హైదరాబాద్, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ): విద్యుత్తు వినియోగదారులపై రూ.7,635 కోట్ల మేర ‘ట్రూ-అప్’ చార్జీల పేరుతో భారాన్ని మోపాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని సీపీఎం రాష్ట్ర కార్యాలయంలో జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. ఈఆర్సీ విధానాలను సీపీఎం రాష్ట్ర కమిటీ వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. 2026 నవంబర్‌లో యూనిట్‌కు 30 పైసలు, డిసెంబర్ నుంచి యూనిట్‌కు 50 పైసల చొప్పున పెంచాలని డిసమ్లు నిర్ణయించడం ప్రజల నడ్డి విరవడమే అని మండిపడ్డారు.
ఈ పెంపుదల ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని, లేనట్టయితే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే నిత్యావసర సరుకుల ధరలు పెరిగి ప్రజలు అల్లాడిపోతుంటే, మరోవైపు కరెంటు చార్జీల పెంపుతో వారి బతుకులు భారంగా మారుతున్నాయని వాపోయారు. ప్రభుత్వ శాఖల నుంచి డిసమ్లకు రావాల్సిన రూ. వేల కోట్ల బకాయిలు రాబట్టడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. నీటిపారుదల శాఖ నుంచే ఎత్తిపోతల పథకాల కింద రావాల్సిన బకాయిలే రూ.29 వేల కోట్లకు పైగా ఉన్నప్పటికీ, ఆ భారాలన్నింటినీ ఇప్పుడు ప్రజల మీదికి నెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.