హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ): ఒకవైపు రాకెట్‌సైన్స్, మషిన్ లర్నింగ్, బిజినెస్ అనాలసిస్, రోబోవార్స్ ప్రదర్శనలు.. మరోవైపు సినీస్టార్స్తో ఇంటరాక్టివ్ సెషన్స్.. ఇంకోవైపు రేసింగ్ కార్ల ప్రదర్శనలతో హైదరాబాద్ బిట్స్ పిలానీ కళాశాల హోరెత్తింది. విజ్ఞాన, వినోద కార్యక్రమాలతో శుక్రవారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని బిట్స్ పిలాని కాలేజీలో టెక్నికల్ ఫెస్ట్ (ఏటీఎంవోఎస్) ఘనంగా ప్రారంభమైంది. మీడియా పార్ట్నర్గా ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’ దినపత్రికలు వ్యవహరించాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నటుడు అడివి శేష్, మాజీ మిస్ ఇండియా, సినీనటి డాక్టర్ మీనాక్షిచౌదరి హాజరయ్యారు. అడివి శేష్ మాట్లాడుతూ.. చాలామంది విద్యార్థులు తరగతులు బంక్ కొట్టి సినిమాలు చూస్తుంటారని, తాను కూడా కళాశాలలో క్లాసులకు డుమ్మా కొట్టేవాడిని, అయితే సినిమాలు చూడటానికి కాకుండా సినిమా ఎలా తీయాలో నేర్చుకోవడానికి ఆ సమయం కేటాయించానని అన్నారు.
16 ఏండ్ల వయసు నుంచే సినీ ఇండస్ట్రీకి రావాలని కలలు కనేవాడినని చెప్పారు. మేజర్ సినిమాతో గొప్ప సక్సెస్ అనుభూతి చెందానని, సందీప్ ఉన్నికృష్ణన్ పాత్ర పోషించినందుకు అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. నేను ఒక డ్రాపౌట్ స్టూడెంట్ను. అయినా నా లక్ష్యం కోసం కష్టపడ్డాను. నేను చేసిన హార్డ్‌వర్కే నన్ను మీ ముందు ఇలా నిలబెట్టింది అని అన్నారు. మీనాక్షిచౌదరి మాట్లాడుతూ.. ‘నేను దంత వైద్యురాలిని. సినీ ప్రపంచంలోకి అడుగుపెడతానని అనుకోలేదు. మిస్ ఇండియా పోటీల్లో రాణిస్తానని అనుకోలేదు. కానీ ఈ రెండు నా జీవితంలో జరిగాయి. ఒకవేళ నేను హీరోయిన్ కాకపోయి ఉంటే.. ఇండియన్ ఆర్మీలో డెంటిస్ట్ వైద్యురాలిగా సేవలందించేదాన్ని’ అని చెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చారు. బిట్స్ పిలాని కాలేజీకి రావడం సంతోషంగా ఉన్నదని అన్నారు.
టెక్‌ఫెస్ట్
టెక్నికల్ ఫెస్ట్‌లో విద్యార్థులు పలు సాంకేతిక అంశాలపై రూపొందించిన ప్రాజెక్టులను ప్రదర్శించారు. ఇందులో రాకెట్‌సైన్స్, మషిన్ లర్నింగ్, డ్రోన్స్, రోబోవార్స్, అత్యాధునిక కార్ల ఉత్పత్తి పరిజ్ఞానం తదితర అంశాలకు సంబంధించిన ప్రాజెక్టులు ఉన్నాయి. శని, ఆదివారాల్లో సాంకేతిక అంశాలపై క్విజ్ పోటీలు నిర్వహిస్తారు. ప్రతిభ కనబర్చినవారికి వివిధ క్యాటగిరీల్లో మొత్తం రూ.10 లక్షల విలువచేసే వివిధ బహుమతులు అందజేస్తారు.
ప్రత్యేక ఆకర్షణగా రేసింగ్ కారు
ఈ ప్రదర్శనలో ఫార్ములా ఈ-కారు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రెండు రోజుల పాటు కారును ప్రదర్శించనున్నారు. ఈ కారు వద్ద విద్యార్థులు సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు. కారుకు సంబంధించిన సాంకేతిక అంశాలు, ఇందులో వాడే ఇంధనం, వేగం, ఇంజిన్, విడిభాగాలు, డ్రైవింగ్ విధానంపై విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు.