Financial Plan | ‘శుభ్రమైన బట్ట కట్టి ఎన్నేళ్లయ్యిందిరా? ఎన్నేళ్లయ్యిందిరా సంతృప్తిగా రెండుపూటలా భోజనం చేసి? ఇంకా నీకెందుకురా ఈ కంచి గరుడ సేవ?’ శంకరాభరణం సినిమాలో అల్లు రామలింగయ్య పాత్ర శంకరశాస్త్రిని నిలదీసే సన్నివేశంలోని మాటలివి! సినిమాలో అంటే.. సంగీతంపై మమకారంతో తప్పును ఒప్పుకోలేక శంకరశాస్త్రి అన్ని మాటలూ అనిపించుకున్నాడు. కానీ, నిజ జీవితంలో శేష జీవితాన్ని విశేషంగా గడిపే అవకాశాలు ఉన్నా… కడుపు మాడ్చుకుంటున్న పెద్దమనుషులు ఎందరో కనిపిస్తుంటారు. లక్షల రూపాయలు విలువ చేసే ఆస్తులున్నా.. చేతిలో చిల్లిగవ్వ లేకుండా బతుకీడుస్తుంటారు. రెక్కలు ముక్కలు చేసి కూడబెట్టింది అంతా వారసులకు ధారపోసి అనామకంగా మిగిలిపోతున్నారు! అలాంటి కష్టం మీకు రావొద్దంటే ఇలాంటి షరతులకు లోబడకండి…
‘భారతదేశంలో సీనియర్ సిటిజన్లు పేదరికంలో బతుకుతున్నారు… ధనవంతులుగా పోతున్నారు’ అని ఇటీవల ఓ కథనం ప్రచురితమైంది. పేదరికంలో ఉన్న మనిషి పోయాక శ్రీమంతుడు కావడమేంటి? అనే సందేహం రావొచ్చు. ఆస్తులు కూడగ
ట్టడం ప్రథమ కర్తవ్యంగా భావించే కొందరు.. వాటిని తమ సొంతానికి అనుభవించడాన్ని తీవ్ర నేరంగా పరిగణిస్తారు. ఆ ఆస్తులను కూడబెట్టే క్రమంలో ఆచరించిన కఠిన నియమాలనే ఆ తర్వాతా కొనసాగిస్తారు. సంపాదనంతా ప్రాపర్టీల రూపంలో ఉండటంతో… రోజువారీ ఖర్చులకు కావాల్సిన డబ్బు అందుబాటులో ఉండదు. దీంతో ఆస్తిపత్రాల్లో అష్టలక్ష్ములు కొలువుదీరినా.. కరెన్సీ దగ్గర వర్రీలు ఎదుర్కొంటారు. పైగా ఆ ఆస్తులతో ఎమోషనల్గా బాగా కనెక్ట్ అవుతారు. అత్యవసర పరిస్థితులు తలెత్తినా సెంటు భూమి అమ్మి సొమ్ము చేసుకోవడానికి సాహసించరు. తరతరాలకు తరగని ఆస్తులు సంపాదించిన వీరిని వారసులు సరిగ్గా గౌరవిస్తారా అంటే.. కొందరి విషయంలో అదీ అత్యాశే అవుతుంది. సినిమాల్లో చూపినట్టు.. ‘ఈ మనిషి పోతేగానీ, ఆస్తి మనకు దక్కదు’ అన్నట్టు వ్యవహరిస్తుంటారు!
నిజమైన ఆస్తి అంటే ఏంటో ముందుగా తెలుసుకోవాలి! కష్టాలపాలు కాకుండా చేసేదే అసలైన సంపద. నష్టకాలంలో ఆదుకునేదే సిసలైన ఆస్తి. ఈ రెండిటికీ పనికిరానప్పుడు ఎన్ని ఉండి ఏం లాభం. ఆస్తులను బట్టి జీవన విధానం ఉండదు. ఆదాయాన్ని బట్టి ఉంటుంది. ఆస్తి కొనుగోలు చేసినప్పుడు దాని నుంచి ఎంతో కొంత ఆదాయం వస్తుండాలి. సంపద సృష్టించని ప్రాపర్టీలు ఎన్ని ఉన్నా నిరర్థకమే! ఒక వ్యక్తి జీవితాంతం కూడబెట్టిన సొమ్ముతో ఊరి చివర ఓ వెయ్యి గజాల ప్లాట్ కొన్నాడు! తన తదనంతరం దాన్ని ఇద్దరి బిడ్డలకు, కొడుకుకూ సమాన వాటాలుగా ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. ఇంతవరకూ బాగానే ఉంది. ఆప్యాయతలకు అంతంతమాత్రమే విలువ ఇస్తున్న ఈ రోజుల్లో.. ఎప్పుడో వచ్చే ఆస్తి కోసం ఈ మనిషి బాగోగులు చూసే పరిస్థితులు లేవు. పైగా, ఎప్పుడో చేతికొచ్చే భూమిలో ముగ్గురికీ సమాన వాటాలు ఇవ్వాలన్న డిమాండ్లు మాత్రం రోజూ వినిపిస్తూ ఉంటాయి. ఇదే మనిషి ఆ డబ్బులో కొంత మొత్తం ఓ పొలం కొంటే పంట రూపంలో, ఇల్లు తీసుకుంటే అద్దె రూపంలో ఆయన జరిగిపోయే వరకూ నెలవారీ ఆదాయం సమకూరుతుంది. మిగిలిన సగం మొత్తాన్ని బ్యాంకులో ఎఫ్డీ చేస్తే.. వడ్డీ వస్తుంటుంది. ఎవరి దయాదాక్షిణ్యాల మీదో బతకాల్సిన అవసరం ఉండదు.
సినిమా హిట్టు కొట్టాలంటే… ఫస్టాఫ్ ఎలా ఉన్నా, సెకండాఫ్ పక్కాగా కుదరాలి. ైక్లెమాక్స్లోనూ కష్టాలే ఉంటే.. ప్రేక్షకులు పెదవి విరుస్తారు. జీవిత చరమాంకం కూడా సజావుగా సాగాలి. ఎవరి మీదా ఆధారపడకుండా ఉండాలంటే ప్రతి నెలా పక్కా ఆదాయం వచ్చేలా చూసుకోవాలి. జీవనశైలికి భంగం వాటిల్లకుండా చూసుకోవాలి. వృద్ధాప్యంలో భావోద్వేగాలు అదుపులో ఉంచుకోవాలి. రిటైర్మెంట్ డబ్బులు రాగానే, కొడుకులు-కోడళ్లు, కూతుళ్లు-అల్లుళ్లను పిలిచి వచ్చిందంతా ఇచ్చేసి.. బాధ్యత తీరిపోయిందనుకుంటే.. పొరపాటు. ఇన్నాళ్లూ పడ్డ కష్టానికి రిటైర్మెంట్ లైఫ్ ఒక రిలీఫ్ కావాలి. అలా అవ్వాలంటే.. మీ సొత్తు మీ చెప్పుచేతల్లో ఉండాలి. అది నిరర్థకమైన ఆస్తులుగా కాకుండా.. ఆదాయాన్ని సమకూర్చేవిగా, లిక్విడ్ అసెట్స్ రూపంలో ఉండేలా చూసుకోవాలి. కోటి రూపాయలు ఉన్నాయనుకోండి.. బ్యాంకులో ఎఫ్డీ చేస్తే నెలకు రూ.60 వేలు వస్తుంది. దాంతో దర్జాగా బతికేయొచ్చు. మీ తదనంతరం ఆ కోటీ నామినీలకే దక్కుతుంది కదా! ముందే ఆ కోటీ పంపకాలు చేసేస్తే.. మీ జీవిత కథ విషాదాంతం అవుతుందని గుర్తుంచుకోండి.
వృద్ధాప్యంలో భావోద్వేగాలు అదుపులో ఉంచుకోవాలి. రిటైర్మెంట్ డబ్బులు రాగానే, కొడుకులు-కోడళ్లు, కూతుళ్లు-అల్లుళ్లను పిలిచి వచ్చిందంతా ఇచ్చేసి.. నా బాధ్యత తీరిపోయింది అనుకుంటే.. పొరపాటు. ఇన్నాళ్లూ పడ్డ కష్టానికి రిటైర్మెంట్ లైఫ్ ఒక రిలీఫ్ కావాలి. అలా అవ్వాలంటే.. మీ సొత్తు మీ చెప్పుచేతల్లో ఉండాలి.