అక్కయ్యేమిటయ్యా… పుట్టింటనే తిష్ఠ వేసింది?
జరిగిన కథ: హనుమకొండలోని మాతామహుని ఇంట కంచర్ల గోపన్న జన్మించాడు. అక్కన్న-మాదన్నలు అతని మేనమామలు. చదువుల్లో మిన్న అయినవారు. ధైర్యవంతులు, యుద్ధవీరులుగా పేరు తెచ్చుకున్నవారు. రాజగోపాలపేటలో చోరుల బెడదను తప్పించి, రహదారి నిర్మాణ పనులను పర్యవేక్షించారు. తిరిగి వచ్చేదారిలో వారికి అబుల్ హసన్ కనిపించాడు. అతను వారికి కొలువులు ఇప్పిస్తానని మాటిచ్చాడు.
భక్త రామదాసు
అప్పుడే పుట్టి ఉంటే…
సా.శ. 1633, శ్రీముఖ నామ సంవత్సరం ఆశ్వయుజ మాసం ప్రవేశించింది. కామాంబను, తొమ్మిదినెలల బాలుడైన గోపన్నను వెంటబెట్టుకుని… అక్కన్న-మాదన్నలిద్దరూ నేలకొండపల్లికి వచ్చారు. వారు వచ్చే సమయానికి విరాటరాజు దిబ్బకు సమీపంలో ఏవో భూమి కొలతలు చూస్తున్న లింగన్న మంత్రి… ఆ కబురు విని, ఇంటికి పరుగు పరుగున వచ్చాడు.
వస్తూనే ఆరాటంగా కొడుకు కోసం వెతికాడు. పసివాడిని ఎత్తుకుని కొద్దిసేపు పుత్రోత్సాహాన్ని తనివితీరా అనుభవించాడు.
“ఏమయ్యా బావమరిదీ! కానుపయ్యాక మూడునెలలకి అత్తవారింటికి పంపడం ఎక్కడైనా రివాజు. కానీ మీ అక్కయ్యేమిటయ్యా… తొమ్మిదినెలలు పుట్టింటనే తిష్ఠ వేసింది? మీరు పంపలేదా… ఆమె రానన్నదా?” ఒక వంక కోపం తొణికిసలాడుతుండగా అక్కన్నను ప్రశ్నించాడు లింగన్న మంత్రి. బావ ఎదుట చేతులు దోయిలించి నిలబడ్డాడు అక్కన్న.
“బావగారూ! మమ్మల్ని మన్నించాలి. కానక కన్న కానుపు కనుక, అక్కయ్య బాగా నిస్సత్తువగా ఉంది. ఆమె వస్తానని చాలాసార్లు అడిగింది. కానీ అమ్మా నాన్నలే ధైర్యం చేయలేకపోయారు. మీకు పాపం చాలా అసౌకర్యం కలిగి ఉంటుంది. మరోసారి మన్నింపు కోరుతున్నాం” అన్నాడు.
“అయినా బావా! కొడుకును చూసుకోవడం కోసమైనా ఈ తొమ్మిదినెలల్లో నీవొక్కసారైనా హనుమకొండకు రాలేదేమి?” మాదన్న చొరవగా ప్రశ్నించాడు.
“ఆ… ఎక్కడి హనుమకొండ… ఎక్కడి నేలకొండపల్లి! చీటికీ మాటికీ రావాలంటే మాలాంటి ఉద్యోగస్తులకి సాధ్యమా?! అయినా తరచుగా అత్తవారింటికి వెళుతుంటే అల్లుడి మర్యాదలు తగ్గిపోతాయని నీకు మాత్రం తెలీదా ఏమిటి?! సరే… స్నానాలు కానివ్వండి. ఈలోపు వంటలు సిద్ధమవుతాయి” అని చెప్పాడు లింగన్న మంత్రి.
ఆనాటి రాత్రి భోజనాలు చేస్తుండగా మాదన్న బావగారితో తమ ప్రయాణ విశేషాలు పూసగుచ్చినట్లు చెప్పాడు. తామిద్దరూ తమ తండ్రిగారి అనుమతి పొందామని… ఇటునుంచి ఇటే ఉద్యోగార్థమై గోల్కొండకు వెళుతున్నామని…. మరునాడే ప్రయాణం అని కూడా తెలియచేశాడు.
“అప్పుడే వెళ్లిపోతారా? రెండురోజులుండి పోండి” అన్నాడు లింగన్న మంత్రి.
“ఆడపిల్ల ఇంట ఎక్కువరోజులు ఉండకూడదు. మమ్మల్ని వెళ్లనివ్వండి” అని సర్దిచెప్పాడు అక్కన్న.
మరునాడు అక్కన్న-మాదన్నలు ప్రయాణమై వెళుతుండగా కంటనీరు పైటచెంగుతో ఒత్తుకుంది కామాంబ. మరోసారి మేనల్లుడిని ఎత్తుకుని, ముద్దిచ్చి అక్కగారికి ధైర్యం చెప్పి బయలుదేరాడు మాదన్న.
నేలకొండపల్లి నుంచి హైదరాబాదుకు సుమారు అయిదురోజుల ప్రయాణంతో అన్నదమ్ములిద్దరూ చేరుకున్నారు. రాత్రిపూట నగరంలోకి ప్రవేశం లభించలేదు. తెల్లవార్లూ వెలుపలే గడిపారు.
హైదరాబాదుకు వస్తే ఉద్యోగం ఇప్పిస్తానని మాటిచ్చిన అయినుల్ ముల్క్ భవంతి ఎక్కడుందో ఆరా తీశారు. కానీ, ఆ సమయానికి అతను నగరులో లేడని తెలియవచ్చింది. వేరొక దారి ఏదైనా దొరకకపోతుందా? అని చార్మినార్ సమీపంలో తచ్చాడసాగారు. అదే సమయంలో అక్కడొక దండోరా వినవచ్చింది. చౌబుదారులు డప్పు వాయిస్తున్నారు. వారి వెనుకనే కొంతమంది రాజభటులు, ఒక ఉద్యోగస్తుడు ఉన్నారు. ఆ ఉద్యోగి చేతిలో ఒక తెల్లకాగితం ఉంది. డప్పుమోతల మధ్య ఆ ఉద్యోగి ఇలా ప్రకటించాడు.
“అందరూ వినండహో… హిందువులు కానీ మహమ్మదీయులు కానీ… ఎవరైనా సరే, ప్రయత్నించవచ్చు. ఇదిగో ఈ కాగితంలో ఉన్న విషయాలేమిటో చదివి… ఇందులోని విషయాన్ని విశదీకరించి చెప్పేవారికి సుల్తాన్ వారు గొప్ప ఉద్యోగమిచ్చి, చాలా గౌరవం చేయగలరు. ఎవరైనా చదవగలిగినవారు వచ్చి చదవవచ్చునొహో..”
… అక్కడ కొందరు ప్రజలు గుమికూడారు. తెల్లని, అక్షరాలు కనిపించని ఆ కాగితాన్ని చూసి కొందరు నవ్వుకోసాగారు. మరికొందరు ‘మూడునెలల నుంచి చూస్తున్నాం… ఈ కాయితం పట్టుకుని రోజూ ఇదే వరస. దీనికి అంతం లేదా?’ అని విసుక్కుంటున్నారు.
చుట్టూ ఉన్న ప్రజలను దాటుకుని, అక్కన్న-మాదన్నలు ముందుకొచ్చారు.
“మేమీ కాగితాన్ని చదవగలం” అన్నాడు మాదన్న.
ఆ మాటతో ఉద్యోగస్తుడి కళ్లు మెరిశాయి.
“అయితే పదండి… మీర్ జుమ్లాగారి దగ్గరకు వెళదాం” అంటూ దారి తీశాడు.
మీర్ జుమ్లా అంటే గోల్కొండ ప్రధానమంత్రి. అసలుపేరు మీర్జా మహమ్మద్ సయ్యద్. అతను తన కార్యాలయంలో కొలువుదీరి ఉండగా అక్కన్న-మాదన్నలను అక్కడికి ప్రవేశపెట్టారు. తనకు సలాములు చేసి నిలబడిన ఆ తెలుగు పంతుళ్లవైపు మీర్ జుమ్లా ఒకసారి దృష్టి సారించి చూశాడు.
ఇద్దరూ ఆజానుబాహులే. ధోవతులు, పొడుగు చొక్కాలు ధరించి ఉన్నారు. పైన సన్నని అంగవస్ర్తాలు కప్పుకొన్నారు. నెత్తిమీద టోపీలున్నాయి. ముఖాలపై వారు వైష్ణవులని తెలిపే పట్టెవర్ధనాలున్నాయి. వర్చస్సుతోనూ తేజస్సుతోనూ బలిష్టమైన దేహాలతోనూ ఒప్పుతున్న ఆ యువకులను చూసి మీర్ జుమ్లా సంతోషించాడు. అయినప్పటికీ ఉండబట్టలేక…
“ఇది ఢిల్లీ నుంచి వచ్చిన రహస్యలేఖ. బహుశా పారశీకంలో ఉండి ఉండవచ్చు. మీకు ఆ భాష వచ్చా?!” అని ప్రశ్నించాడు.
“హుజూర్! మాకు సంస్కృతం, తెలుగు, అరబ్బీ, పారశీ భాషలు సంపూర్ణంగా తెలుసు” అని వినయంగా సమాధానమిచ్చాడు మాదన్న.
“బహుత్ ఖూబ్. కానీ, ఇది మా ఢిల్లీ గూఢచారి పంపిన రహస్యలేఖ. దీనిని చదివి సారాంశమేమిటో తెలియచేయండి” అన్నాడు మీర్ జుమ్లా.
“ఒక ఉల్లిపాయ తెప్పించండి హుజూర్” అన్నాడు మాదన్న.
మీర్ జుమ్లా వారివంక అయోమయంగా చూశాడు. కొద్దిసేపటిలో ఉల్లిపాయ వచ్చింది. అక్కన్న తన బొడ్డులోని చాకు తీశాడు. ఉల్లిపాయ తరిగి… ఆ లేఖపై రసాన్ని పూశాడు. అంతే… తెల్లకాగితంపై నల్లని అక్షరాలు ప్రత్యక్షమయ్యాయి.
“హుజూర్! ఈ లేఖ సారాంశం సావధానంగా వినండి. ఢిల్లీ పాదుషా షాజహాన్ ఆఖరు కుమారుడు ఔరంగజేబు. అతను తనకు దక్కను మీద అధికారం కట్టబెట్టమని తండ్రిని ఒత్తిడి చేస్తున్నాడట. బహుశా కొద్దిరోజులలోనే ఆ మేరకు ప్రకటన రావచ్చట. ఆ ఔరంగజేబు మహాక్రూరుడు. పరమత సహనం బొత్తిగా లేనివాడు. షియా తెగవారిపై అతనికి కన్నుకుట్టు. ఈ దేశాన్ని సున్నీలే పాలించాలనుకుంటాడు. అతని వల్ల రాజ్యానికి రాబోయే రోజుల్లో తిప్పలు తప్పవు కనుక, తగిన ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలి”
… మాదన్న చదివి వినిపించగానే, మీర్ జుమ్లా చాలా సంతోషించాడు.
“మూడు నెలలకాలం నుంచి ఈ లేఖలో ఏముందో చదివించలేక చాలా కష్టపడ్డాం. నీవల్ల గోల్కొండకు ఒక మేలిమి వజ్రం దొరికినట్లయింది. నిన్ను ఇప్పుడే నాకు పేష్కారుగా నియమిస్తున్నాను. మీ అన్నను నీకు సహాయకునిగా నియమించుకో. ఇప్పుడే నేనీ వార్తను మా సాహెబాకు, సుల్తాన్‌కు నివేదించాల్సి ఉంది” అంటూ మీర్ జుమ్లా ఆసనం నుంచి పైకి లేచాడు.
* * *
కాలగతిలో అయిదేళ్లకాలం గడిచిపోయింది.
లేకలేక కలిగిన పిల్లవాడు కావడంతో గోపన్నను కామాంబ, లింగన్న మంత్రి దంపతులు గారాబంగా పెంచుకుంటూ వస్తున్నారు. తండ్రి నుంచి హరిభక్తి, తల్లినుంచి రామభక్తి గోపన్నకు వారసత్వంగా సంక్రమించాయి. చిన్నవయస్సులోనే సంక్షేప రామాయణంలోని వందశ్లోకాలు గోపన్న కంఠతా పట్టాడు.
అయిదో ఏడు ప్రవేశించగానే గోపన్నకు అక్షరాభ్యాసం జరిగింది. చదువులోనూ… తోటిపిల్లలతో ఆటపాటల్లోనూ గోపన్న బాల్యం ఆహ్లాదకరంగా సాగిపోతోంది.
నేలకొండపల్లిని ఆ గ్రామవాసులు విరాటరాజు రాజధానిగా చెబుతుంటారు. పాండవుల అజ్ఞాతవాసం అంతా తమ ఊరిలోనే జరిగిందంటారు. అందుకు రుజువుగా పాండవుల దిబ్బ, భీమ ప్రతిష్ఠిత లింగాలను చూపిస్తుంటారు. ఇంకా నేలకొండపల్లిలో వేణుగోపాలస్వామి ఆలయం, వైద్యనాథేశ్వర ఆలయం, వేంకటేశ్వర స్వామి ఆలయం ఉన్నాయి. ఇవన్నీ గోపన్నకు ఆటపట్లే. సాయంత్ర వేళల్లో తోటి బాలురతో కూడి ఈ ఆలయాల సమీపాల్లో ఆటపాటల్లో మునిగితేలేవాడు.
ఆ రోజుల్లో నేలకొండపల్లికి ఎందరో కళాకారులు, విద్వాంసులు వస్తుండేవారు. సంకీర్తనా గానాలు, పురాణ ప్రవచనాలు… నిత్యం ఏదో ఒక కోలాహలం జరుగుతుండేది. తల్లితోపాటు ఆ కార్యక్రమాలకు వెళ్లివస్తుండేవాడు.
ఒకనాడు వేంకటేశ్వరస్వామి ఆలయంలో అన్నమాచార్య సంకీర్తనా యజ్ఞం జరుగుతోంది.
‘రామచంద్రుడితడు… రఘువీరుడు’ అంటూ గాయకుడు మైమరిచిపోయి పాడుతున్నాడు. వింటున్న భక్తజనం పరవశించిపోతోంది. శిశుర్వేత్తి పశుర్వేత్తి అన్నట్లుగా బాలుడైన గోపన్నలో కూడా ఆ గానమాధుర్యానికి పారవశ్యం మేర దాటిపోతోంది. సంకీర్తన చివరికి వచ్చింది. ఆఖరు పాదంలో ‘కలడన్నవారి పాలి కన్నులెదుటి మూరితి’ అనే మాటలను గాయకుడు పదేపదే తిరుగా పాడుతున్నాడు. గోపన్న ఆ వాక్యాలనే మననం చేసుకుంటూ తల్లితోపాటు ఇల్లు చేరుకున్నాడు.
“అమ్మా! అన్నమాచార్యుల వారు కలడని నమ్మితే రాముడు కనిపిస్తాడని చెప్పారు కదా! నిజంగా కనిపిస్తాడా?” అని ప్రశ్నించాడు మంచంమీద అమ్మ పక్కన చేరి.
“అంతటి మహాభక్తుడు చెప్పాడంటే నిజంగా కనిపిస్తాడు గోపన్నా! ఇంతకూ కనిపిస్తే నువ్వేం చేస్తావ్?” అడిగింది తల్లి.
“నేనిక్కడ వద్దు… నీ రోజుల్లోకి, ఆ రామాయణం జరిగిన రోజుల్లోకి తీసుకుపోమని అడుగుతాను”
“బాగుంది. రాముడితో పాటు నువ్వూ పుట్టి ఉంటే ఏం చేస్తావోయి?!”
“రాముడు పిల్లాడిగా ఉన్నప్పుడు ఆయనతో ఆడుకుంటాను”
“మరి సీతారామకల్యాణంలో నువ్వేం చేస్తావు?”
“సీతారాములకు తలంబ్రాలు అందిస్తాను”
“బాగుంది. ఆ రాముడే సీతా-లక్ష్మణులతో కలిసి అడవికి పోతే నువ్వేం చేస్తావు?”
“నేను కూడా ఆయన వెంట వెళతాను. గుహుని చూస్తాను. ఖరదూషణులతో నేను కూడా యుద్ధం చేస్తాను. బంగారు లేడిని తెమ్మని అమ్మ కోరితే రాముని వద్దని నేను వెళతాను. రావణుడు సీతమ్మను చెరపట్టే వేళ నేనుంటే అమ్మకు అభయమిస్తాను. సీతజాడ తెలియక రాముడు కుమిలిపోతుంటే… ‘ఓయి సర్వజ్ఞమూర్తీ! చాలు నీ విరహం’ అంటాను. సముద్రాన్ని చౌకళించి వేగంగా దూకుతాను. లంక గాలించి సీతమ్మను సేవిస్తాను. అంగుళీయకమిచ్చి.. ‘అమ్మా! హరి ఇచ్చినాడు’ అంటాను. ఆ వృత్తాంతము ఈయనకు విన్నవిస్తాను. రణంలో సేనలను కూడి చెండాడుతాను. అమ్మకు మారుగా నేను అగ్గిలో దూకుతాను. పుష్పకమెక్కి సీతారాములతో కలిసి అయోధ్యకు వెళతాను”…
గోపన్న అమ్మతో కబుర్లు చెబుతూ చెబుతూనే నిద్రలోకి జారుకున్నాడు. నిద్రలో అతనికేదో కల వచ్చినట్లుంది. కొంతసేపటికి ఆ కలలోనే ఇలా కలవరించసాగాడు.
ఆశపుట్టె శ్రీరాములతో ఆహా నే పుట్టనైతి
రఘరాములతో నే పుట్టనైతిని
శ్రీరాములతో బుట్టి సేవలు సేయగనైతిని
…కామాంబ ఆ కలవరింతలు విని కలవర పడి, కొడుకును లేపి మంచినీళ్లు తాగించింది. పక్కకు తిప్పి పడుకోబెట్టింది.
కంచర్ల లింగన్న మంత్రి ప్రథమశాఖ నియోగి బ్రాహ్మణుడు. వారిది ముందుతరాల నుంచి స్మార్త సంప్రదాయమే అయినా… లింగన్న మంత్రి విశిష్టాద్వైత సిద్ధాంతం పట్ల ఆకర్షితుడయ్యాడు. రామానుజ మతం స్వీకరించి తిరునామం పెట్టుకున్నాడు. తన కుమారుడికి ఆ సంప్రదాయాన్ని అందించాలని ఉవ్విళ్లూరాడు.
గోపన్నకు గర్భాష్టమంలో అనగా ఏడేళ్ల వయస్సులో ఉపనయనం జరిగింది. నవ వటువును వేదపండితులు, బంధుజనాలు ఆశీర్వదించారు. వచ్చినవారికి ఘనంగా సత్కారాలు చేసి సాగనంపాడు లింగన్న.
ఆ తర్వాత మంచిముహూర్తం చూసుకుని రఘునాథ భట్టరాచార్యులను సంప్రదించాడు. గోపన్నకు పంచసంస్కారాలు జరిపించడానికి నిశ్చయమైంది.
తాప (అగ్ని సంస్కారం) శంఖచక్ర లాంఛనం వేడి చేసిన శంఖ చక్ర లాంఛనాలను భుజాలపై ముద్రించడం ద్వారా పంచసంస్కారాలలో మొదటిదైన అగ్నిసంస్కారం జరిగింది. దేహంలోని పన్నెండు స్థలాలలో ఊర్ధ్వపుండ్రాలను ధరింప చేశారు. వైష్ణవ దీక్ష స్వీకరించేవారు దాస్యనామాన్ని ఆచార్యుని నుంచి పొందడం మూడో సంస్కారం. అందుకోసం రఘునాథ భట్టరు వారు గోపన్నకు నారాయణదాసు అనే నూతన నామాన్ని అనుగ్రహించారు. తిరుమంత్రమైన అష్టాక్షరీ మంత్రాన్ని బోధించారు. యాగ దేవపూజా విధానాలను వివరించి పంచసంస్కారాలను పూర్తి చేశారు.
ఆనాటి నుంచి గోపన్న కాస్తా నారాయణదాసు అయ్యాడు. గురువు బోధించిన అష్టాక్షరీ మంత్రాన్ని ఏడాదికాలంలో అక్షరలక్షలు పూర్తి చేశాడు.
కాలమెన్నడూ ఒక్కరీతిగా నడవదు కదా… ఇంతలో లింగన్న మంత్రి కాలం చేశాడు.
(వచ్చేవారం… తక్కువేమి మనకు)
– నేతి సూర్యనారాయణ శర్మ, 99517 48340
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

