Insect | గద్వాల రూరల్ : ప్రకృతిలో ఎన్నో వింతలు, విశేషాలు కనిపిస్తుంటాయి. వాటిలో కొన్ని సహజత్వానికి భిన్నంగా ఉంటూ ఆకట్టుకుంటే.. మరికొన్ని ఆలోచింపజేసేలా ఉంటాయి. అయితే అచ్చం మనిషి ముఖాన్ని పోలిన కీటకం జోగుళాంబ గద్వాల జిల్లాలో ప్రత్యక్షమైంది. చెనుగోనిపల్లికి చెందిన హలీం పాషా ఇంటి ఆవరణలో ఉన్న చెట్టుకు మనిషి ముఖాన్ని తలపించేలా ఉన్న పురుగు (కాండం తొలచు కీటకం) కనిపించింది.
ఆశ్యర్యంగా ఉన్న ఈ వింత పురుగుకి కళ్లు, ముక్కు, నోరు, తల భాగం అచ్చం మనిషిని పోలి ఉన్నాయి. ఈ కాండం తొలచు కీటకాన్ని చూసి పాషా కుటుంబ సభ్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఫొటో తీసి సామాజిక మాధ్యమాలలో షేర్ చేశారు. కాగా ఈ కీటకాన్ని స్టిక్ బగ్ (కాండం తొలచు కీటకం) అంటారని పాలమూరు విశ్వవిద్యాలయం జంతుశాస్త్ర విభాగం ప్రొఫెసర్ రాజశేఖర్ తెలిపారు. ఇవి ఎల్లో, పింక్, రెడ్ కలర్స్‌లో ఉంటాయని, ఎక్కువగా శ్రీలంక, ఆఫ్రికా, థాయ్‌లాండ్ దేశాల్లో కనిపిస్తాయని పేర్కొన్నారు. ఇండియాలో తక్కువగా ఉంటాయన్నారు.