కేటీఆర్‌పై తప్పుడు వ్యాఖ్యలు చేశా… కొండా సురేఖ క్షమాపణ
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తాను గతంలో తప్పుడు వ్యాఖ్యలు చేశానని మాజీ మంత్రి కొండా సురేఖ అంగీకరించారు. నిరాధార ఆరోపణలు చేసినందుకు విచారం వ్యక్తంచేశారు.
- ప్రతిపక్షాన్ని విమర్శించే క్రమంలో నేను నిరాధార ఆరోపణలు చేశాను
- చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నా.. ఆరోపణలను వెనక్కి తీసుకుంటున్నా
- ‘ఎక్స్’లో మాజీ మంత్రి కొండా సురేఖ
అందలాలెక్కినా.. అధికారం దక్కినా.. అన్యాయానికి ఆయష్షు తక్కువే. తెలంగాణ రాజకీయాల్లో అది రుజువవుతున్నది. దొంగ ప్రచారాలు, అడ్డగోలు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం తన మనుగడ కోసం మళ్లీ ఆ దొంగప్రచారాలే చేసుకుంటూ వచ్చింది.
ముఖ్యనేత ఆఫీసే ఈ విష ప్రచారానికి కేంద్రమైంది. దానికి కరకట్ట బాబు బ్యాండ్ మేళం మీడియా బాజా భజంత్రీలు వాయించింది. కేసీఆర్, కేటీఆర్ వ్యక్తిత్వ హననమే లక్ష్యంగా తెగ రెచ్చిపోయి ప్రచారాలు చేసింది. పరువుగల తెలంగాణ కుటుంబాలను బజారుకెక్కించింది.
బీఆర్ఎస్ బ్రహ్మాస్త్రం లాంటి లీగల్ నోటీసులు, కోర్టు కేసులతో ఎదురుదాడికి దిగడంతో నిన్నటిదాక మీసాలు తిప్పిన మీడియాలు, నోరుపారేసుకున్న నాయకులు దెబ్బకు దిగివచ్చారు. ‘రుబాబు రూపాయి, చెప్పులు సేపాయి’ అన్నట్టు ఉన్న పరువు గంగలో కలిసిపోయి, పరిస్థితి మారిపోగా చేసిన తప్పులకు లెంపలేసుకుంటున్నారు. ఆ కార్డు, ఈ కార్డు చూపించి అడ్డగోలు కూతలు కూసే మరింత మంది నాయకులకు కూడా ఇదే సత్కారం తథ్యం! ధర్మమే జయించుగాక! అధర్మం నశించుగాక!!
- నిజం నిలకడ మీదే తేలుతుంది
నిజం ఎప్పుడూ నిలకడ మీద తెలుస్తుంది. మొన్న ఒక పత్రిక క్షమాపణ చెప్పింది. ఇప్పుడు మాజీ మంత్రి సురేఖ. రేపు ఇంకా చాలామంది క్షమాపణలు చెప్పాల్సి వస్తుంది. ఫార్ములా ఈ రేస్, విద్యుత్తు, ఫోన్ ట్యాపింగ్ ఇలా.. మాపై రకరకాల తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. కానీ వాస్తవాలు బయటకు వచ్చినప్పుడు, ఆరోపణలు చేసినవారే క్షమాపణలు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది.
-కేటీఆర్
వరంగల్, అక్టోబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తాను గతంలో తప్పుడు వ్యాఖ్యలు చేశానని మాజీ మంత్రి కొండా సురేఖ అంగీకరించారు. నిరాధార ఆరోపణలు చేసినందుకు విచారం వ్యక్తంచేశారు. రెండేండ్ల కిందట కేటీఆర్ లక్ష్యంగా కొండా సురేఖ తీవ్రమైన వ్యక్తిగత, రాజకీయ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి. దీంతో తన ప్రతిష్టకు భంగం కలిగించేలా కొండా సురేఖ మాట్లాడారంటూ కేటీఆర్ కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో వివాదాస్పద వ్యాఖ్యలకు సంబంధించి కొండా సురేఖ గురువారం ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చారు. గతంలో తాను చేసిన ఆరోపణలపై వ్యక్తిగతంగా సమాధానం ఇవ్వాలనుకుంటున్నట్టు స్పష్టంచేశారు.
కేటీఆర్‌పై తాను నిరాధారమైన వ్యాఖ్యలు చేశానని అంగీకరించారు. అందుకు చింతిస్తున్నానని ప్రకటించారు. అప్పటి రాజకీయ పరిస్థితుల దృష్ట్యానే అలా మాట్లాడాల్సి వచ్చిందని తెలిపారు. ‘అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, ప్రతిపక్షాన్ని విమర్శించే క్రమంలోనే కేటీఆర్‌పై ఆ వ్యాఖ్యలు చేశాను. అంతేతప్ప అవి ఉద్దేశపూర్వకంగా చేసినవి కావు. ఆనాడు నేను నిరాధార వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సింది’ అని పేర్కొన్నారు. ‘నా వ్యాఖ్యలు వారిని, వారి కుటుంబసభ్యులను నొప్పించి ఉంటే తీవ్రంగా చింతిస్తున్నాను. అప్పుడు నేను చేసిన వ్యాఖ్యలన్నింటినీ పూర్తిస్థాయిలో ఉపసంహరించుకుంటున్నాను’ అని కొండా సురేఖ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ ఇప్పుడు రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.

సురేఖపై రూ.100 కోట్ల దావా
రెండేండ్ల కిందట మంత్రిగా ఉన్న సమయంలో కొండా సురేఖ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తీవ్ర వ్యక్తిగత ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సినీ ప్రముఖుల ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, సినీ నటుల వ్యక్తిగత జీవితాలు, కుటుంబ వ్యవహారాల్లో కేటీఆర్ కలగజేసుకున్నారని, ఫలితంగా ప్రముఖ సినీ జంట నాగచైతన్య, సమంత విడాకులు తీసుకోవాల్సి వచ్చిందంటూ ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపాయి. సినీ ప్రపంచమే కాకుండా సామాన్య ప్రజలు సైతం ఆమె వ్యాఖ్యలను తీవ్రంగా ఆక్షేపించిన విషయం తెలిసిందే. మంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చేసిన ఆరోపణలను అందరూ తీవ్రంగా పరిగణించారు. ఆ వ్యాఖ్యలను ఖండించడమే కాకుండా తనపై కొండా సురేఖ నిరాధారమైన ఆరోపణలు చేసి తన వ్యక్తిత్వం, కుటుంబ ప్రతిష్టకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారని కేటీఆర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. సురేఖ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆమెపై రూ.100 కోట్ల పరువు నష్టం దావా వేశారు.
కొండా సురేఖ పోస్ట్ యథాతథంగా..
‘బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై గతంలో నేను చేసిన కొన్ని వ్యక్తిగత వ్యాఖ్యల పట్ల వివరణ ఇవ్వాలని అనుకుంటున్నాను. అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, ప్రతిపక్షాన్ని విమర్శించే క్రమంలో ఆ విధంగా మాట్లాడానే తప్ప ఉద్దేశపూర్వకంగా కాదు. ఆనాడు నేను కొన్ని నిరాధారమైన వ్యాఖ్యలు చేయకుండా ఉండవలసింది. కేటీఆర్ లేదా ఆయన కుటుంబసభ్యులను బాధపెట్టాలని గానీ, వారి ప్రతిష్టకు భంగం కలిగించాలనే దురుద్దేశం గానీ నాకు ఎంతమాత్రం లేవు. నా వ్యాఖ్యలు వారిని గానీ, వారి కుటుంబసభ్యులను గానీ నొప్పించి ఉంటే అందుకు చింతిస్తూ, ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను’ అని కొండా సురేఖ ట్వీట్ చేశారు.
జ్ఞానోదయం కావడం హర్షణీయం : సత్యవతి రాథోడ్
మహబుబాబాద్, (నమస్తే తెలంగాణ): మాజీ మంత్రి కొండా సురేఖకు ఇప్పటికైనా కనువిప్పు కలిగి, కేటీఆర్‌కు క్షమాపణలు చెప్పడం హర్షణీయమని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా కేటీఆర్‌కు మాజీ మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పిన నేపథ్యంలో గురువారం మహబుబాబాద్ జిల్లా కురవిలో ఆమె విలేకరులతో మాట్లాడారు. రాజకీయ అనుభవం, బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న కొండా సురేఖ గతంలో కేటీఆర్‌పై విమర్శలు చేయడం బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా జ్ఞానోదయం కలుగడం హర్షణీయమన్నారు. సోషల్ మీడియాలో కాకుండా కోర్టులో ఈ విషయం చెప్తే బాగుంటుందని సూచించారు. చిల్లర మాటలతో కాంగ్రెస్ నాయకులు తమ స్థాయిని తామే దిగజార్చుకోవద్దని హితవు పలికారు.

కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ వంటి కొందరు నాయకులు సీఎం రేవంత్‌రెడ్డి మెప్పు కోసం బీఆర్ఎస్ నేతలపై వ్యక్తిగత విమర్శలు చేస్త్తూ రాజకీయ విలువలను దిగజార్చుతున్నారని విమర్శించారు. అలాంటివారు ఏదో ఒక రోజు ప్రజాక్షేత్రంలో బహిరంగ క్షమాపణలు చెప్పాల్సి వస్తుందని అన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, సమాజంలో వ్యక్తిత్వమే శాశ్వతమనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సూచించారు. సీఎం స్థానంలో ఉన్న రేవంత్‌రెడ్డికి పరిపాలన చేతగాక క్రిమినల్ మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలకు తావు లేదని, చిల్లర మాటలు మానుకోకుంటే ప్రజలు గుణపాఠం చెప్తారని సత్యవతి రాథోడ్ హెచ్చరించారు. తెలంగాణ ఖ్యాతిని విశ్వవ్యాప్తం చేసిన కేసీఆర్ ప్రతిష్టను ఎవరూ తుడిచివేయలేరని అన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

