Srisailam | శ్రీశైలం ఇక ఎడారే.. కృష్ణాజలాలను చెరబట్టేందుకు కర్ణాటక కాంగ్రెస్ సర్కారు పాచికలు!
ఓ వైపు గోదావరి జలాలను తమిళనాడుకు తరలించేందుకు కేంద్రం కుట్రపన్నుతుంటే.. మరోవైపు కృష్ణాజలాలను చెరబట్టేందుకు కర్ణాటక కాంగ్రెస్ సర్కారు మళ్లీ పాచికలు వేస్తున్నది.
- తుంగభద్రకు పూడిక సాకుతో నావలి రిజర్వాయర్ విస్తరణకు కర్ణాటక స్కెచ్
- బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా మార్చేందుకు 31 నుంచి 52 టీఎంసీలకు విస్తరణ
- ఎల్ఎల్సీకి సమంగా మరో కాలువ
- వరదజలాల మళ్లింపునకు పాచిక
- ఇప్పటికే బేసిన్ రాష్ర్టాలకు డీపీఆర్
- వచ్చే తుంగభద్ర బోర్డు మీటింగ్‌లో చర్చ
- రాష్ర్టాలను ఒప్పిస్తామన్న సిద్దరామయ్య
- గుట్టుచప్పుడు కాకుండా ‘డీకే’ పావులు
- నోరుమెదపని రేవంత్ రెడ్డి సర్కారు
- 2022లోనే విస్తరణ ప్రతిపాదన
- వ్యతిరేకించిన బీఆర్ఎస్ సర్కారు
- ప్రతిపాదనలు అమలైతే రాష్ర్టానికి నష్టం
Srisailam | హైదరాబాద్, జూన్22 (నమస్తే తెలంగాణ): ఓ వైపు గోదావరి జలాలను తమిళనాడుకు తరలించేందుకు కేంద్రం కుట్రపన్నుతుంటే.. మరోవైపు కృష్ణాజలాలను చెరబట్టేందుకు కర్ణాటక కాంగ్రెస్ సర్కారు మళ్లీ పాచికలు వేస్తున్నది. తుంగభద్ర డ్యామ్‌లో పూడిక పేరుకున్నదనే సాకుతో నావలి రిజర్వాయర్‌ను విస్తరించేందుకు సిద్ధమైంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే గుట్టుగా సంప్రదింపులు జరుపుతూ చర్యలు ముమ్మరం చేసింది. ఈ విషయాన్ని తాజాగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సిద్దరామయ్య సైతం బాహాటంగానే ప్రకటించారు. ఇప్పటికే డీపీఆర్‌లను అన్ని రాష్ర్టాలకు పంపడంతోపాటు, రాబోయే తుంగభద్ర బోర్డు సమావేశంలో చర్చించేందుకు సమాయత్తమవుతున్నారు. నావలి రిజర్వాయర్‌ను విస్తరిస్తే తెలంగాణకు తీరని నష్టం వాటిల్లుతుందని, శ్రీశైలం ప్రాజెక్టు ఎడారిలా మారే ప్రమాదముందని సాగునీటిరంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరుగుతున్నా రాష్ట్ర సర్కారు మాత్రం ఈ అంశంపై నోరుమెదపకపోవడం అనేక అనుమానాలను రేకెత్తిస్తున్నది.
‘నావలి’ ద్వారా నీటి తరలింపు
తుంగభద్ర డ్యామ్‌లో పూడికపెరిగి పూర్తిస్థాయిలో నీటిని వినియోగించుకోలేని పరిస్థితులున్నాయనే సాకుతో ప్రస్తుత లో లెవెల్ కెనాల్ (ఎల్ఎల్సీ)కు సమాంతరంగా మరో కాలువ తవ్వేందుకు కర్నాటక సర్కారు ప్రణాళికలు వేస్తున్నది. దీంతోపాటు 31 టీఎంసీల సామర్థ్యంతో ఉన్న నావలి రిజర్వాయర్‌ను 52 టీఎంసీలకు విస్తరించేందుకు సిద్ధమైంది.
బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన 230 టీఎంసీల నీటిని వినియోగించుకునే లక్ష్యంతో తుంగభద్ర డ్యామ్ నిర్మించారు. దీనికింద కర్నాటకలో 9,30,626, ఏపీలో 6,25,097, తెలంగాణలో 87వేల ఎకరాల ఆయకట్టు ఉన్నది. డ్యామ్‌లో పూడిక పెరగడంతో పాటు, వరద ప్రవాహాల్లో వచ్చిన మార్పుల ఫలితంగా అవిరి నష్టాలతో కలుపుకొని 230 టీఎంసీలు వినియోగించుకోవాల్సి ఉండగా, ప్రస్తుతం 174.72 టీఎంసీలను కూడా వాడుకోలేని పరిస్థితి ఉందని కర్నాటక సాకులు చెబుతూ తాజాగా ఈ ప్రతిపాదనలు ముందుకుతెచ్చింది. మొత్తంగా 55.28 టీఎంసీలను నష్టపోవాల్సి వస్తున్నదని, ఈ నేపథ్యంలోనే కొప్పల్ జిల్లా గంగావతి తాలుకాలో ఉన్న నావలి రిజర్వాయర్‌ను 52 టీఎంసీలకు విస్తరించి తుంగభద్ర డ్యామ్‌కు బ్యాలెన్సింగ్‌గా వినియోగించుకోవాలని ప్రణాళికలు వేసింది. ఎల్ఎల్సీకి సమాంతరంగా మరో కాలువ తవ్వి తుంగభద్ర వరదను నావలికి తరలించేందుకు వేగంగా అడుగులు వేస్తున్నది.
వచ్చే బోర్డు సమావేశంలో కీలక చర్చ
కర్నాటక ప్రతిపాదనలకు తుంగభద్ర బోర్డు ఆమోదం తప్పనిసరి. ఈమేరకు ఇప్పటికే నావ లి రిజర్వాయర్ విస్తరణకు డీపీఆర్‌ను సిద్ధం చేసిన కర్నాటక సర్కారు గత బోర్డు సమావేశంలోనే చర్చకు పెట్టేందుకు యత్నించింది. అయితే డీపీఆర్‌ను ఇవ్వకపోవడంతో బోర్డులోని తెలంగాణ సహా ఇతర రాష్ర్టాలు వ్యతిరేకించాయి. ఈ నేపథ్యంలో తాజాగా బోర్డులోని రాష్ర్టాలకు నావలి రిజర్వాయర్ విస్తరణ డీపీఆర్‌ను కర్నాటక పంపింది. త్వరలో నిర్వహించే బోర్డు సమావేశంలో దీనిపై చర్చించేందుకు కర్నాటక సర్కారు సమాయత్తమవుతున్నది.
తెలంగాణకు తీరని నష్టం..
కర్నాటక ప్రతిపాదనలు అమలైతే తెలంగాణకు తీరని నష్టం వాటిల్లనుంది. కృష్ణా నదికి తుంగ, భద్ర ఉపనదులు. ఈ రెండింటి నుంచే ఏటా దాదాపు 500 టీఎంసీల మేరకు జలాలు కృష్ణా నదిలోకి వస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే బచావత్ ట్రిబ్యునల్ తుంగభద్ర నదిపై ఎక్కడ పడితే అక్కడ, ఎలా పడితే అలా ప్రాజెక్టులు నిర్మించకుండా అనేక ఆంక్షలు విధించింది. కానీ కర్నాటక సర్కారు ఇప్పటికే ఆ నిబంధన లు తుంగలో తొక్కుతూ నిర్మాణాలు చేపడుతున్నది. ఇప్పుడు ఏకంగా నావలి, కొత్తగా మరికొన్ని బరాజ్‌ల నిర్మాణానికి పూనుకుంది. అదే జరిగితే భవిష్యత్‌లో తుంగభద్ర నుంచి కృష్ణాలోకి జలాల రాక పూర్తిగా తగ్గిపోతుంది. ఫలితంగా కృష్ణా జలాలపై ఆధారపడ్డ తెలంగాణకు తీరని నష్టం జరుగుతుందని ఇంజినీర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు జలాలు రావడమే గగనమని, ప్రాజెక్టు ఎడారిలామారే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.
నాడు వ్యతిరేకించిన బీఆర్ఎస్ సర్కారు
కర్నాటక సర్కారు ప్రతిపాదనలను ఆదిలోనే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్దంద్వంగా వ్యతిరేకించింది. నావలి రిజర్వాయర్ విస్తరణ ప్రతిపాదనలకు అంగీకరించాలని కోరుతూ 2022 లో కర్నాటక సర్కారు ప్రతిపాదించింది. ఇది తెలంగాణ ప్రయోజనాలకు తీరని నష్టమని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోబోమని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం కర్నాటకకు తేల్చిచెప్పి, ఆ ప్రతిపాదనలను తోసిపుచ్చింది. ట్రిబ్యునల్-2 అవార్డు అమల్లోకి వచ్చేదాకా ఆ ప్రాజెక్టుపై ముందుకుపోవద్దని తుంగభద్ర బోర్డు మీటింగ్‌లోనూ స్పష్టంచేసింది. బచావత్ ట్రిబ్యునల్ తుంగభద్రపై అనేక షరతులు విధిస్తూ 230 టీఎంసీలను కేటాయించిందని గుర్తుచేసింది. ట్రిబ్యునల్-2 అవార్డు వచ్చేదాకా తుంగభద్ర బేసిన్లో కొత్త ప్రాజెక్టులేవీ చేపట్టవద్దని కరాఖండిగా తేల్చిచెప్పింది.
నేడు కాంగ్రెస్ సర్కారు మౌనం
నావలి రిజర్వాయర్ విస్తరణ కోసం ప్రణాళికలు సిద్ధమయ్యాయని కర్నాటక డిప్యూటీ సీఎం, ఇరిగేషన్ మినిస్టర్ డీకే శివకుమార్ బాహాటంగా ప్రకటించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలతో చర్చించి వచ్చే బడ్జెట్లోనే ఈ ప్రాజెక్టును అమలు చేస్తామని గత ఫిబ్రవరిలోనే వెల్లడించారు. ఇదే విషయాన్ని అసెంబ్లీ వేదికగా ఏఐఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ ప్రస్తావించడంతోపాటు, కర్నాటకను అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సత్వరమే చర్య లు చేపట్టాలని డిమాండ్ చేశారు. నావలి రిజర్వాయర్ విస్తరణ అంశాన్ని తాజాగా కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్వయంగా ప్రకటించారు. అయినా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటివరకు ఈ అంశంపై నోరుమెదపడం లేదు. కర్నాటక సర్కారు పెద్దలు తెలంగాణ ప్రభుత్వ పెద్దలతో గుట్టుగా మంతనాలు సాగిస్తున్నారని తెలిసింది. అందుకే ఈ అంశం పై రాష్ట్ర ప్రభుత్వం మౌనం వహిస్తున్నదని సాగునీటి రంగ నిపుణులు, ఇంజినీర్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా నావలి రిజర్వాయర్ విస్తరణను వ్యతిరేకించాలని డిమాండ్ చేస్తున్నారు. నావలి రిజర్వాయర్ విస్తరణనే గాకుండా తుంగభద్రపై రాయచూరు జిల్లాలోని చికమంచాల సమీపంలో బ్రిడ్జి కమ్ బరాజ్ కట్టాలని, మంత్రాలయం రోడ్డు మార్గాన్ని కూడా అనుసంధానించాలని కర్నాటక నిర్ణయించింది. ఇందుకు ఏకంగా గత బడ్జెట్లోనే రూ.158 కోట్లు ప్రతిపాదించింది. దీనిపైనా తెలంగాణ కాంగ్రెస్ సర్కారు ఇప్పటివరకు స్పందించిన దాఖలాల్లేకపోవడం గమనార్హం.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

