భూ భారతి పోర్టల్‌పై ఇప్పటికే ప్రజల్లో అనేక సందేహాలు ఉండగా, తాజాగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో జరిగిన ఘటన ప్రభుత్వ భూముల భద్రతను ప్రశ్నార్థకం చేసింది. రికార్డుల్లో నిక్షేపంగా ఉన్న 4.25 ఎకరాల సర్కార్ భూమి రాత్రికి రాత్రే పట్టా భూమిగా మారింది. పాస్‌పుస్తకం కూడా వచ్చినా అధికారులు తమకేం తెలియదని తెల్లమొఖం వేయడం విస్మయానికి గురిచేస్తున్నది. దీనిపై విచారణకు అధికారు లు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసి ఐదు రోజులు గడుస్తున్నా అతీగతీ లేదు. మరో మూడు మండలాల్లోనూ ఇలాంటి లావాదేవీలు జరుగడం, పోర్టల్ హ్యాక్ అంటూ ప్రచారం జరుగుతుండటంతో ‘దాల్ మే కుచ్ కాలా హై’ అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/ఆదిబట్ల, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): భూ అక్రమాలను అరికడుతామని, అత్యంత పకడ్బందీగా రూపొందించామని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకొంటున్న ‘భూ భారతి’ పోర్టల్‌లో నిజంగానే సర్కార్ భూములకు రక్షణ ఉన్నదా? లేక హారతి అవుతున్నాయా? తహసీల్దార్ ప్రమేయం లేకుండానే రాత్రికి రాత్రే భూముల లావాదేవీలు జరిగిపోతాయా?.. ప్రస్తుతం ప్రజల్లో తలెత్తుతున్న ప్రశ్నలు ఇవి. వీటికి అధికారుల నుంచిగానీ, ప్రభుత్వం నుంచిగానీ సరైన సమాధానం మాత్రం దొరకడం లేదు.
‘అందరూ శాకాహారులే.. కానీ కోడి మాయమైందట!’ అన్నట్టుగా భూభారతిలో సర్కార్ భూములు హారతి అవుతున్నాయి. తహసీల్దార్ ప్రమేయం లేకుండా ఏకంగా రూ.50 కోట్ల విలువైన ప్రభుత్వ భూమి పట్టాగా మారగా, పాస్‌పుస్తకం కూడా జారీ అయ్యింది. పాస్‌బుక్‌లో స్పష్టంగా తహసీల్దార్ డిజిటల్ సంతకం ఉండగా, తనకేమీ సంబంధం లేదని, అదెలా వచ్చిందో అర్థం కావడంలేదంటూ ఆ అధికారి చెప్తున్నారు. దీంతో పోర్టల్‌పై సందేహాలు బలపడుతున్నాయి.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలోని మంగళ్‌పల్లి గ్రామ సర్వేనంబర్ 96లో 4.34 ఎకరాల భూమి ఉన్నది. మొదటి నుంచీ ఇది సర్కార్ పొరంబోకుగానే రికార్డుల్లో వస్తున్నది. 22ఏ నిషేధిత జాబితాలో కూడా పొందుపరిచారు. ఇటీవల ఇందులో 4.25 ఎకరాల భూమి పట్టాగా మారి, ఓ మహిళ పేరుతో నమోదైనట్టు తేలింది. రికార్డులను పరిశీలించగా, గత నెల 8న సర్వేనంబర్ 96/1తో వహీదాబేగం అనే మహిళ పేరిట పట్టా భూమిగా భూభారతిలోకి ఎక్కినట్టు గుర్తించారు. ఖాతా నంబర్ 61140తో కొత్త పాస్ పుస్తకం (టీ00090192366) కూడా జారీ అయినట్టు నిర్ధారించారు.
దానిపై తహసీల్దార్ డిజిటల్ సంతకం కూడా ఉన్నది. ఈ భూమి విలువ రూ.50 కోట్ల వరకు ఉంటుందని స్థానికులు తెలిపారు. విషయం బయటికి పొక్కడంతో అధికారులు అంతర్గతంగా విచారణ జరిపారు. చివరికి తహసీల్దార్ బీ సునీత ఈ నెల ఒకటో తేదీన ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. సదరు ఎంట్రీ భూభారతి పోర్టల్‌లోకి ఎలా వచ్చిందో అర్థం కావడం లేదని, ఇందుకు సంబంధించిన సపోర్టింగ్ డాక్యుమెంట్లుగానీ ప్రొసీడింగ్స్గానీ ఏమీ లేవని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రభుత్వ భూమి వహీదాబేగం పేరుమీదికి మారడాన్ని తీవ్రమైనదిగా పరిగణించి, విచారణ జరిపి, తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ అంశంపై తాము ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చామని తహసీల్దార్ తెలిపారు.
ప్రభుత్వ భూమి ఒక మహిళ పేరుమీదికి మారిన ఎంట్రీని రద్దుచేయడంతోపాటు పాస్ పుస్తకాన్ని కూడా రద్దు చేయాలని లిఖితపూర్వకంగా సమాచారం ఇచ్చినట్టు వెల్లడించారు. అయితే ఈ భూమి విషయంలో గతంలో ఏర్పాటు చేసిన బోర్డును ప్రైవేట్ వ్యక్తులు తొలగించినప్పటికీ అధికారులు నోరు మెదపడం లేదు. దీంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసినా, ఇప్పటివరకు విచారణ ఇసుమంతైనా ముందకు సాగలేదని స్థానికులు చెప్తున్నారు. అసలు ఈ కేసుపై దృష్టే పెట్టడం లేదని విమర్శిస్తున్నారు.
ప్రభుత్వ భూమి వహీదాబేగం పేరు మీదికి పట్టా భూమిగా మారడం, పాస్ పుస్తకాలు జారీ కావడంపై రెవెన్యూ అధికారుల్లోనూ స్పష్టత రావడం లేదు. అందరూ ‘ఏం జరిగిందో మాకు తెలియడం లేదు’ అని మాత్రమే చెప్తున్నారు. గత అనుభవాలను పరిశీలిస్తే.. రెవెన్యూ ఆఫీసుల్లో అధికారుల డిజిటల్ కార్యకలాపాలను దిగువన ఉన్న సిబ్బంది, ప్రధానంగా డాటా ఆపరేటర్లు దుర్వినియోగం చేసిన సందర్భాలు అనే కం ఉన్నాయి. కానీ ఇక్కడ అలా జరుగలేదని తహసీల్దార్ సునీత బలంగా చెప్తున్నారు. ‘మీ వేలిముద్రను ఇతర సిబ్బంది వాడుకొని ఈ ఎంట్రీ చేసే అవకాశం ఉంది కదా?’ అని ప్రశ్నించగా, అలాంటిదేమీ జరుగలేదని స్పష్టం చేశారు. పైగా ఆ సంతకం ఫోర్జరీ కూడా కాదని చెప్తున్నారు.
నగర పరిధిలోని మరో రెండు మండలాల్లోనూ ఇదే తరహాలో అధికారులకు తెలియకుండానే ఆన్లైన్లో ఎంట్రీలు జరిగాయని, ప్రధానంగా ప్రభుత్వ భూములు పట్టా భూములుగా మారాయనే ప్రచారం జరుగుతున్నది. సంతకం ఫోర్జరీ కాకుండా, కార్యాలయ సిబ్బంది కుట్ర లేకుండా భూభారతి పోర్టల్‌లో ఎంట్రీలు ఎలా జరుగుతాయని నిపుణులు ప్రశ్నిస్తున్నారు. కొందరు భూభారతి పోర్టల్ హ్యాక్ జరిగి ఉండవచ్చునంటూ కొత్త వాదన తెరమీదికి తెచ్చారు. ఒకవేళ హ్యాకింగ్ నిజమే అయితే పోర్టల్ సురక్షితం కాదని, లక్షలాది మంది రైతుల డాటా భద్రమేనా? అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం వెంటనే ఈ అంశంపై లోతుగా విచారించాలని డిమాండ్ చేస్తున్నారు.