హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ) : బీఆర్క్ ప్రవేశాల నోటిఫికేషన్ జూలై 3న విడుదల కానున్నది. ఈ ఏడాది రెండు విడతల్లో సీట్లను భర్తీచేస్తారు. బీఆర్క్ ప్రవేశాల కమిటీ సమావేశాన్ని మంగళవారం మాసబ్‌ట్యాంక్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో నిర్వహించారు. మండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి, ప్రవేశాల కమిటీ కన్వీనర్ ప్రొఫెసర్ డీ షర్మిల తదితరులు హాజరై షెడ్యూల్ ఖరారు చేశారు. జూలై 6 నుంచి 19 వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. రిజిస్ట్రేషన్ సమయంలోనే డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి.
జూలై 23న ఎన్సీసీ, క్యాప్, పీహెచ్, స్పోర్ట్స్ కోటా సర్టిఫికెట్ వెరిఫికేషన్ నిర్వహిస్తారు. ఆగస్టు 7 నుంచి 10 వరకు మొదటి విడత వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. ఆగస్టు 12న సీట్లు కేటాయిస్తారు. ఆగస్టు 13, 24 తేదీల్లో సీట్లు పొందిన కాలేజీల్లో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఖాళీలు ప్రకటిస్తారు. ఆగస్టు 19, 20 తేదీల్లో రెండో విడత వెబ్ ఆప్షన్లు ఎంచుకోవచ్చు. ఆగస్టు 22న సీట్లు కేటాయిస్తారు. ఆగస్టు 24,25 తేదీల్లో సీటు వచ్చిన కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి. ఆగస్టు 28న ఖాళీలు ప్రకటిస్తారు. 29న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదల చేస్తారు. సెప్టెంబర్ 1 నుంచి క్లాసులు ప్రారంభమవుతాయి.