నాంపల్లి క్రిమినల్ కోర్టులు, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ) : టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్, కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌పై బీఆర్ఎస్ఎల్పీ ఉప నేత హరీశ్‌రావు వేసిన పరువునష్టం దావా ను నాంపల్లిలోని ప్రతినిధుల కోర్టు శుక్రవారం విచారణకు స్వీకరించింది. రెండు కేసుల్లో వేర్వేరుగా రెండు గంటలపాటు హరీశ్‌రావు వాం గ్మూలాన్ని కోర్టు రికార్డు చేసింది. ఎందు కు ఫిర్యాదు చేశారని జడ్జి శ్రీదేవి ప్రశ్నించగా తనపై అసత్య ఆరోపణలు చేశారని, క్షుద్రపూజలు చేసినట్టు మీడియాకు తనపై తప్పుడు సమాచారం ఇచ్చారని హరీశ్‌రావు కోర్టుకు తెలిపారు.
తన పరువుప్రతిష్టలకు భంగం వాటిల్లే విధంగా వారిద్దరూ రాజకీయ కుట్రలకు పాల్పడినట్టు తెలిపారు. సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించారా? అని జడ్జి ప్రశ్నించగా, అవునని బదులిచ్చారు. ప్రముఖ పత్రికల్లో ప్రచురితమైన వార్తల క్లిప్పింగ్‌లను, టీవీ చానళ్లు ప్రసారం చేసిన వీడియోలను జడ్జి పరిశీలించారు. అనంతరం వాటిని సాక్ష్యాధారాలుగా అంగీకరించిన కోర్టు విచారణకు స్వీకరించింది. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్‌ను సాక్షులుగా ఫిర్యాదులో పేర్కొనడంతో వచ్చేనెల 8న వారి వాంగ్మూలం నమోదు చేయనున్నట్టు కోర్టు తెలిపింది.