ఉప్పెనతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన క్యూట్ గర్ల్ కృతి శెట్టి…వరుస సినిమాలు చేస్తున్నా విజయాలు మాత్రం ఆమెను వరించడంలేదు. శ్యాం సింగరాయ్, బంగార్రాజు లాంటి హిట్లు పడ్డప్పటికీ ఆ తరువాత చెప్పుకోదగ్గ సినిమాలేవీ ఆడలేదు. అయినా కూడా వరుస ఆఫర్లు అందుకుంటున్నది. తాజాగా ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’తో తమిళ యాక్టర్ ప్రదీప్ రంగనాథన్‌తో జతకట్టి థియేటర్లలో సందడి చేస్తున్నది కృతి. ఈ సందర్భంగా బేబమ్మ పంచుకున్న కార్వాన్ కబుర్లు..
కర్ణాటకలోని మంగళూరు మా స్వస్థలం. కానీ, పెరిగిందంతా ముంబయిలోనే. మా నాన్న వ్యాపారవేత్త, అమ్మ ఫ్యాషన్ డిజైనర్. అమ్మ చేసే పనివల్లే నాకు మాడలింగ్పై ఆసక్తి కలిగింది. చిన్నతనంలోనే పలు బ్రాండ్ యాడ్స్‌లో నటించాను. ఆ తరువాత చైల్డ్ ఆర్టిస్ట్‌గా హిందీ చిత్రం సూపర్ 30లో చిన్నపాత్రలో నటించాను. కొన్నాళ్లకు ‘ఉప్పెన’ సినిమాతో నా సినీ ప్రయాణం మొదలైంది.
టాలీవుడ్లో అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన సినిమాలన్నీ ఇప్పటివరకు బ్లాక్ బాస్టర్సే. అన్ని సినిమాల్లో కావాల్సినంత కామెడీ దొరుకుతుంది. ఆయన సినిమాల్లో నటించాలనే కోరిక చాలా రోజుల నుంచి ఉంది. ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌కు వచ్చిన ఆయన అడక్కుండానే నాకు వరం ఇచ్చేశారు. ఆయన చేస్తున్న ప్రస్తుత సినిమాలో అవకాశం ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉంది.
నేను ఇప్పటికీ ఆత్మలు ఉన్నాయని నమ్ముతాను. మాది తుళు. మేము మా పూర్వికులను దేవతలుగా పూజిస్తాం. వాళ్లు మమ్మల్ని ఎప్పుడూ కాపాడుతారని విశ్వసిస్తాం. కార్తీ వా వాతియర్ (అన్నగారు వస్తారు) షూటింగ్ ప్రారంభానికి ముందురోజు రాత్రి మా అమ్మతో కలిసి ఓ హోటల్ గదిలో ఉన్నాను. అప్పుడు అక్కడే ఓ ఆత్మను చూశాను. మేం లైట్ వేయగానే పెద్ద సౌండ్ వచ్చింది. ఆ తర్వాత ఆత్మ కనిపించలేదు.
ఒకసారి ఓ కమర్షియల్ యాడ్ ఆడిషన్ కోసం స్టూడియోకు వెళ్లాను. అది పూర్తయ్యాక, తీసుకెళ్లడానికి నాన్న వస్తానన్నారని ఎదురుచూస్తున్నాను. ఇంతలో తనకు ఆలస్యమవుతుందని నాన్న ఫోన్ చేసి చెప్పారు. ఆ గ్యాప్‌లో పక్కనే ఉన్న స్టూడియోలోకి సరదాగా వెళ్లాను. అక్కడ ఒక సినిమా కోసం ఆడిషన్లు జరుగుతున్నాయి. నన్ను చూసిన యూనిట్ సభ్యులు ‘సినిమాల్లో నటించే ఆసక్తి ఉందా?’ అని అడిగేశారు. నాకేం చెప్పాలో తోచలేదు. ‘ఆలోచించి చెబుతాన’ని మా అమ్మ ఫోన్ నెంబర్ ఇచ్చి ఇంటికొచ్చాను. వెంటనే మా అమ్మకు ఫోన్ చేసి ఉప్పెన సినిమా గురించి చెప్పారట. ఆమె సమ్మతించడంతో నేనూ ఓకే చెప్పేశా.
లవ్ ఇన్సురెన్స్ కంపెనీలో నా పాత్ర మిమ్మల్ని మీరు చూసుకున్నట్లే ఉంటుంది. ఒక్క లైక్ ఒక షేర్ అంటూ సెల్‌ఫోన్ పిచ్చితో పెరిగిన అమ్మాయిగా ధీమా పాత్రలో నటించాను. ఈ జెనరేషన్‌కు ఇట్టే కనెక్ట్ అవుతుంది. ప్రదీప్ రంగనాథన్ కసి ఉన్న యాక్టర్. కొత్తగా ఆలోచిస్తుంటాడు. షూటింగ్ అయిపోయాక కూడా రేపటి షెడ్యూల్ ముందే ప్లానింగ్ చేసుకుంటాడు. ఆయనతో కలిసి నటించడం వల్ల చాలా నేర్చుకున్నాను.
సోషల్ మీడియాలో ఏఐ సృష్టిస్తున్న అలజడి అంతా ఇంతా కాదు. ఇటీవల ఒక వ్యక్తితో నేను సన్నిహితంగా ఉన్నట్లు ఫేక్ ఫొటో ఒకటి వైరలైంది. అది చూసి మా అమ్మ ఆందోళనకు గురైంది. సెలెబ్రిటీలకే ఇలాంటి పరిస్థితి ఉంటే, సామాన్య మహిళల భద్రత గురించి ఆలోచిస్తేనే భయంగా ఉంది.