KCR | కరీంనగర్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ) : జగిత్యాల సభకు విచ్చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను మునుపెన్నడూ లేనివిధంగా యువత అనుసరించడం కనిపించింది. ‘బాపూ’ అని పిలుస్తూ.. వాహనంలో ఉండగానే సెల్ఫీ వీడియోలు, ఫొటోలు తీసుకుంటూ యువత తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. సెల్ఫీలు తీసుకుంటున్న యువతను తన వాహనం నుంచే జాగ్రత్త బిడ్డా అనే సంకేతాలు ఇస్తూ పలుసార్లు సూచించడం కనిపించింది.
సోమవారం జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన కేసీఆర్ సభకు హెలికాప్టర్లో వచ్చిన కేసీఆర్, హెలిప్యాడ్ నుంచి పార్టీ కార్యాలయం వరకు వాహనంలో వెళ్తుండగా పెద్ద సంఖ్యలో యువకులు ద్విచక్ర వాహనాలతో స్వాగతం పలికారు. దారి వెంట ఆయనను ‘బాపూ.. బాపూ’ అంటూ గట్టిగా పిలుస్తూ ముందుకు సాగారు. పార్టీ కార్యాలయంలో ముఖ్యనేతలతో సమావేశమైన కేసీఆర్ అనంతరం సభాస్థలికి వెళ్తుండగా యువకులు పెద్దసంఖ్యలో ఆయన వాహనాన్ని అనుసరించారు.
సభ ముగించుకొని జగిత్యాల నుంచి తిరిగి వెళ్తుండగా.. దారిపొడవునా కేసీఆర్ వాహనాన్ని యువకులు గుంపులు గుంపులుగా అనుసరించి ‘బాపూ.. బాపూ..’ అని పిలిచారు. ఆయన వాహనం నుంచే యువకులకు అభివాదం చేస్తూ ‘జాగ్రత్త..’ అంటూ యూత్‌కు సూచనలు చేశారు. మొత్తానికి జగిత్యాలలో కేసీఆర్ వాహనం చుట్టూ ద్విచక్ర వాహనాలతో అనుసరిస్తూ తమ అభిమానాన్ని చాటుకున్న యువతను చూస్తే ఉద్యమ కాలం నాటి రోజులు గుర్తుకు వచ్చాయి. కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావాలనే ఆకాంక్ష యువతలో కనిపించింది.