రఘునాథపాలెం, అక్టోబర్ 4 : ముఖ్యమంత్రి సహాయ నిధి పేరుతో కొందరు అమాయకులను నమ్మించి ఓ ఆర్ఎంపీ రూ.లక్షల్లో డబ్బులు వసూలు చేసిన ఘటన ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం బూడిదంపాడులో ఆదివారం వెలుగుచూసింది. వివరాలు ఇలా.. బూడిదంపాడు గ్రామానికి చెందిన ఆర్ఎంపీ తోటపల్లి వెంకటేశ్వర్లు తన వద్దకు చికిత్స నిమిత్తం వచ్చే అమాయకులకు మాయమాటలు చెప్పి.. ‘మీరు అనారోగ్యంతో దవాఖానలో చేరినందుకు సీఎంఆర్ఎఫ్ పథకం కింద డబ్బులు ఇప్పిస్తా’నని అదే గ్రామానికి చెందిన కాకనబోయిన వెంకటనారాయణ, వరికొల్లు నాగలక్ష్మి, గోళ్ల గురవయ్య, దేశాయి కృష్ణవేణి, సిలివేరు మౌనిక, కౌసల్య, మంగమ్మ, భారతి తదితరుల వద్ద సుమారు రూ.1.50 లక్షలు వసూలు చేశాడు. వీరు చికిత్స పొందిన దవాఖానల నుంచి తానే బిల్లులు తెచ్చి సీఎంఆర్ఎఫ్ పథకానికి దరఖాస్తు చేసి చెక్కులు ఇప్పిస్తానంటూ నమ్మబలికాడు.
ఇలా అనేక మంది వద్ద రూ.15 వేలు చొప్పున వసూలు చేశాడు. అంతేగాక పలు దవాఖానల నుంచి ఫేక్ బిల్లులు సైతం తెచ్చి దరఖాస్తు చేశాడు. తీరా సదరు ఆర్ఎంపీ తెచ్చిన బిల్లులు ఫేక్ అని తేలడంతో దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. విషయం తెలిసి బాధితులు ఆర్ఎంపీని ప్రశ్నించగా.. బిల్లులు తెచ్చిన దవాఖానలు రద్దయ్యాయని.. మళ్లీ దరఖాస్తు చేస్తానంటూ మరోమారు మోసపూరిత మాటలు చెప్పసాగాడు. మోసపోయామని తెలుసుకుని బాధితులు న్యాయం కోసం పోలీస్స్టేషన్ మెట్లెక్కారు. ఈ సందర్భంగా బాధితులు మీడియాతో వైద్యం, ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా చేసుకుని తమను మోసం చేసిన ఆర్ఎంపీ వెంకటేశ్వర్లుపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని అధికారులను వేడుకున్నారు.