జుట్టు తెల్లబడుతున్నదా? విటమిన్ -బి మాత్రలు తీసుకుంటే సరి! చర్మం మీద మచ్చలు వస్తున్నాయా! విటమిన్- ఇ క్యాప్స్యూల్స్ ఉన్నాయిగా. ఇక రోగనిరోధకశక్తి పెరగడానికి విటమిన్ సి, కంటిచూపు మెరుగ్గా ఉండటానికి విటమిన్ ఎ… అబ్బో విటమిన్ మాత్రలు తీసుకోవడంలో ప్రతి ఒక్కరూ వైద్యులే! కానీ వైద్యుడి సలహా లేకుండా, కాలపరిమితిని పట్టించుకోకుండా ఇష్టానుసారంగా విటమిన్ మాత్రలు వేసుకోవడం వల్ల శాశ్వత దుష్ప్రభావాలు ఉంటాయని హెచ్చరిస్తున్నారు వైద్యులు. ముఖ్యంగా అవి లివర్, కిడ్నీలాంటి అవయవాలని దెబ్బతీస్తాయని చెబుతున్నారు. ఉదాహరణకు విటమిన్ బి6, బి12 మాత్రలు మోతాదు మించితే మన నాడీవ్యవస్థ అతలాకుతలం అవుతుంది. సి విటమిన్ మాత్రలతో జీర్ణవ్యవస్థ దెబ్బతినడమే కాకుండా, కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం కూడా ఉన్నదట. నిరంతరాయంగా విటమిన్ ఎ తీసుకుంటూ ఉంటే, మనిషి కోమాలోకి వెళ్లిపోయే ప్రమాదమూ ఉందని హెచ్చరిస్తున్నారు. ఇక అమాయకంగా కనిపించే విటమిన్ కె మాత్రలు కూడా కొన్ని మందులు వాడేవారిలో తీవ్ర పర్యవసానాలకు దారితీయవచ్చు, రక్తం గడ్డకట్టే సమస్య ఉన్నవారికి ప్రాణాంతకంగానూ మారవచ్చు!