పార్టీలో పెద్ద ఎత్తు న చర్చ జరుగుతున్నదని, దీనిపై తాను అధిష్ఠానం దృష్టికి కూడా తీసుకెళ్లానని వివరిస్తూ.. బ్రోకర్లు ఏదైనా చేయగలరని, కాంగ్రెస్‌ను కబ్జా చేశారని మండిపడ్డారు. ప్రభుత్వంలో ఏ పని కావాలన్నా సీనియర్ మంత్రులు చెప్పిన విషయాలను పట్టించుకోవడమే లేదని, కేవలం ఒకరిద్దరు కబ్జా కాంగ్రెస్ నేతలు చెప్పి న వాటికే విలువ ఇస్తున్నారంటూ ఆవేదన వ్యక్తంచేశారు. కబ్జా కాంగ్రెస్ నుంచి మంత్రుల రూపంలో కొందరు, సలహాదారుల రూపంలో ఇంకొందరు ప్రభుత్వాన్ని, పార్టీని పట్టి ఆడిస్తున్నారంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు.
త్వరలోనే బయటకొస్తాం
పార్టీలో, ప్రభుత్వంలో ఇలాంటి సంప్రదాయం మంచిదికాదని, దీనిపై తాము త్వరలోనే బయటకు వస్తామని, పార్టీ అధిష్ఠానానికి సవివరమైన నివేదిక ఇస్తామని ఆ మంత్రి చెప్పారు. తామేంటో కూడా చూపిస్తామని, పార్టీ మనుగడకు ఇప్పుడున్న పరిస్థితులు అంత శ్రేయస్కరం కాదని అభిప్రాయపడ్డారు. కబ్జా కాంగ్రెస్ అంటూ కొంత మంది మీడి యా ప్రతినిధుల వద్ద ఆ మంత్రి మంగళవా రం సాయంత్రం వ్యాఖ్యలు చేయడం కలకలకం సృష్టించి చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే రాష్ట్రంలో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్న నేపథ్యంలో సాక్షాత్తు కాంగ్రెస్‌లో ఓ సీనియర్ మంత్రి, అధిష్ఠానం వద్ద ఎంతో కొంత పలుకుబడి ఉన్న మంత్రే ఇలా వ్యాఖ్యానించడం చర్చకు దారి తీసింది.
మంత్రివర్గ సమావేశంలో చర్చకొస్తుందా?
ప్రభుత్వంలో కీలక స్థానాల్లో ఉన్న కాంగ్రెస్ ఓనర్లకే విలువ లేకుండా పోయిందని చెప్తున్న మంత్రి.. గురువారం సచివాలయంలో జరిగే మంత్రివర్గ సమావేశంలో ఆయా అంశాలన్నింటినీ ప్రస్తావించే అవకాశం ఉన్నదని సమాచారం. పలువురు మంత్రులు త మకు జరుగుతున్న అన్యాయాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. కొందరు ఎంపీ లు, ఎమ్మెల్యేలు తమను లక్ష్యంగా చేసుకొని మాట్లాడుతున్న తీరుపై కొందరు మంత్రులు గట్టిగానే చర్చించాలని భావిస్తున్నట్టు సమాచారం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

