మహారాష్ట్ర పవర్ ప్రాజెక్ట్లోఅదానీ మాయాజాలం?
మహారాష్ట్రలో ఓ జలవిద్యుదుత్పత్తి ప్రాజెక్ట్ వ్యయాన్ని అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఏకంగా 99 శాతం తగ్గించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారిందిప్పుడు. సతార జిల్లాలోని తారళి డ్యామ్ రిజర్వాయర్‌పై 1,500 మెగావాట్ల సామర్థ్యంతో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్‌ను నిర్మించతలపెట్టారు. అయితే కేంద్ర ప్రభుత్వ అంచనా వ్యయానికి, అదానీ కోరుతున్న ప్రతిపాదిత ఖర్చుకు పొంతనే లేకుండా ఉన్నది. ఓ ప్రముఖ జాతీయ దినపత్రిక వివరాల ప్రకారం.. ఈ ఏడాది సెప్టెంబర్ 8న మహారాష్ట్ర అటవీ శాఖకు సమర్పించిన నోటరీ అఫిడవిట్లో పథకం వ్యయాన్ని రూ.56.75 కోట్లకు సవరించా
సతార, నవంబర్ 13: మహారాష్ట్రలో ఓ జలవిద్యుదుత్పత్తి ప్రాజెక్ట్ వ్యయాన్ని అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఏకంగా 99 శాతం తగ్గించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారిందిప్పుడు. సతార జిల్లాలోని తారళి డ్యామ్ రిజర్వాయర్‌పై 1,500 మెగావాట్ల సామర్థ్యంతో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్‌ను నిర్మించతలపెట్టారు. అయితే కేంద్ర ప్రభుత్వ అంచనా వ్యయానికి, అదానీ కోరుతున్న ప్రతిపాదిత ఖర్చుకు పొంతనే లేకుండా ఉన్నది. ఓ ప్రముఖ జాతీయ దినపత్రిక వివరాల ప్రకారం.. ఈ ఏడాది సెప్టెంబర్ 8న మహారాష్ట్ర అటవీ శాఖకు సమర్పించిన నోటరీ అఫిడవిట్లో పథకం వ్యయాన్ని రూ.56.75 కోట్లకు సవరించాలని అదానీ గ్రీన్ ఎనర్జీ కోరింది. అయితే ఈ పథకానికి ముందస్తు పర్యావరణ అనుమతి ఇవ్వాలని సిఫార్సు చేసిన కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ.. గత ఏడాది ఫిబ్రవరి 11న రాసిన లేఖలో వ్యయాన్ని రూ.5,675 కోట్లుగా స్పష్టంగా పేర్కొన్నది. అయినప్పటికీ దీనికి సంబంధించి రాష్ట్ర స్థాయిలో పావులు కదిపి లైన్ క్లియర్ చేసుకున్న అదానీ.. కేంద్రం నుంచి కూడా అనుమతులను పొందేలా ప్రయత్నిస్తున్నారు. దీంతో అనేక సందేహాలు కలుగుతున్నాయి.
టైగర్ రిజర్వ్‌కు దెబ్బ
ఇక ప్రాజెక్ట్ వ్యయం తగ్గితే వన్యప్రాణి అభయారణ్య పరిరక్షణ కోసం సహ్యాద్రి టైగర్ రిజర్వ్‌కు చెల్లించాల్సిన మొత్తం కూడా భారీగా తగ్గనున్నది. ఇప్పటికే సవరించిన వ్యయ అంచనా రూ.56.75 కోట్లను మహారాష్ట్ర అటవీ శాఖ ఇటీవల ఆమోదించింది. దీంతో పథకం వ్యయం లో ఒక శాతమైన రూ.56.75 లక్షలను సహ్యాద్రి టైగర్ రిజర్వ్ బ్యాంకు ఖాతాలో అదానీ సంస్థ జమ కూడా చేసింది. జాతీయ వన్యప్రాణి బోర్డు ఆమోదం తర్వాత మిగిలిన 3 శాతానికి సమానమైన మొత్తాన్ని జమ చేయాల్సి ఉన్నది. లెక్క ప్రకారం ప్రాజెక్ట్ వ్యయంలో ఈ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ సంరక్షణకు 4 శాతం ఇవ్వాల్సి ఉన్నది. ప్రాజెక్ట్ వ్యయం రూ.5,675 కోట్లుగా ఉంటే రూ.227 కోట్లు చెల్లించాల్సి వస్తున్నది. అదే రూ.56.75 కోట్లకు తగ్గితే రూ.2.27 కోట్లతో సరి.
ఫిర్యాదుతో..
సతార జిల్లా గౌరవ వన్యప్రాణి సంరక్షకుడు రోహన్ భాటే గత నెల 30న ప్రధాన మంత్రి ఫిర్యాదుల పరిష్కార పోర్టల్లోతోపాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్ర ప్రభుత్వ ఆప్లే సర్కార్ ఫిర్యాదుల పరిష్కార పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేశారు. పథకం వ్యయాన్ని తప్పుగా పేర్కొన్నారని అందులో ఆయన ఆరోపించారు. మార్చిన వ్యయంతో ప్రాజెక్టు నిర్మాణం సాధ్యం కాదన్నారు. ఈ క్రమంలోనే దీనిపై ప్రాధాన్యంతో విచారణ జరుపాలని కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ.. ఈ నెల 6న రాష్ట్ర అటవీ శాఖను ఆదేశించింది. సతార జిల్లాలోని పటాన్ తాలూకా నివాడే, తొండోషి, కలాంబే, జాలు గ్రామాల్లోని 150.74 హెక్టార్ల అటవీయేతర భూమిలో తారళి డ్యామ్ జలాశయంపై 1,500 మెగావాట్ల తారళి పంప్డ్ స్టోరేజీ పథకాన్ని ప్రతిపాదించారు.
ఈ పథకం సహ్యాద్రి టైగర్ రిజర్వ్‌లో భాగమైన సతార కొయ్నా వన్యప్రాణి అభయారణ్యం బఫర్ లేదా డీమ్డ్ ఎకో సెన్సిటీవ్ జోన్ మీదుగా వెళ్తున్నది. దీంతోనే రిజర్వ ఫారెస్ట్ సంరక్షణకు ప్రాజెక్ట్ అంచనా వ్యయంలో 4 శాతం ఇవ్వాలని తేల్చారు. మరోవైపు ఈ వ్యవహారంపై అదానీ గ్రూప్ ప్రతినిధి స్పందిస్తూ.. ‘పటాన్ తాలూకాలోని మూడు రెవెన్యూ గ్రామాల పరిధిలో తారళి పంప్డ్ స్టోరేజీ పథకంలోని అన్ని భాగాలు ప్రైవేట్ భూముల్లోనే ఉన్నాయి. ఇందులో అటవీ భూమి లేదు. కార్యకలాపాల సమయంలో పంప్డ్ స్టోరేజీ పథకాల వల్ల దిగువ ప్రాంతాల పర్యావరణ వ్యవస్థ, అడవులు, వన్యప్రాణులపై ప్రతికూల ప్రభావం ఉండదు’ అని అంటున్నారు. కానీ సవరించిన పథకం వ్యయంపై అడిగిన నిర్దిష్ట ప్రశ్నకు మాత్రం ఆయన స్పందించలేదు. ఇక ఈ వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ.. ప్రధాని మోదీ, అదానీ కలిసి అనేక కుంభకోణాలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!

