కష్టాల్లో రైతులు.. ప్రచారంలో మంత్రులు
మొంథా తుపాను ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతులు కష్టాల్లో చిక్కుకుంటే వారికి భరోసానివ్వాల్సిన ముఖ్యమంత్రి, మంత్రులు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో మునిగితేలుతున్నారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.
- మొంథా తుపానుతో అపార నష్టం
- సహాయక చర్యల్లో సర్కారు విఫలం
- తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలి
- పండిన మక్కజొన్నలు మొత్తం కొనాలి
- జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి
హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): మొంథా తుపాను ప్రభావంతో పంటలు నష్టపోయిన రైతులు కష్టాల్లో చిక్కుకుంటే వారికి భరోసానివ్వాల్సిన ముఖ్యమంత్రి, మంత్రులు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో మునిగితేలుతున్నారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిని, వందలాది పశువులు, మేకలు, గొర్రెలు కొట్టుకుపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్నా ప్రభుత్వ పెద్దల నుంచి కనీస స్పందనలేకపోవడం దుర్మార్గమని దుయ్యబట్టారు. తుపాను ప్రభావం, పంట నష్టంపై ఒక్కసారి కూడా సమీక్షించకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. గురువారం ఆయన తెలంగాణభవన్‌లో కార్పొరేషన్ల మాజీ చైర్మన్లు పల్లె రవికుమార్‌గౌడ్, రామచంద్రునాయక్, బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షుడు తుంగ బాలుతో కలిసి మీడియాతో మాట్లాడారు.
దిక్కుతోచని స్థితిలో మక్కరైతులు
రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లక్షల ఎకరాల్లో మక్కజొన్న దెబ్బతినడంతో మక్కరైతులు దిక్కుతోచని స్థితిలో చిక్కుకున్నారని పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. మక్కజొన్న ఎకరాకు 30 క్వింటాళ్ల పంట పండితే ప్రభుత్వం మాత్రం ఎకరాకు 18 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయాలని నిర్ణయించడం దుర్మార్గమని మండిపడ్డారు. రైతుల దగ్గర మిగిలిపోయిన మక్కజొన్న పంటను కొనుగోలు చేసేదెవరని ప్రశ్నించారు. మక్కలకు క్వింటాల్‌కు మద్దతు ధర రూ.2,400 ఉండగా ప్రభుత్వం కేవలం రూ.1800 చెల్లిస్తున్నదని ఆరోపించారు.
కౌలు రైతులు పండించిన పంటను కొనుగోలు చేయకపోవడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. 11 లక్షల క్వింటాళ్ల మక్కలు కొంటామని ప్రగల్భాలు పలికిన ప్రభుత్వం 11 క్వింటాళ్లు కూడా కొనుగోలు చేయలేదని ఆరోపించారు. సోయాబిన్ క్వింటాల్ కూడా కొనలేదని, వానలకు పత్తి తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోయారని చెప్పారు. తేమను 11 శాతానికి తగ్గించడంతో పంటను అమ్ముకోలేని పరిస్థితి ఉన్నదని ఆవేదన వ్యక్తంచేశారు.
ప్రభుత్వం స్పందించి సీసీఐని ఒప్పించి 15, 16% తేమ ఉన్నా కొనుగోలు చేసేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. చేతికొచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని పల్లా ఆగ్రహం వ్యక్తంచేశారు. ధాన్యం సెంటర్లలో కనీస సౌకర్యాలు కల్పించలేదని, టార్పాలిన్లు, గోనె సంచులు సమకూర్చడంలోనూ నిర్లక్ష్యం చేస్తున్నదని దుయ్యబట్టారు. ప్రభుత్వం స్పందించి బాధిత రైతులను ఆదుకోవాలని, తడిసిన ధాన్యం, పత్తి, మక్కజొన్న పంటలను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
బందిపోట్లలా దోచుకుంటున్నరు
కష్టాల్లో ఉన్న రైతాంగాన్ని ఆదుకోవడంలో విఫలమైన ముఖ్యమంత్రి, మంత్రులు బందిపోటు దొంగల్లా ప్రజాధనాన్ని దోచుకుతింటున్నారని పల్లా విమర్శించారు. వాటాలు, కమీషన్ల కోసం కొట్లాడుకుంటూ తెలంగాణ ప్రజల పరువుతీస్తున్నారని మండిపడ్డారు. వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రి చివరకు సమ్మక్క టెండర్లనూ వదల్లేదని దుయ్యబట్టారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించాల్సిన ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రులు జూబ్లీహిల్స్‌లో రౌడీలతో కలిసి ఓటర్లను బెదిరిస్తున్నారని ఆరోపించారు.
పంట నష్టంపై రివ్యూ ఏది?: ఎమ్మెల్సీ తాతా మధు
తుపాను ప్రభావంతో లక్షలాది ఎకరాల్లో పంట నష్టపోయినా ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమని ఎమ్మెల్సీ తాతా మధు మండిపడ్డారు. గతంలో ఖమ్మం, భద్రాచలంలో వరదలు వస్తే అప్పటి సీఎం కేసీఆర్ స్వయంగా పర్యటించి ఎకరాకు రూ.10 వేల చొప్పున పరిహారం అందించారని గుర్తుచేశారు. కానీ, వరదలతో అపారనష్టం జరిగినా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నదని విమర్శించారు. ఖమ్మం జిల్లాలో నిమ్మవాగు పొంగిపొర్లి డీసీఎం డ్రైవర్ కొట్టుకుపోయినా కాపాడటంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. మధిరలో వర్షాలతో భారీ పంట నష్టం జరిగినా డిప్యూటీ సీఎం పట్టించుకోవడంలేదని ఆరోపించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

