ఇంట్లోకి ఆఫీస్ చొరబడితే?
ఉదయం ఇంటి నుంచి ఆఫీస్‌కి బయలుదేరేటప్పుడు మనతో పాటు ఒక బ్యాగ్ ఉంటుంది. అందులో ల్యాప్‌టాప్, ఫైళ్లు, క్యారేజ్ మాత్రమే ఉంటాయి. కానీ, సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు మనం మోసుకొచ్చేది ఇవి మాత్రమే కాదు! బాస్ పెట్టిన చీవాట్లు, పూర్తికాని పనులు, టార్గెట్ల ఒత్తిడి.. ఇవన్నీ కూడా మనతో పాటు ఇంటి గడప దాటి వచ్చేస్తాయి.
కవర్ స్టోరీ
ఓ సాధారణ ఉద్యోగి.. జీవితంలో అంతులేనంత ఎత్తుకి ఎదగాలని కలలు కన్నాడు. తనకు దక్కిన ఓ చిన్న ఉద్యోగంలోనే తనని తాను నిరూపించుకునే ప్రయత్నం చేశాడు. ఆఫీసర్ ఏం చెప్పినా… దాన్ని పూర్తి చేసే ఇంటికి వచ్చేవాడు. కాస్త ఆలస్యం అయినా, పిల్లలతో గడపడానికి ఓ గంట దొరికేది. ఇక ఆదివారాలైతే, కుటుంబమే తన లోకం. ఇంతలో తనకు ప్రమోషన్ వచ్చింది. పడ్డ కష్టానికి తగ్గ ఫలితం దక్కిందని మురిసిపోయాడు. మరింతగా పని చేశాడు. ఉద్యోగంలో మరో మెట్టు ఎదగాలనుకున్నాడు. ఫలితం! ఎప్పుడో రాత్రుళ్లు ఇంటికి వచ్చేవాడు, పిల్లలు బడికి వెళ్లాకే లేచేవాడు. ఆదివారాలు కూడా ఆఫీసుకే అంకితం. మరుసటి ఏడాది తను ఊహించినట్టుగానే ఉద్యోగపర్వంలో మరో మెట్టు ఎక్కాడు. భార్యతో మాట్లాడటానికి కూడా తీరిక ఉండేది కాదు. అదేమంటే.. ‘మీకోసమే కదా ఇదంతా చేస్తున్నది’ అని నోరు మూయించేవాడు. మరో మెట్టు ఎక్కాక మీకు కావల్సినంత సమయం ఇస్తానని మాటిచ్చేవాడు. తను అనుకున్నట్టుగానే ఓ ఐదేండ్లకు కంపెనీ సీఈఓ అయ్యాడు. కానీ, అప్పటిదాకా తనలో పేరుకున్న ఒత్తిడితో గుండె ఆగిపోయింది. మర్నాడు పరామర్శకు వచ్చినవాళ్లంతా ‘చిన్న వయసులోనే ఎంత సాధించాడో’ అని తెగ పొగిడారు. కానీ, తనేం కోల్పోయాడు, వాళ్ల నుంచి ఏం దూరం చేశాడో భార్యాపిల్లలకే తెలుసు. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లాంటి పదాలు వాడకున్నా.. కుటుంబానికి తగినంత సమయం ఇవ్వకపోవడం గురించి హెచ్చరించే కథ ఇది.
ఉదయం ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు మనతో పాటు ఒక బ్యాగ్ ఉంటుంది. అందులో ల్యాప్‌టాప్, ఫైళ్లు, ఫోన్, క్యారేజ్ మాత్రమే ఉంటాయి. మహా అయితే ఆరోజు చేయాల్సిన పనులను గుర్తుంచుకుంటూ, లక్ష్యాలను తలుచుకుంటూ అడుగులు వేస్తాం. కానీ, సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు మనం మోసుకొచ్చేది ఇవి మాత్రమే కాదు! బాస్ పెట్టిన చీవాట్లు, సహోద్యోగులతో గొడవలు, పూర్తికాని పనులు, టార్గెట్ల ఒత్తిడి, ప్రమోషన్ గురించి ఆందోళన.. ఇవన్నీ కూడా మనతో పాటు ఇంటి గడప దాటి వచ్చేస్తాయి. ఇంట్లోకి అడుగుపెట్టిన శరీరం సోఫాలో కూలబడుతుంటే.. మనసు మాత్రం ఇంకా ఆఫీసులోనే ఉంటుంది. ఇక దాని ప్రభావం ఎక్కడికి పోతుంది? ‘ఎలా బయటపడదామా?’ అని ఎదురుచూస్తుంది.

Office Mood
ఆఫీసులో ఎదురైన కోపాన్ని జీవిత భాగస్వామిపై చూపించడం, పిల్లలు మాట్లాడుతుంటే చిరాకుపడటం, చిన్న విషయాలకే పెద్ద గొడవలు పెట్టుకోవడం, ఇంట్లో ఉన్నవారితో మాట్లాడకుండా ఫోన్లోనే మునిగిపోవడం.. ఇవన్నీ మొదట చిన్న విషయాల్లాగానే కనిపిస్తాయి. కానీ, రోజులు గడిచేకొద్దీ అవే సంబంధాల మధ్య దూరాన్ని పెంచుతాయి. ఒక ఉద్యోగ సమస్యకు పరిష్కారం దొరకకపోతే, దాని శిక్ష కుటుంబం ఎందుకు అనుభవించాలి? అన్నదే ప్రశ్న. దానికి జవాబు ఎక్కడెక్కడో వెతికి ఉపయోగం లేదు.
కారణం ఏంటి?
మనసేమీ మోటర్ కాదు. స్విచ్ వేయగానే స్టార్ట్ కావడానికి, ఆఫ్ కావడానికి. ఎంత స్థిరంగా కూర్చున్నా.. మెదడు మాత్రం పరుగులు తీస్తూనే ఉంటుంది. ఆ ఆలోచనలు ఉద్వేగాలను రగిలిస్తాయి. ఆఫీసులో జరిగిన ఏదన్నా సంఘటన మనసులో బలంగా ముద్రపడితే, ఇంటికి వచ్చిన తర్వాత కూడా దాని గురించి మథనం జరుగుతూనే ఉంటుంది. బాస్ నాతో అలా మాట్లాడి ఉండకూడదు! నేను చేసిన పనికి క్రెడిట్ ఎలా ఇస్తారు? రేపు ఆ టార్గెట్ పూర్తి చేసి తీరాలి? అసలు వచ్చే ఏడాది ఈ ఉద్యోగం ఉంటుందా? లాంటి ఆలోచనలతో మన చుట్టూ ఇంట్లో మనుషులు తిరుగుతున్నా… మనం మాత్రం ఆలోచనల చుట్టూనే తిరుగుతాం.
మొదలయ్యే పొరపాట్లు!
అత్త మీద కోపం: ఆఫీసులో మొదలైన కోపం ఎండుగడ్డిలో దాచిన నిప్పు కణికలా రగులుతూ ఉంటుంది. ఆఫీసర్ తిడితే, తిరిగి తనని నేరుగా అనలేని అశక్తత. లైఫ్ పార్ట్నర్, పిల్లలైతే ఎదురు తిరగరు కదా! దాంతో ఏదో ఓ చిన్న తప్పు పట్టుకుని వాళ్లను దులిపేస్తారు. కూరలో కారం తగ్గిందని భార్యను, ఆలస్యంగా ఎందుకొచ్చావని భర్తను, లెక్కల్లో మార్కులు తగ్గాయని పిల్లలను.. ఇలా కోపాన్ని ప్రదర్శించడానికి చాలా అవకాశాలే దొరుకుతాయి. ‘ఆఫీసులో జరిగిన దానికి ఇంట్లో వాళ్లు బాధ్యులు కారు’ అన్న నిజాన్ని గుర్తుంచుకోవడమే ఇందుకు పరిష్కారం. ‘ఇంట్లో జరిగిన తప్పు నిజంగా అంత తీవ్రమైందా లేకపోతే నేను ఎక్కువగా స్పందిస్తున్నానా?’ అని బేరీజు వేసుకోవడమూ ఓ మార్గమే.

Office
అర్థం చేసుకోరని: ‘అసలు ఉద్యోగం చేయడం ఎంత కష్టమో తెలుసా!’.. ‘రోజూ 30 కిలోమీటర్లు వెళ్లిరావడం మాటలు అనుకుంటున్నారా!’ లాంటి మాటలు తరచూ వినిపిస్తూనే ఉంటాయి. బయటవాళ్లకి ఎలాగూ తన విలువ తెలియదు, కనీసం ఇంట్లో వాళ్లయినా కష్టాన్ని గుర్తించడం లేదనే బాధను వ్యక్తపరుస్తాయి. ఇంకా మాట్లాడితే.. ‘నేను పోతే కానీ మీకు బుద్ధిరాదు’ తరహా శాపనార్థాలూ వినిపిస్తారు. నిజానికి ఈ మాటలేవీ సమస్యను పరిష్కరించవు సరికదా ఎదుటివారిని మరింత దూరం చేస్తాయి. కదిపితే కంప లాగుతున్నారని దూరానే ఉండిపోతారు. దానికి బదులు ‘ఈరోజు ఆఫీసులో ఒత్తిడి ఎక్కువైంది. కాసేపు నా పక్కన కూర్చో!’ అనే ఓ చిన్నమాట సంభాషణల తీరునే మార్చేస్తుంది. ఇంట్లోవాళ్లతో కష్టాలు పంచుకుంటే లోకువ అవుతామన్నది అహమే. మనసులో ఉన్నది చెప్పకుండా, ఎదుటివారు అర్థం చేసుకోవాలనో, లోకువ కాకూడదనో ఆశించడం అపార్థమే!
ఇద్దరూ ఉద్యోగస్తులైతే!
ఇక్కడ సమస్య ఇంకాస్త సంక్లిష్టం అవుతుంది. ఇద్దరూ ఉద్యోగస్తులే. ఇద్దరికీ టార్గెట్లు, డెడ్లైన్లు ఉంటాయి. ఇద్దరికీ ఆఫీసులో సమస్యలు ఉంటాయి. పైగా మహిళలకు ఉండే ప్రత్యేకమైన సమస్యల గురించి చెప్పేదేముంది. ఎంత ఎదిగినా చులకనగా చూసేవాళ్లు, తన క్రెడిట్ లాగేసుకోవాలని తపించేవాళ్లు, కొన్ని సందర్భాల్లో శారీరకంగా ఇబ్బంది పెట్టేవాళ్లు తనకు ఎదురుపడవచ్చు. అదృష్టవశాత్తు కేవలం పనిపరమైన భారమే ఉన్నా… భార్యాభర్తలు ఇద్దరిలో ఎవరి సమస్య పెద్దదనే పోటీ మొదలవుతుంది.
నీకేమంత పని ఉంటుంది? నేను రోజంతా ఎంత కష్టపడుతున్నానో తెలుసా? నాకూ ఆఫీసు ఉంది! నువ్వు నీ పని చేస్తే చాలు.. నేను అందరి పనీ చూసుకోవాలి! తరహా సంభాషణలకి కొదువ ఉండదు. ఒకరు ఆఫీసుతో పాటు వంటలో ఎక్కువ పాటుపడాల్సి వస్తే మరొకరు ఆఫీసుతో పాటు ఇంటినీ సంభాలిస్తుంటారు. ఆ విషయం గ్రహించినప్పుడు ‘ఎవరి కష్టం ఎక్కువ?’ అన్న ప్రశ్నకు బదులుగా ‘ఇద్దరం కలిసి ఈ కష్టాన్ని ఎలా ఎదుర్కోవాలి?’ అన్న సహకారం మొదలవుతుంది.

Children Disturb
చిన్న పనే అనుకుంటే..
సీఈఓలకి, యజమానులకి ఆఫీసు పనే జీవితంగా తోచవచ్చు. వాళ్ల సొంత కలలు, ఎదుగుదల, ఆర్థిక లాభాలు వాటి వెనుక ఉంటాయి. అందుకే యాజమాన్యం వైపు నుంచి కొంచెం కొంచెంగా ఇంట్లోకి ప్రవేశించే ప్రయత్నం జరుగుతుంది. ఒక చిన్న కాల్ అటెండ్ అవ్వు! రేపు అర్జెంట్ మీటింగ్ ఉంది. దానికి అప్డేట్ ఇవ్వు! మెయిల్ పంపలేదా. సరే, ఇప్పుడు పంపు! క్లయింట్‌తో ఓసారి మాట్లాడి చూడు.. లాంటి అభ్యర్థనలు కంపెనీ నుంచి వచ్చినా, తనకే తోచినా అవి క్షణంలో ముగిసిపోవు. వాటి ఫలితమూ అంత ఆశాజనకంగా ఉండదు. లేటైన సినిమా, వాయిదా పడిన ప్రయాణం, భోజనం దగ్గర ఎదురుచూపులు, ఆగిపోయిన టీవీలే మిగులుతాయి. ఇంటికి వచ్చినా తమతో ఉండటం లేదు అనే ఆలోచన మొదలవుతుంది. ఆ భావన అసంతృప్తిగా, ఆ తర్వాత ఫిర్యాదుగా, చివరికి గొడవగా మారవచ్చు.
ఇల్లు.. డస్ట్ బిన్ కాదు!
మనసుకు దగ్గరైనవాళ్ల వద్దే మన చిరాకులను, సమస్యలను బయటపెడతాం. అది సహజమే. అవసరం కూడా! ఆఫీసులో ఒత్తిడి ఎక్కువైనప్పుడు కుటుంబంతోనో, స్నేహితులతోనో పంచుకుని, సేదతీరమనే మనం చెప్పుకొన్నాం. కానీ దానికి కూడా ఓ పరిమితి ఉన్న విషయాన్ని మర్చిపోతే, అది కూడా ఓ సమస్యగా మారుతుంది. ఇవాళ మా బాస్ ఏం చేశాడో తెలుసా! నా టీమ్ అసలు పని చేయదు.. మా క్లయింట్ పెద్ద శాడిస్ట్ అంటూ ప్రతిరోజూ అదే విషయాలు పదేపదే చెబుతూ ఉంటే, ఇంటి వాతావరణం కూడా ఆఫీసులా మారిపోతుంది. ‘బాధను పంచుకోవడం వేరు.. బాధను ఇంటి మీద కుమ్మరించడం వేరు’. ఇంకొందరు నేరుగా చెప్పకపోయినా, ఇంట్లో జరిగే ప్రతి సంభాషణనీ తీసుకువెళ్లి ఆఫీస్‌తో ముడిపెడుతూ ఉంటారు. అప్పుడు మనం కుటుంబంతో గడిపే సమయం కూడా ‘ఆఫీస్‌కు పొడిగింపు’గా మారుతుంది.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి
‘మీరు ఇంటిని, ఆఫీసుని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు’ అని ఓ రిటైర్ అవుతున్న పెద్దాయనను అడిగారు యువ ఉద్యోగులు. దానికాయన ‘నా ఇంటి ముందు వాకిట్లో ఓ చెట్టు ఉంటుంది. ఇంటికి వెళ్లగానే, ఆ చెట్టు దగ్గరే నా చెప్పులు విడుస్తాను’ అని చెప్పాడు. దానికీ మా ప్రశ్నకీ ఏంటి సంబంధం అంటే… ‘ఆ చెప్పులతో పాటుగా ఈ ఆఫీసుని కూడా వదిలేయాలి’ అనేందుకు గుర్తుగా అలా చేస్తానని చెప్పాడట. అదేమంత తేలిక కాకపోవచ్చు. కానీ, కొన్ని జాగ్రత్తలతో అసాధ్యం కూడా కాదు.
ట్రాన్సిషన్ టైం: ఇంటికి వచ్చే మార్గాన్ని ‘ట్రాన్సిషన్ టైమ్’గా మార్చుకోమని సూచిస్తున్నారు నిపుణులు. దీనికోసం ఆఫీసు నుంచి ఇంటికి వచ్చే ప్రయాణ సమయాన్ని వాడుకోవచ్చు. డ్రైవ్ చేస్తున్నా, మెట్రోలో వెళ్తున్నా, బస్సులో ఉన్నా… ఆ రోజు జరిగిన విషయాలను ఒకసారి మనసులో క్రమబద్ధీకరించుకోవాలి. ఏం జరిగింది? అందులో నా పాత్ర ఏంటి? ఏది నా నియంత్రణలో లేదు? రేపు ఏం చేయాలి? అంతే!!! మిగిలినదాన్ని ఆ రోజు కోసం అక్కడితో ఆపేయాలి. ఈరోజు పని ఇక్కడితో పూర్తయింది. మిగతాది రేపు చూసుకుందామని మనకు మనం చెప్పుకోవడమే ఒక ఊరట. మరునాటి వరకూ ఆఫీసుకి విరామం.
నో-ఆఫీస్ జోన్: ప్రశాంతంగా, సురక్షితంగా ఉండాల్సిన ప్రదేశాలను ప్రభుత్వం నో ఫ్లై జోన్‌గా పేర్కొంటుంది. ఇల్లు కూడా అలాంటి స్థలమే కదా! అందుకే ఇక్కడ నో-ఆఫీస్ జోన్ అత్యవసరం. రోజులో తగినంత సమయాన్ని పూర్తిగా కుటుంబానికి కేటాయించాలి. మరీ ముఖ్యంగా ఆఫీసు వేళల తర్వాత. ఆ సమయంలో ల్యాప్‌టాప్ మూసేయాలి. అవసరం లేని నోటిఫికేషన్లు ఆపాలి. ఫోన్ పక్కన పెట్టాలి. పిల్లలతో మాట్లాడాలి. జీవిత భాగస్వామిని ఆ రోజు ఏం జరిగిందో అడగాలి. కలిసి భోజనం చేయాలి. అన్నిటికంటే ముఖ్యం.. పని గురించి మాట్లాడకుండా ఉండే ప్రయత్నం చేయాలి. అది ఎంత సేపైనా కానీయండి. ఆ సమయంలో మనం నిజంగా అక్కడ ఉన్నామా అన్నదే ముఖ్యం.

Play With Children
అనుమానాస్పద బంధాలు, రహస్యాలకు దూరం!
ఆఫీస్ అన్నాక రకరకాల మనుషులు పరిచయం అవుతుంటారు. కొందరు మరీ దగ్గరవుతారు. కానీ ఆడైనా, మగైనా.. ఆ దగ్గరితనం సంసారంలోకి ప్రవేశిస్తున్నదంటే జాగ్రత్త పడాల్సిందే! వాటి గురించి ఇంట్లో చర్చ, అసహనం మొదలైనప్పుడు సమస్యని వివాదంగా మార్చకుండా పరిష్కరించుకోవాల్సిందే. అలాగే ఇంట్లోవాళ్లకు తెలియాల్సిన పనిలేదనో, అర్థం చేసుకోరనో కొన్ని కెరీర్ విషయాలు… మరీ ముఖ్యంగా ఆర్థిక విషయాలు ఇంట్లో దాస్తూ ఉంటారు. అవి బయటపడితే ఎప్పటికైనా మన అపనమ్మకాన్ని వెల్లడిస్తాయి.
ఇంట్లోకి అడుగుపెట్టే ముందు మనల్ని మనం ఓ ప్రశ్న వేసుకోవాలి. ఇప్పుడు నా కుటుంబానికి నా కోపం అవసరమా? లేక నా సమయం, శ్రద్ధ అవసరమా? అని. దాని జవాబే మన నడవడికను నిర్ణయిస్తుంది. ఈ ఒక్క ప్రశ్న చాలా గొడవలను ఆపేస్తుంది. ఆఫీసు సమస్యలను పూర్తిగా ఇంటి బయటే వదిలేయలేం. ఇల్లు మన భావోద్వేగాలకు వేదిక కాబట్టి మన సమస్యలను వారితో పంచుకోవడం ఆరోగ్యకరమే. కానీ ఆ సమస్య వల్ల వచ్చిన కోపాన్ని మాత్రం తీసుకురాకపోవడం మంచిది.
జీవితం ముఖ్యం
ఉద్యోగం ముఖ్యమే… కానీ జీవితం అంటే ఉద్యోగమే కాదు. జీవితంలో అది ఓ విడదీయరాని భాగం మాత్రమే. ఎందుకంటే డబ్బు, భద్రత, గుర్తింపు, భవిష్యత్తు లాంటి చాలా విషయాలు దానితో ముడిపడి ఉంటాయి కనుక. కానీ, కుటుంబానికి ఆసరాగా మనం నిర్మించుకున్న సంబంధాలనే కోల్పోతే, చివరికి మనం ఏం సాధించినట్టు! ప్రమోషన్ వచ్చిందని ఇంట్లో పంచుకునే వ్యక్తి లేకపోతే? మంచి జీతం వచ్చిందని పార్టీ చేసుకునే సమయం లేకపోతే? అర్థమేముంది! అందుకే ఇల్లు, ఆఫీసుల మధ్య గోడ కట్టడం సాధ్యం కాకపోయినా, కనీసం అటూ ఇటూ దాటగలిగే గడప మాత్రం ఉండాలి. ఇంట్లో మనకు లభించే ప్రేమ, ప్రశాంతత, అనుబంధం… మరుసటి రోజు ఆఫీసులో మరింత బలంగా నిలబడటానికి శక్తినిస్తాయి. ఆ కొలమానాలే మన కెరీర్ ఎంత విజయవంతమో మాత్రమే కాదు, మన జీవితం ఎంత సంతోషంగా ఉందో కూడా చెబుతాయి.
ఆఫీస్ ఒత్తిడి మరీ ఎక్కువైతే?
కొన్నిసార్లు సమస్య మన చేయిదాటిపోవచ్చు. పనిచేసే చోటు అసహజమైన ఒత్తిడిని కలిగించవచ్చు. నిరంతర అవమానాలు, వేధింపులు, అధిక పని, నిద్రలేమి, ఉద్యోగ భద్రతపై తీవ్ర భయం.. లాంటి పరిస్థితుల్లో ఇంటికి వచ్చాక మర్చిపోమనడం పరిష్కారం చూపించదు. అలాంటి సందర్భాల్లో సమస్యకు మూలాన్ని వెతకాలి. అవసరమైతే మేనేజర్, నమ్మకమైన అధికారితో చర్చించాలి. ఒత్తిడి మన రోజువారీ జీవితాన్ని ప్రభావితం చేస్తుంటే మానసిక ఆరోగ్య నిపుణుడి సహాయం తీసుకోవాలి. సాయం కోరడం బలహీనత కానే కాదు. సమస్యను గుర్తించి దాన్ని పరిష్కరించడానికి తీసుకున్న బాధ్యతాయుతమైన నిర్ణయం! ఎందుకంటే ఆఫీసు గడప దాటిన తర్వాత మనం ఉద్యోగి కాదు.. ఎవరికో భర్త, భార్య, తండ్రి, తల్లి, కొడుకు, కూతురు, స్నేహితుడు. ఆ పాత్రలకు కూడా మనం న్యాయం చేసే పరిస్థితి ఉండాలి.
పిల్లలున్నారు జాగ్రత్త!
పిల్లలు మన మాట ఆచరిస్తారేమో చెప్పలేం కానీ, మన నడవడికను మాత్రం అనుసరిస్తారు. ఇంట్లో ఏం జరుగుతున్నదో, ఎలా ప్రవర్తిస్తున్నామో గమనిస్తారు. వాళ్లకు తల్లిదండ్రుల గొడవకు కారణం తెలియకపోవచ్చు. కానీ, ఇంట్లో వాతావరణం మారిందని మాత్రం త్వరగా గుర్తిస్తారు. నాన్న ఎప్పుడూ ఫోన్లో ఉంటున్నారు, అమ్మ చిరాకుగా మాట్లాడుతున్నది, ఇద్దరూ తరచూ గొడవ పడుతున్నారు, ఇంట్లో నవ్వులు తగ్గిపోయాయి… ఇలాంటి పరిస్థితులు పిల్లలపై శాశ్వతంగా ప్రభావం చూపవచ్చు. అందుకే, జాగ్రత్తగా వ్యవహరించడం చాలా అవసరం అని గుర్తించండి.
చిన్న అలవాట్లు.. పెద్ద మార్పు
ఇంట్లోకి వెళ్లే ముందు ఓ ఐదు నిమిషాలు నిశ్శబ్దంగా ఉండండి.
ఇంట్లోకి అడుగుపెట్టిన వెంటనే ఫోన్ కాకుండా కుటుంబ సభ్యులను పలకరించండి.
రోజులో కనీసం ఒకసారైనా ఫ్యామిలీతో కలిసి భోజనం చేయడానికి ప్రయత్నించండి.
జీవిత భాగస్వామిని ‘నీ రోజు ఎలా గడిచింది?’ అని అడగండి.
పిల్లలకు ప్రతిరోజూ కొంత సమయం కేటాయించండి.
కోపంగా ఉన్నప్పుడు వెంటనే స్పందించకుండా కాసేపు ఆగండి.
సమస్య చెప్పేటప్పుడు వ్యక్తిని కాకుండా సమస్యను విమర్శించండి. అవతలి మనిషి చెప్పే సలహాను వినండి.
ప్రతిరోజూ ఇంట్లో ఆఫీసు గురించి మాట్లాడటానికి ఒక పరిమితి పెట్టుకోండి.
– ఎన్. శిరీష
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

