గడువు దాటినా నోటీసులివ్వలే!
7తో ముగిసిన అభ్యంతరాల స్వీకరణ గడువు.. అయినా 64,701 మందికి నోటీసులు నిల్.. 95 లక్షల ఓట్ల తొలగింపుపై వివరణ ఇస్తూ ‘సర్'లో జాప్యాన్ని బయటపెట్టుకొన్న ఈసీ.. సంచలన సృష్టించిన ‘నమస్తే’ కథనం!
హైదరాబాద్, అక్టోబర్ 9 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ) : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియ పూర్తయ్యేనాటికి రాష్ట్రంలో గరిష్ఠంగా 95 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉన్నదని ‘నమస్తే తెలంగాణ’ శుక్రవారం ప్రచురించిన కథనం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. ఇంత పెద్దమొత్తంలో ఓట్ల తొలగింపుపై అటు రాజకీయ, ఇటు మేధోవర్గాలు ఆందోళన వ్యక్తం చేశాయి. దీనిపై స్పందించిన ఈసీ అధికారులు.. 95 లక్షల ఓట్లు తొలగించారంటూ వచ్చిన వార్తలో వాస్తవం లేదని పేర్కొన్నారు. ఈ క్రమంలో కొన్ని వివరాలు కూడా వెల్లడించారు. అయితే, ఈసీ అధికారులు వెల్లడించిన వివరాలను బట్టి చూస్తే, ‘సర్’ ప్రక్రియలో అధికారుల జాప్యం కనిపిస్తున్నదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గడువు దాటినా.. ఫారాలు పంచలే!
ఈసీ అధికారులు స్పందిస్తూ.. ‘సర్’ ప్రక్రియలో భాగంగా 73,39,235 మంది ఓటర్లను ఏఎస్‌డీడీ (గైర్హాజరు, ఇతర ప్రాంతాలకు మారినవారు, డూప్లికేట్, మరణించినవారు) క్యాటగిరీలో చేర్చినట్టు వెల్లడించారు. అంటే, వీరి ఓట్లు దాదాపుగా తొలగించే అవకాశమున్నట్టు నిపుణులు చెప్తున్నారు. ఇక, మిగిలిన ఓటర్లలో 92,23,486 మందికి నోటీసులు పంపిణీ చేయగా, మరో 64,701 మందికి నోటీసుల పంపిణీ పెండింగ్‌లో ఉన్నట్టు అధికారులు తెలిపారు. అయితే, డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాపై క్లెయిమ్స్, అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియకు గడువు గత బుధవారమే ముగిసినా, 64,701 మందికి ఇంకా నోటీసులు పంపిణీ చేయలేదంటే, వారి ఓటు ఏమవుతుందనే విషయాన్ని అధికారులు పేర్కొనలేదు.
మరోవైపు, మొత్తం నోటీసులు జారీ చేసిన 92,23,486 మందిలో తుది ఓటర్ల జాబితా లో ఉండేందుకు బుధవారం నాటికి 71,23,526 మందిని (శుక్రవారం నాటికి 74.62 లక్షలు) అర్హులుగా గుర్తించినట్టు, అలాగే ఇప్పటివరకూ 12,969 మంది ఓటర్లను అనర్హులుగా గుర్తించినట్టు ఈసీ అధికారులే పేర్కొన్నారు. నోటీసులు అందుకొన్నవారి నుంచి వీరిని తీసేస్తే, మిగిలిన ఓటర్లు 21 లక్షల పైచిలుకు ఉంటారు. ఈ ఓటర్లను అర్హుల క్యాటగిరీలో చే ర్చుతారా? లేదా.. అనర్హులుగా తేల్చేస్తారా? అనే విషయంపై అధికారులు స్పష్టత ఇవ్వకుండా వచ్చే నెలలోపు నిర్ణయం తీసుకొంటామని పేర్కొన్నారు.
ఈ 21 లక్షల మంది ఓటర్లు అర్హులేనా? అని మీడి యా అడిగిన ప్రశ్నకు మాత్రం అధికారులు సమాధానం ఇవ్వట్లేదు. ఇవన్నీ బేరీజు వేసుకొంటే, ఏఎస్‌డీడీ క్యాటగిరీలోని 73.36 లక్షల మంది ఓటర్లు, అనర్హత జాబితాలో చేరి న 12,969 మంది ఓటర్లు, నోటీసులు పెం డింగ్‌లో ఉన్న 64 వేల పైచిలుకు ఓటర్లతోపాటు, నోటీసులకు సమాధానం ఇచ్చి.. ఇంకా నిర్ణయం తీసుకోకుండా పెండింగ్‌లో పెట్టిన 21 లక్షల పైచిలుకు మంది ఓటర్లను కూడా కలుపుకొంటే గరిష్ఠంగా 95 లక్షల మంది ఓటు హక్కు సందిగ్ధంలో పడినట్టు అర్థమవుతున్నది.
‘నమస్తే’ కథనంతో సంచలనం
రాష్ట్రంలో ‘సర్’ ప్రక్రియ పూర్తయ్యేనాటికి గరిష్ఠంగా 95 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే అవకాశం ఉన్నదని ‘నమస్తే తెలంగాణ’ శుక్రవారం ప్రచురించిన కథనం రాష్ట్రవ్యాప్తంగా సంచలనమైంది. ‘నమస్తే’ కథనాన్ని ఉటంకిస్తూ కొన్ని ప్రధాన మీడియా సంస్థలతో పాటు యూట్యూబ్, డిజిటల్ చానల్స్ కూడా ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేశాయి. పెద్ద ఎత్తున ఓట్లను తొలగిస్తున్న ఈసీపై రాజకీయ, మేధోవర్గాలు అసహనం వ్యక్తం చేశాయి. ఓట్ల తొలగింపుపై ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వేదికల్లో నెటిజన్లు ఆందోళన వ్యక్తంచేశారు. ఈసీ వైఖరిని బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున ఖండించారు. తమ నియోజకవర్గాల్లో ఓట్ల తొలగింపుపై వివిధ పార్టీల నేతలు ఆరా తీసినట్టు తెలిసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

