మానసిక ఆరోగ్యం మహాభాగ్యం గురూ!
ఆరోగ్యం అనగానే మనం ఎక్కువగా శారీరక విషయాల గురించే ఆలోచిస్తాం. కానీ శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యం సరిగ్గా ఉంటేనే మనిషి పర్ఫెక్ట్గా ఉన్నట్లు. మానసిక ఆరోగ్యం ప్రాధాన్యం ఏంటో ప్రజలకు తెలియజేసేందుకు ఏటా అక్టోబర్ 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం, అక్టోబర్ నెల మొత్తాన్ని మానసిక ఆరోగ్య మాసంగా పరిగణిస్తున్నారు. ఈ నెల రోజులు ప్రపంచ వ్యాప్తంగా మానసిక ఆరోగ్యంపై వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో భారతదేశంలో మానసిక ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో పరిశీలిద్దాం.
మన్తరంగం
భారతదేశం వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ మానసిక ఆరోగ్య సమస్యలు కూడా అంతే వేగంగా పెరుగుతున్నాయి. సమాజంలో ఉన్న అపనమ్మకాలు, అవగాహన లోపం, స్టిగ్మా వల్ల చాలామంది ఈ సమస్యలను బయటికి చెప్పుకోవడానికి వెనకాడుతున్నారు. గణాంకాలు ఏం చెప్తున్నాయంటే.. ప్రపంచ ఆరోగ్య సంస్థ , నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే, ల్యాన్సెట్ అధ్యయనాల ప్రకారం భారతదేశంలో మానసిక ఆరోగ్య స్థితిగతులు ఇలా ఉన్నాయి.
మన దేశంలో ప్రతి 7-8 మందిలో ఒకరు ఏదో ఒక రకమైన మానసిక ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు. దాదాపు 15 కోట్లకు పైగా భారతీయులకు మానసిక ఆరోగ్య సంరక్షణ అవసరమని సర్వేలు వెల్లడిస్తున్నాయి. మానసిక సమస్యలతో బాధపడుతున్న వారిలో 80% కంటే ఎక్కువ మందికి సరైన చికిత్స లేదా కౌన్సెలింగ్ లభించడం లేదు. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం భారతదేశంలో సంవత్సరానికి 1.7 లక్షలకు పైగా ఆత్మహత్యలు నమోదవుతున్నాయి. 15 నుంచి 29 సంవత్సరాల వయస్సు గల యువతలో మరణాలకు ప్రధాన కారణాలలో మానసిక ఒత్తిడి, డిప్రెషన్ కీలక పాత్ర పోషిస్తున్నాయి. మానసిక ఆరోగ్య సమస్యల వల్ల కలిగే ఉత్పాదకత లోపం భారత్ ఆర్థిక వ్యవస్థపై కోట్లాది రూపాయల భారాన్ని మోపుతున్నది.
ఎందుకు ముఖ్యం?
తీవ్రమైన ఒత్తిడి, ఆందోళన వల్ల గుండె జబ్బులు, అధిక రక్తపోటు, మధుమేహం, నిద్రలేమి లాంటి సమస్యలు వస్తాయి. స్పష్టమైన ఆలోచనలు, నిర్ణయాలు తీసుకోవడానికి, రోజువారీ పనుల్లో దృష్టి కేంద్రీకరించడానికి ప్రశాంతమైన మనసు అవసరం. మానసిక ప్రశాంతత ఉన్నప్పుడు కుటుంబంలో, సమాజంలో వ్యక్తుల మధ్య అనుబంధాలు బలంగా ఉంటాయి.
ఏం చేయాలి?
జ్వరం వస్తే డాక్టర్ దగ్గరకు వెళ్లినట్లే, మనసు ఒత్తిడికి గురైనప్పుడు సైకాలజిస్ట్ లేదా సైకియాట్రిస్ట్‌ను సంప్రదించడం సహజమైన విషయంగా మారాలి. టెలి మానస్, ఇతర హెల్ప్ లైన్ సేవలను వినియోగించుకోవాలి. పాఠశాలలు, ఆఫీసులలో విద్యార్థులకు, ఉద్యోగులకు స్ట్రెస్ మేనేజ్మెంట్ వర్క్‌షాప్‌లు, కౌన్సెలింగ్ సెషన్లు నిర్వహించాలి.
అష్టపదితో లాభం..
మానసిక ఆరోగ్యం అనేది కేవలం మానసిక నిపుణుల దగ్గరికి వెళ్లినప్పుడు మాత్రమే కాకుండా, మన రోజువారీ అలవాట్లు, జీవనశైలి ద్వారా ఇంట్లోనే మెరుగుపరుచుకోవచ్చు. మీ మనసును ప్రశాంతంగా, దృఢంగా ఉంచుకోవడానికి వ్యక్తిగతంగా పాటించదగిన 8 ముఖ్యమైన సూచనలు.
1. రోజువారీ దినచర్య- ప్రాధాన్యాలు
రోజూ క్రమం తప్పకుండా 7 నుంచి 8 గంటల నిద్ర ఉండేలా చూసుకోండి. సరైన నిద్ర లేకపోవడం వల్ల ఆందోళన, డిప్రెషన్ లక్షణాలు పెరుగుతాయి. రోజు ప్రారంభంలో చేయాల్సిన పనుల జాబితా వేసుకొని, చిన్న చిన్న లక్ష్యాలను పూర్తి చేయడం వల్ల మానసిక తృప్తి లభిస్తుంది.
2. శరీరానికి వ్యాయామం
ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల నడక, యోగా లేదా వ్యాయామం చేయడం వల్ల మెదడులో ఎండార్ఫిన్లు విడుదలవుతాయి. ఇవి ఒత్తిడిని తగ్గిస్తాయి. ఉదయాన్నే కొంతసేపు ఎండలో ఉండటం, చెట్ల మధ్య నడవడం వల్ల మనసులోని ప్రతికూల ఆలోచనలు తగ్గి ప్రశాంతత లభిస్తుంది.
3. మైండ్‌ఫుల్‌నెస్
రోజుకు 10-15 నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని మీ శ్వాసపై దృష్టి పెట్టడం లేదా ధ్యానం చేయడం అలవాటు చేసుకోండి. గతం గురించి ఎక్కువగా విచారించడం, భవిష్యత్తు గురించి అతిగా ఆలోచించడం మాని, వర్తమానంలో జీవించడానికి ప్రయత్నించండి.
4. భావాలను వ్యక్తీకరించడం
మీకు కలిగే ఒత్తిడి, ఆలోచనలు లేదా భావాలను ఒక డైరీలో రాయడం వల్ల మనసు తేలికపడుతుంది. కుటుంబ సభ్యులు లేదా నమ్మకమైన స్నేహితులతో మీ మనసులోని విషయాలను పంచుకోండి. ఒంటరిగా ఉండటం కంటే ఆత్మీయులతో మాట్లాడటం ఎంతో మేలు చేస్తుంది.
5. డిజిటల్ డిటాక్స్
సోషల్ మీడియాలో ఇతరుల జీవితాలతో మన జీవితాన్ని పోల్చుకోవడం మానసిక అసంతృప్తికి పెద్ద కారణం. నిద్రపోవడానికి కనీసం 45 నిమిషాల ముందు ఫోన్లు, టీవీలు, లాప్‌టాప్‌లు పక్కన పెట్టండి.
6. స్వీయ సంరక్షణ
మీ శక్తికి మించిన పనులను లేదా మీకు ఇష్టం లేని విషయాలను శాంతంగా తిరస్కరించడం నేర్చుకోవడం ద్వారా అనవసరమైన ఒత్తిడిని నివారించవచ్చు. తప్పులు చేయడం సహజం. ఎదుటివారికి ఇచ్చే క్షమాపణ, ఆప్యాయతలను మీకు మీరు కూడా ఇచ్చుకోండి.
7. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు
అధికంగా కాఫీ, టీ, జంక్‌ఫుడ్ లేదా ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు తీసుకోవడం వల్ల మూడ్ స్వింగ్స్ వస్తాయి. తగినంత నీరు తాగడం కూడా ముఖ్యమే.
8. కొత్త నైపుణ్యాలు, హాబీలు
పుస్తకాలు చదవడం, సంగీతం వినడం, మొక్కల పెంపకం లేదా ఏదైనా నచ్చిన కొత్త కళను నేర్చుకోవడం వల్ల మెదడు చురుగ్గా మారి ప్రతికూల ఆలోచనల నుంచి దృష్టి మళ్లుతుంది.
ఈ స్వీయ సంరక్షణ పద్ధతులు రోజువారీ ఒత్తిడిని నిర్వహించడానికి బాగా ఉపయోగపడతాయి. ఒకవేళ మీ మానసిక ఆందోళన తీవ్రంగా ఉండి, రోజువారీ పనులకు తీవ్ర ఆటంకం కలిగిస్తుంటే.. సంకోచించకుండా మానసిక నిపుణుడిని సంప్రదించి కౌన్సెలింగ్ తీసుకోవడం శ్రేయస్కరం.
– బి. కృష్ణ, సీనియర్ సైకాలజిస్ట్
ఇగ్నిషియో చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్
హైదరాబాద్, 99854 28261
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

