న్యూఢిల్లీ: ఇప్పటికే మన వంట గదిని తాకిన పశ్చిమాసియా యుద్ధ సెగ ఇప్పుడు బెడ్రూమ్కు కూడా పాకింది. కండోమ్‌ల ఉత్పత్తికి ఉపయోగించే ముడి సరుకుల ధరలు కొండెక్కడంతో ఇప్పుడు కండోమ్ ధరలు కూడా పెరుగనున్నాయి. పెట్రోకెమికల్ ఉత్పత్తుల సరఫరా చెయిన్‌కు ఆటంకం ఏర్పడటంతో దాని ప్రభావం రబ్బరు గర్భ నిరోధకాల ఉత్పత్తిపై పడింది. భారత్‌లో రూ. 8,000 కోట్ల విలువైన కండోమ్ తయారీ సెక్టార్లో ప్రతి ఏడాదీ 400 కోట్ల యూనిట్ల కండోమ్‌లు ఉత్పత్తి అవుతున్నాయి. వీటి తయారీకి ప్రధానంగా సిలికాన్ ఆయిల్, అమోనియా ప్రధాన ముడిపదార్థాలుగా వినియోగిస్తారు. ప్రస్తుతం అమోనియా అవసరమైనంత లభ్యం కావడం లేదు. వీటి ధరలు 40-50 శాతం పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. సిలికాన్ ఆయిల్ ధర అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పటికే చాలా ఖరీదుగా మారింది. దీంతో ఇప్పటికే వీటి ఉత్పత్తి తగ్గుముఖం పట్టినట్టు ప్రముఖ కండోమ్‌ల తయారీ సంస్థలు వెల్లడించాయి.