కాంగ్రెస్ ఎంపీ భూ బాగోతం వెయ్యి కోట్ల ల్యాండ్ స్కామ్!
హైదరాబాద్ నడిబొడ్డున శేరిలింగంపల్లిలో వెయ్యి కోట్లు విలువజేసే 4.13 ఎకరాలను కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్ కబ్జా చేస్తున్నారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు.
- 4.13 ఎకరాల ప్రభుత్వ జాగపై కన్నేసినఎంపీ
- నగరం నడిబొడ్డున ఎస్సీ గురుకుల స్థలం ఆక్రమణ
- బలరాం నాయక్ కబ్జాకు మంత్రి అడ్లూరి మద్దతు
- రేవంత్ పాలనలో ప్రజలు, భూములకు రక్షణ కరువు
- 15రోజుల్లో ఎంపీ చెర నుంచి భూమిని కాపాడాలి
- లేకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్దఎత్తున పోరాటం
- బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ హెచ్చరిక
హైదరాబాద్, నవంబర్ 4 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ నడిబొడ్డున శేరిలింగంపల్లిలో వెయ్యి కోట్లు విలువజేసే 4.13 ఎకరాలను కాంగ్రెస్ ఎంపీ బలరాం నాయక్ కబ్జా చేస్తున్నారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ఆరోపించారు. ఎస్సీ గురుకులం భూములను ఆక్రమించేందుకు యత్నించిన వ్యవహారం వెనుక ఎంపీ ఉన్నారని, అంతేగాక ఆయనకు మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ మద్దతునిస్తున్నారని దు య్యబట్టారు. బుధవారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతలు రవినాయక్, కల్వకుర్తి శ్రీనివాస్‌తో కలిసి విలేకరులతో ఆయన మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి అండతోనే ఆయన సోదరులు, అనుయాయులు, అధికార పార్టీ నేతలు భూ దోపిడీకి పాల్పడుతున్నారని విరుచుకుపడ్డారు.
‘నేను గురుకుల సెక్రటరీగా ఉన్నప్పుడు బలరాం నాయక్ వచ్చి నా దగ్గర డాక్యుమెంట్లున్నాయి సపోర్ట్ చేయమని అడిగారు.. కానీ అందుకు నేను ఒప్పుకోలేదు.. మీరు కాదు ఎవరూ కబ్జా చేయలేరని తేల్చిచెప్పాను’ అని ఆర్ఎస్పీ గుర్తుచేశారు. నిరుపయోగంగా ఉన్న ఆ భూమిని అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గురుకులానికి కేటాయించడంతోపాటు 2013లో సబ్ ప్లాన్ కింద రూ.31 కోట్లు మంజూరు చేశారని ఆర్ఎస్ ప్రవీణ్ గుర్తుచేశారు. అనంతరం కేసీఆర్ ఆదేశాల మేరకు 15 అంతస్తుల్లో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ బిల్డింగ్ కట్టాలని ప్రతిపాదనలు సిద్ధం చేశామని చెప్పారు. ప్రస్తుతం గజం రూ.5 లక్షలు పలుకుతున్నదని పేర్కొన్నారు. గొప్ప లక్ష్యంతో కేసీఆర్ సీవోఈ ఏర్పాటుకు ఉపక్రమిస్తే ఎంపీ మాత్రం కబ్జాకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. అంతేగాక శేరిలింగంపల్లిలో సర్వే నం 20/1 బీసీ స్టడీ సరిల్ భూమిని అక్రమంగా సాస్ ఇన్ఫ్రాకు ఇచ్చారని ఆరోపించారు.
అడ్లూరి అధికారులను తీసుకెళ్లి భూమిని కాపాడాలి..!
మంత్రి అడ్లూరి అధికారులను తీసుకెళ్లి ఆ భూమిని కాపాడాలని ఆర్ఎస్ ప్రవీణ్ డిమాండ్ చేశారు. చీఫ్ సెక్రటరీకి రెండుసార్లు లేఖలు రాసినా స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇబ్రహీంపట్నంలో నాలా ఉన్నదని ఇరిగేషన్ అధికారులు చెప్పినా మల్రెడ్డి రంగారెడ్డి, చామల కిరణ్‌కుమార్‌రెడ్డికి విల్లాలు ఇచ్చి సంఘీ అంబు జా అనే సంస్థ అక్రమంగా నిర్మాణాలు చేపడుతున్నదని ఆరోపించారు. 15 రోజుల్లో భూమిని స్వాధీనం చేసుకొని సాంఘిక సంక్షేమ శాఖకు అప్పగించాలని డిమాండ్ చేశారు. లేకపోతే వేలాది మందితో సంక్షేమ భవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కబ్జాలపై ప్రతి గ్రామంలో చర్చ జరుగాలని కోరారు.
హిల్ట్ నుంచి ఫోర్త్‌సిటీ దాకా భూదందాలు
రేవంత్ పాలనలో పౌరులకే కాదు, ప్రభుత్వ భూములకు కూడా రక్షణ కరువైందని ఆర్ఎస్ ప్రవీణ్ ధ్వజమెత్తారు. హిల్ట్ మొదలు ఫోర్త్‌సిటీ దాకా భూ దందాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. మియాపూర్ భూములను కాపాడింది కేసీఆర్ అయితే అమ్మకానికి పెట్టింది రేవంత్‌రెడ్డి అని నిప్పులు చెరిగారు. మీర్‌పేట అల్మాస్‌గూడలో దళిత క్రైస్తవుల మీద జరిగిన దాడిని ఖండించారు. పోలీస్‌స్టేషన్‌కు వెళ్లిన బీఆర్ఎస్ నేతలు రాజీవ్‌సాగర్, మోజెస్ వంటి వారిపై లాఠీచార్జ్ చేయడం దారుణమని మండిపడ్డారు. తాను, సబితాఇంద్రారెడ్డి ట్వీట్ చేసిన తర్వాతే బాధ్యులపై కేసు పెట్టారని గుర్తుచేశారు. డీజీపీకి వారం క్రితం బీఆర్ఎస్ నాయకులు వినతిపత్రం ఇచ్చిన తర్వాత కూడా ఇలాంటి ఘటనలు జరుగడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
హైడ్రా ఏం చేస్తున్నది?
పేదలు వేసుకున్న గుడిసెలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తున్న హైడ్రా.. నగరం నడిబొడ్డున ఎంపీ భూకబ్జాలు చేస్తుంటే ఎందుకు అడ్డుకోవడం లేదని ఆర్ఎస్ ప్రవీణ్ ప్రశ్నించారు. సంక్షేమ అధికారులు గాఢనిద్రలో మునిగితేలుతుంటే రెవెన్యూ, విజిలెన్స్ అధికారులు ఏం చేస్తున్నారు? కండ్లు మూసుకున్నారా? అని నిలదీశారు. అధికారులు, మంత్రులు వాటాల కోసం కొట్లాడుతున్నారని విమర్శించారు. రాజీనామా లేఖను జేబులో పెట్టుకొని తిరిగే.. మంత్రి అడ్లూరి రాజీనామాకు సిద్ధమా అని సవాల్ విసిరారు. మహబూబాబాద్ జిల్లాలో గురుకులాల అధికారులే స్వయంగా కాంట్రాక్టర్లను లంచాలు అడుగుతున్నారని ఆరోపించారు.
మహబూబాబాద్‌కు చెందిన వేం నరేందర్‌రెడ్డి, మచ్చ శ్రీనివాస్‌రావు, బలరాంనాయక్‌కు భూములు కబ్జా చేయాలని ఉంటే రేవంత్‌రెడ్డివి గోపన్నపల్లిలోని 27 ఎకరాలు, వెల్దండిలో 128 ఎకరాలు, కొంపల్లిలో ఆయన కూతురు నైమిషారెడ్డికి రెండున్నర ఎకరాలు, ఆయన సోదరుడు తిరుపతిరెడ్డికి కోస్గిలో వందల, కొండాల్రెడ్డికి కొట్రలో, పొంగులేటికి బాలాపూర్‌లో 300 ఎకరాల, నార్సింగ్‌లో 27 ఎకరాలున్నదని దమ్ముంటే అక్కడికి వెళ్లాలంటూ చురకలంటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలు హైటెక్‌సిటీలో ఉండొద్దా? ఊరికి అవతలే ఉండాలా? కూలీలుగానే బతుకాలా? చెప్పులు, డప్పులు పారిశుధ్య కార్మికులుగానే ఉండాలా? వేముల వీరేశం డప్పులు కొట్టుకుంట పోతరా? మందుల సామేల్, నాగరాజు ఏం చేస్తున్నారు? అని ప్రశ్నలవర్షం కురిపించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

