Congress | హైదరాబాద్, అక్టోబర్ 8 (నమస్తేతెలంగాణ) : తెలంగాణలో కొద్దిరోజులుగా నెలకొన్న పరిణామాలు.. ఢిల్లీలో కొనసాగుతున్న నిరసననలు.. కాంగ్రెస్ ద్వంద్వవైఖరికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఇక్కడ విపక్షం టార్గెట్‌గా అణచివేతకు పాల్పడుతున్న కాంగ్రెస్.. అక్కడ మోదీ సర్కార్ అదే చర్యలకు దిగితే పెడబొబ్బలు పెడుతున్నది. మొన్నటికి మొన్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ నేతల నిరసనను తప్పుగా చిత్రీకరించేందుకు ప్రయత్నించిన రేవంత్ సర్కార్.. ఢిల్లీలో దాన్నే ప్రజాస్వామ్య పరిరక్షణగా ప్రవచిస్తున్నది. ఇక్కడ నిరసన గొంతునొక్కి, నిరంకుశంగా ప్రవర్తించి, అణచివేతకు దిగిన ముఖ్యమంత్రే.. తమ పార్టీ నిరసనకు మద్దతు తెలిపేందుకు ఢిల్లీకి వెళ్లడం మరో విచిత్రం! కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి జ్ఞానేశ్ కుమార్ రాజీనామా కోరుతూ అగ్రనేత రాహుల్ నేతృత్వంలో కాంగ్రెస్ నిరసనలు చేపడుతున్నది.
అయితే తాను అధికారంలో ఉన్న తెలంగాణలో ప్రజాఉద్యమాలపై కర్కశంగా ఉక్కుపాదం మోపుతున్న కాంగ్రెస్.. అక్కడ మాత్రం రాజ్యాంగ పరిరక్షణ అంటూ నీతులు చెప్తున్నది. కాంగ్రెస్ అనుసరిస్తున్న రెండునాల్కల ధోరణిని రాజకీయ విశ్లేషకులు తప్పుపడుతున్నారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలతో వ్యవహరించిన తీరుకు, ఢిల్లీలో ప్రతిపక్షంగా కాంగ్రెస్ వ్యవహార శైలికి మధ్య పరస్పర వైరుధ్యాన్ని వారు గుర్తుచేస్తున్నారు. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పాటిస్తున్న వైఖరే.. అక్కడ అధికార బీజేపీ అమలు చేస్తుండటం ‘కర్మ హిట్స్ బ్యాక్’ అని సామాజిక మాధ్యమాల్లో వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఢిల్లీలో కేంద్ర ఎన్నికల కమిషనర్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు రాహుల్‌గాంధీ, ప్రియాంకగాంధీతోపాటు ఇండియా కూటమి ఎంపీలు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ క్రమంలో రాహుల్ ఈసీ ఆఫీస్ దిశగా దూసుకుపోయేందుకు ప్రయత్నించగా.. అక్కడ పోలీసులు భారీగా బారికేడ్లు ఏర్పాటుచే ఎవరినీ అనుమతించలేదు. దీంతో పైకి ఎక్కి జాతీయ జెండాతో నినాదాలతో హోరెత్తించారు. ప్రియాంకను అరెస్టు చేయడానికి ప్రయత్నించడంతో ఆమె నడిరోడ్డుపై పడుకొని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రతిపక్ష నాయకులకు గౌరవం లేదు, మహిళా ఎంపీలకు రక్షణ లేదంటూ కాంగ్రెస్ ఎంపీలు చేసిన నినాదాలతో పరిస్థితి గందరగోళంగా మారింది. నిజానికి జ్ఞానేశ్‌కుమార్ వ్యవహారం తప్పని దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నప్పటికీ.. కాంగ్రెస్ అగ్రనేతలు వ్యవహరించిన తీరుపై ఇప్పుడు సర్వత్రా చర్చ జరుగుతున్నది. తాము అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ప్రతిపక్ష నేతలు, నిరసనకారుల పట్ల వ్యవహరిస్తున్న తీరును పట్టించుకోని కాంగ్రెస్ అధిష్ఠానం.. ఢిల్లీ వీధుల్లో తనదాకా వచ్చేసరికి రాద్ధాంతం చేస్తున్నదనే విమర్శలు వస్తున్నాయి.

రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతలతో కాంగ్రెస్ వ్యవహరించినట్టే, ఢిల్లీలో కాంగ్రెస్ నేతల పట్ల బీజేపీ వ్యవహరిస్తున్నదని, ఇందులో తప్పేమున్నదనే మాట వినిపిస్తున్నది. ఢిల్లీ పరిణామాలను తెలంగాణలోని కాంగ్రెస్సేతర పార్టీలు, తెలంగాణవాదులు కాంగ్రెస్ ‘కర్మ రిటర్న్స్’గా అభివర్ణిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాలపై వ్యవహరిస్తున్న తీరునే.. ఢిల్లీలో కాంగ్రెస్‌పై బీజేపీ పాటిస్తున్నదని చెప్తున్నారు. ప్రస్తుతం ఢిల్లీలో నిషేధాజ్ఞలు ఉన్న ప్రాంతంలో పోలీసులను తోసుకుంటూ వెళ్లి.. బారికేడ్లు ఎక్కి రాహుల్‌గాంధీ ఎలా నిరసన తెలుపుతారని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్, హరీశ్‌రావులు చేసింది తప్పు అయితే.. రాహుల్ చేసింది తప్పే అంటున్నారు. ఇక నడిరోడ్డుపై పడుకొని నిరసన తెలిపిన ప్రియాంకగాంధీని అరెస్ట్ చేసేందుకు వచ్చిన మహిళా పోలీసులను కాంగ్రెస్ ఎంపీలు అడ్డుకోవడం కూడా పోలీసు విధులకు ఆటంకం కలిగించడమే అని నెటిజన్లు పేర్కొంటున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ నేతలు ఆందోళనలు చేస్తే వాటిని తప్పుబట్టిన కాంగ్రెస్, అదే తరహాలో ఢిల్లీలో బారికేడ్లు ఎకి, రోడ్లపై పడుకొని పోలీసులతో ఘర్షణకు దిగడాన్ని సమర్థించుకుంటున్నదని సోషల్ మీడియాలో విశ్లేషకులు, విపక్షాలు మండిపడుతున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు నిరసనలను అణచివేయడం కరెక్ట్ అనుకుంటే, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమపై జరిగే అరెస్టులను తప్పుబట్టడం రాజకీయ ద్వంద్వ వైఖరేనని అభిప్రాయపడుతున్నారు.
తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల సందర్భంగా బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ ప్రభుత్వం అణచివేత చర్యలకు పాల్పడింది. బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీశ్లతోపాటు మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు అత్యంత అమానుషంగా వ్యవహరించారు. నల్ల దుస్తులు ధరించి, కాంగ్రెస్ వ్యతిరేకంగా టీషర్ట్‌లపై వచ్చిన బీఆర్ఎస్ నేతలను అసెంబ్లీలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. తనను అసెంబ్లీలోకి అనుమతించాలని పట్టుబట్టిన హరీశ్‌రావు ..తన టీ-షర్టును తీసేశారు. అయినప్పటికీ పోలీసులు కేటీఆర్‌తోపాటు అతడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా భద్రతా సిబ్బంది బీఆర్ఎస్ నేతలపై అమానుషంగా ప్రవర్తించారు. భద్రతా సిబ్బందిలో ఒక మగ పోలీసు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి జుట్టు పట్టుకుని లాగారు. ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి చీరను లాగారు. ఎమ్మెల్యే కోవా లక్ష్మిని మగ పోలీసులు అడ్డుకొని నెట్టివేశారు. ఈ ఘటనపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. రాష్ట్రపతికి, జాతీయ మహిళా కమిషన్‌కు బీఆర్ఎస్ ఫిర్యాదు కూడా చేసింది. అయినా కాంగ్రెస్ సర్కార్ పట్టించుకోలేదు. పైగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపైనే పోలీసులతో తప్పుడు కేసులు పెట్టించింది. నల్ల టీషర్ట్‌పై పోలీసుల అభ్యంతరం చెప్పడంతో, హరీశ్‌రావు అక్కడికక్కడ టీషర్ట్ తీసేశారు. దానినీ కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయం చేసింది. పోలీసులను అడ్డుకున్నారని కేటీఆర్ తదితరులపై కేసులుపెట్టింది.