హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర పోలీస్‌శాఖలో కీలకవిభాగమైన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ(ఎఫ్ఎస్ఎల్)లో అగ్నిప్రమాదం జరిగి రెండు నెలలవుతున్నా, ఘటనకు కారణాలేంటో మాత్రం బయటకు పొక్కనీయడం లేదు. నేటికీ ఆ ప్రమాదం ఎలా జరిగిందో ఓ ప్రశ్నార్థకంగానే మిగిలింది. రామాంతపూర్‌లోని సెంట్రల్ ఫోరెన్సిక్ నిపుణులు, నాగ్‌పూర్‌కు చెందిన ఫైర్ ఫోరెన్సిక్ నిపుణులు వచ్చి ఆ ప్రమాదం ఎలా జరిగిందో పరిశీలించినా.. ఆ ఫలితాలను వెల్లడించేందు కు పోలీసుశాఖ వెనుకాడుతున్నది. ఫిబ్రవరి 7న ఉదయం అగ్నిప్రమాదం జరిగితే.. మరుసటి రోజు ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ శిఖాగోయెల్ ప్రెస్‌మీట్ పెట్టి మీడియాతో మాట్లాడారు. అగ్ని ప్రమాదంలో ఎన్నో కేసులకు సంబంధించిన కీలక ఆధారాలు కాలిపోయాయని తెలిపా రు. పోలీసుల విచారణలో నిజాలన్నీ వెలుగులోకి వస్తాయని, వివరాలను పబ్లిక్ డొమైన్లో పెడుతామని చెప్పారు. ఘటన జరిగి రెండు నెలలవుతున్నా.. ప్రమాదానికి గల కారణం బయటపెట్టలేదు. వివరణ కోరేందుకు ప్రయత్నించినా స్పందించలేదు. పబ్లిక్ డొమైన్లో పెట్టారేమోనని ఎఫ్ఎస్ఎల్ అధికారిక వెబ్సైట్ https://tgfsl.telangana. gov.in ఓపెన్ చేస్తే.. అదికూడా ఓపెన్ అవ్వడం లేదు.
కుట్రకోణం లేకపోతే బయటపెట్టరెందుకు?
ఎఫ్ఎస్ఎల్లో చోటు చేసుకున్న ప్రమాదం లో ఎలాంటి కుట్ర కోణం లేదని అటు డైరెక్టర్ శిఖాగోయెల్, ఆ తర్వాత డీజీపీ శివధర్‌రెడ్డి చెప్పారు. ఒకవేళ కుట్ర కోణమే ఉంటే తమ దర్యాప్తులో బయటపడుతుందని చెప్పారు. అయితే, ప్రమాదం జరిగి 2 నెలలైనా కూడా ఎలాంటి ఆధారాలు లభించలేదా? ఒకవేళ కుట్ర కోణం లేకపోతే ఆధారాలు ఎందుకు బయటపెట్టడం లేదనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ప్రమాదం జరిగి ఇన్నిరోజులైనా ఎఫ్ఎస్ఎల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీ బయటపెట్టకపోవడం గమనార్హం. వీటికితోడు ఎఫ్ఎస్ఎల్లోనే అత్యంత కీలకమైన సీజ్డ్ రూమ్, సర్వర్ రూమ్‌లు, అనాలసిస్ చాంబర్లలో అగ్నిప్రమాదం చోటు చేసుకున్నా.. దానిపై లోతుగా దర్యాప్తు చేయడంలో పోలీసుశాఖ విఫలమైందని చెప్పాలి. వందల కేసులకు సంబంధించిన పేపర్ ఎవిడెన్స్‌లు, కొన్ని వేల కేసులకు సంబంధించిన సాంకేతిక ఆధారాలు అగ్గిలో బూడదయ్యాయని, సుమారు 40-50 కంప్యూటర్లు, వాటి హార్డ్‌డిస్క్‌లు, పెన్‌డ్రైవ్‌లు, ఇతర హార్డ్ డిస్క్‌లు, సెల్ఫోన్లు వంటి ఎన్నో కీలక ఆధారాలు కాలిపోయాయని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఒకవేళ ధ్వంసమైన ఆధారాలు బయటపెట్టకపోతే ఆయా కేసుల్లోని నేరస్తులు, నిందితులు.. నిర్దోషులుగా బయటికి వచ్చే అవకాశం ఉంది. ప్రమాదానికి కారణాలను పోలీస్ శాఖ వెల్లడించకపోవడం ఎన్నో అనుమానాలకు తావిస్తున్నది.