నాంపల్లి క్రిమినల్ కోర్టులు, అక్టోబర్ 7 (నమస్తే తెలంగాణ) : ప్రత్యేక కోర్టులో ఏసీబీ అధికారులకు చుక్కెదురైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు ఇతరులకు చెందిన పాస్‌పోర్టులను జప్తు చేయాలని కోరుతూ ఏసీబీ అధికారులు దాఖలు చేసిన మెమోను నాంపల్లి ఏసీబీ కోర్టు బుధవారం తిప్పిపంపింది. ఈ-ఫార్ములా కార్ రేస్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న కేటీఆర్ పాటు మిగతావారి పాస్‌పోర్టులను జప్తు చేసేందుకు అనుమతివ్వాలని ఏసీబీ అధికారులు మెమో దాఖలు చేశారు. పాస్‌పోర్టులను ఎందుకు జప్తు చేయాలో వివరణ ఇవ్వాలని? ప్రావిజన్ ప్రకారం పిటిషన్ దాఖలు చేయాలని ఆదేశిస్తూ జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతి వాయిదాకు కేటీఆర్‌తోపాటు ఇతర నిందితులు ఏసీబీ కోర్టుకు హాజరవుతున్నారని, దర్యాప్తులో సైతం సహకరిస్తున్నారని వారి తరఫు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేశారు. ఈ వాదనతో ఏకీభవించిన కోర్టు ఏసీబీ అధికారుల మెమోను వాపస్ చేసింది.
కావాలని తప్పుడు సమాచారాన్ని ప్రచురిస్తున్న మీడియా సంస్థలు సంయమనం పాటించాలని, కోర్టు జారీ చేసే ఉత్తర్వుల ఆధారంగా వార్తలను ప్రచురించాలని న్యాయవాది జక్కుల లక్ష్మణ్ కోరారు. వ్యక్తుల పరువు ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా కోర్టు ఆదేశాలను వక్రీకరించి ప్రచురించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ఉత్తర్వుల ప్రతుల ఆధారంగానే వార్తలను ప్రచురించాలని సూచించారు. తప్పుడు వార్తలను ప్రచురించే మీడియా సంస్థలపై చట్టపరంగా చర్యలు చేపట్టనున్నట్టు వివరించారు. కోర్టులను సైతం తప్పుదోవ పట్టించేవిధంగా వార్తలను ప్రచురించరాదని హెచ్చరించారు.