రాజాపేట, జూన్ 19: యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు ప్రభుత్వ దవాఖానలో ఫార్మసిస్ట్‌గా పని చేస్తున్న చిమ్మి శివకుమార్‌ను కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జి బీర్ల ఐలయ్య ఫోన్లో తీవ్రంగా బెదిరించాడు. ‘నా జోలికి వస్తే చంపుత బిడ్డా’ అంటూ భయభ్రాంతులకు గురిచేశాడు. అందుకు సంబంధించిన ఆడియో సోమవారం స్థానిక సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీర్ల ఫౌండేషన్ ఏర్పాటు చేసిన ప్రైవేట్ అంబులెన్స్.. కార్పొరేట్ దవాఖానలతో కలిసి చేస్తున్న కమీషన్ల బాగోతంపై రాజాపేట మండలంలోని దూదివెంకటాపురం గ్రామానికి చెందిన శివకుమార్ ఫోన్లో బీర్ల ఐలయ్యను ప్రశ్నించాడు. దాంతో ఐలయ్య శివకుమార్‌ను అడ్డగోలుగా దూషించాడు.
‘అరేయ్.. నేను ఎవరిని అనుకుంటున్నవ్ రా.. నాకు ఎంత మంది పెద్దల అండ ఉందో తెలుసారా.. నీ బతుకు ఎంత, నువ్వెంత.. నేను తలుచుకుంటే నువ్వు బతుకలేవు బిడ్డా.. ఖబడ్దార్.. ఇంటికి వచ్చానంటే ఖతం అయితవ్ బిడ్డా.. నాకు ఫోన్ చేసే అంతటి వాడివారా.. నేను ఆలేరుకు కాబోయే నాయకుడిని బిడ్డా.. నా జోలికి వస్తే నీ అంతు చూస్తా’ అంటూ తీవ్రంగా దూషించాడు. బీర్ల ఐలయ్యపై చర్యలు తీసుకోవాలని బాధితుడు శివకుమార్ రాచకొండ పోలీసులకు వాట్సాప్‌లో ఫిర్యాదు చేశాడు.