అచ్చ తెలుగు సోయగం.. శోభిత ధూళిపాళ! ‘మిస్ ఇండియా’ పోటీల్లో మెరిసి.. ‘రామన్ రాఘవ్ 2.0’తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ‘గూఢచారి’తో తెలుగు తెరపై తళుక్కుమన్నది. తనదైన అందం, అభినయంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేసింది. డిఫరెంట్‌గా సినిమాలు చేస్తూ ప్రత్యేకత చాటుతున్నది. ఇప్పుడు ‘మంకీ మ్యాన్’తో హాలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది. రచ్చ గెలిచేందుకు సిద్ధమైన శోభిత ‘కార్వాన్’ కబుర్లు!
సినిమాల్లో నటిస్తే చాలనే కారణంతో ఏ పాత్ర పడితే ఆ పాత్ర చేయను. నాకంటూ కొన్ని అభిరుచులు, ఇష్టాలు ఉన్నాయి. వాటికి అనుగుణంగానే సినిమాలు చేస్తా. నాకు వచ్చే అవకాశాల్లోనే మంచి పాత్రల్ని ఎంచుకుంటా. వందశాతం మనసు పెట్టి పనిచేస్తా.
ఒక్కసారి గడపదాటి బయటికి వచ్చామంటే.. యుద్ధం చేయాల్సిందే! నేను ఇక్కడివరకూ రావడానికి ఎంతో కష్టపడ్డాను. ఎన్నో ఆడిషన్స్ తర్వాత సినిమా అవకాశం దక్కింది. అప్పటినుంచి ఇప్పటివరకూ.. ప్రతిరోజూ శ్రమిస్తూనే ఉన్నా. ఎన్ని కష్టాలు ఎదురైనా ఈ రంగాన్ని విడిచి వెళ్లను. సినిమా అంటే నాకు ఇష్టం.
నేను ముంబై రావడం చాలా విచిత్రంగా జరిగింది. పై చదువుల కోసం బెంగళూరు, ముంబై నగరాల్లో ఎక్కడికి వెళ్లాలనే విషయంపై టాస్ వేసుకున్నా. ‘ముంబై’ గెలిచింది. ఏ మాత్రం ఆలోచించకుండా వచ్చేశా. కాలేజీలో చదివేటప్పుడే.. స్నేహితురాలి ప్రోత్సాహంతో మోడలింగ్ వైపు అడుగులు వేశా. అట్నుంచి సినిమాల్లోకి! అలా, ఓ టాస్.. నా జీవితాన్ని మార్చేసింది.
‘మిస్ ఇండియా రన్నరప్’ టైటిల్ సినిమా అవకాశాలకు ఏమాత్రం ఉపయోగపడలేదు. కొందరైతే.. ‘అసలు నీ ముఖం అద్దంలో చూసుకున్నావా? కెమెరా ముందు పనికొస్తావా?’ అని కూడా అన్నారు. నేను మాత్రం వెనకడుగు వేయలేదు. నా కలను సాకారం చేసుకునేందుకు.. ఆ అవమానాలన్నీ భరించా. పట్టుదలతో అనుకున్నది సాధించా!
నాకు చిన్నప్పటి నుంచీ ఆర్ట్ అంటే ఇష్టం. నాది ఆర్టిస్టిక్ మైండ్. అందుకే, ఎలాంటి సినిమా నేపథ్యం లేకున్నా.. ఇండస్ట్రీలోకి వచ్చానేమో! తెరమీద నన్ను నేను చూసుకోవాలనే కోరికే.. ఈవైపుగా అడుగులు వేయించింది.
మొదటి చిత్రం.. ‘రామన్ రాఘవ్ 2.0’ నాకు చాలా ప్రత్యేకమైంది. నాకే కాదు.. ఎవరి కెరీర్లో అయినా, మొదటి సినిమా ప్రత్యేకమే.
‘ద నైట్ మేనేజర్’ వెబ్‌సిరీస్‌లో నటిస్తున్నప్పుడు అనిల్ కపూర్, ఆదిత్యరాయ్ కపూర్ ఫిట్నెస్ చూసి షాకయ్యా! ఇద్దరూ ఫిట్‌గా, డైట్ విషయంలో ఎంతో కచ్చితంగా ఉంటారు. వారితో కలిసి పనిచేశాకే.. జిమ్‌లో చేరాలని నిర్ణయించుకున్నా. ఇప్పుడు షూటింగ్ అయిపోగానే.. నేరుగా జిమ్‌కే వెళ్తున్నా!
షారుక్ ఖాన్.. నా ఆల్‌టైమ్ ఫేవరేట్. ఆయనతో కలిసి పనిచేయడానికి ఎంతో ఉత్సాహంగా ఉన్నా.
సంగీతం, నాట్యం, కవిత్వం.. అంటే ఇష్టం. సినిమా ఆర్టిస్ట్‌గా ప్రేక్షకులను మెప్పించడమూ ఓ కళే! అందుకే, సినిమాల్లోకి రావాలనుకున్నా. వచ్చా.. విజయం సాధించా! హాలీవుడ్లో అవకాశం దక్కుతుందని మాత్రం ఊహించలేదు. ఈ ప్రయాణాన్ని ఎంతో ఎంజాయ్ చేశా. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే.. అన్నీ మంచి క్షణాలే!