హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ) : యాంటి-కొవిడ్ ఉత్పత్తులకు సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీవో) ఆమోదం తెలిపినట్టు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అధికారులు గురువారం వెల్లడించారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (యూవోహెచ్), మాసా ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో యాస్పైర్ బయోనెస్ట్ స్టారప్ సంస్థ యాంటి కొవిడ్ ఉత్పత్తుల (సర్ఫేస్ క్లీనర్, అమ్సా స్ప్రే, మాస్క్లు)ను తయారు చేసింది. కాగా, యాంటి మైక్రోబియల్కు సంబంధించిన అమ్సా శానిటరీ ప్యాడ్లు, అడల్ట్ డైపర్లు, వైప్స్ వంటివి మార్కెటింగ్ అనుమతులు పొందినట్టు తెలిపారు. ఈ మేరకు మాసా ఇన్నోవేషన్ వ్యవస్థాపకుడు అమితవ మజుందార్ హర్షం వ్యక్తం చేశారు.