కొరియన్ బ్యూటీ ట్రెండ్ ఇప్పుడు మన దగ్గర జోరు మీదుంది. దాంతో పాటు రైస్ వాటర్కీ సౌందర్య సాధనలో ప్రాధాన్యం పెరిగింది. సూపర్ గ్లాసీ స్కిన్ కోసం, మిలమిల మెరిసే జుట్టు కోసం బియ్యం కడిగిన నీళ్లను వాడతారిందులో. అయితే ఇవే రైస్వాటర్తో ఎనిమిది అడుగుల పొడవైన జుట్లు పెంచుకుని తమ ఊరిని ప్రపంచంలోనే అత్యధిక పొడవాటి జుట్టు కలిగిన వారున్న గ్రామంగా నిలబెట్టారు అక్కడి మహిళలు. మరి ఆ ఊరేంటి, పొడవు జుట్టు ముచ్చటేంటి ఓ లుక్కేద్దాం..
చైనా దేశంలోని గ్వాంగ్సీ ప్రాంతంలో ఉన్న చిన్న గ్రామం హువాంగ్లువో. ఇక్కడి మహిళల జుట్టు పొడవు చూసినవారెవరికైనా ఆశ్చర్యమే కలుగుతుంది. ఎందుకంటే వీళ్ల వెంట్రుకల పొడవు సాధారణంగానే ఆరేడు అడుగులు ఉంటుంది. కొందరైతే ఏకంగా 8 అడుగులు దాటిన జుట్టుతో గిన్నిస్ రికార్డు సాధించారు.
హువాంగ్లువో గ్రామంలో నివసించే ప్రజలు రెడ్ యావో (Red Yao) తెగకు చెందినవారు. ఈ తెగకు ప్రత్యేకమైన సంస్కృతి ఉంది. వీరు తమ సంప్రదాయ దుస్తులు, ఎరుపు రంగు తలపాగా, జుట్టు సంరక్షణ పద్ధతులతో ప్రపంచానికి ఆకర్షణగా నిలుస్తున్నారు. ఈ స్త్రీలు తమ జుట్టును కేవలం అలంకారంగా మాత్రమే కాదు, తమ గౌరవంగా భావిస్తారు. ఇక్కడి మహిళలు జీవితంలో ఒక్కసారి మాత్రమే జుట్టు కత్తిరిస్తారు. అది కూడా పెళ్లి వయసులో. ఆ తరువాత జీవితాంతం జుట్టును పెంచుతూనే ఉంటారు. ఇది వారి సంప్రదాయం.

యావో మహిళల జుట్టు పొడవుకు ప్రధాన కారణం వాళ్ల సహజ జీవనశైలి. ముఖ్యంగా వాళ్లు ప్రత్యేక పద్ధతితో తయారు చేసుకుని ఉపయోగించే బియ్యపు నీరు. పిండిపదార్థం అధికంగా ఉండే బియ్యాన్ని ఈ ప్రాంతంలో సహజసిద్ధంగా పంస్తారు. వాటినే హెయిర్ మాస్క్ తయారీ కోసం ఎంచుకుంటారు. వాటిని శుభ్రంగా కడిగి కాస్త తెలుపు రంగు వచ్చేదాకా చేతితో నలుపుతారు. ఆ నీళ్లను ఒక గిన్నెలోకి తీసుకుని ఉడికించి అక్కడ దొరికే కొన్ని రకాల పండ్ల తొక్కలు, ఔషధ గుణాలున్న ఆకులు, వేర్లను ఇందులో వేసి కొన్నాళ్లు పులియబెడతారు. తర్వాత తీసి ఉడికించి చల్లార్చి నిల్వ చేసుకుంటారు. దీన్ని తలకు పెట్టుకుని అక్కడ ప్రవహించే ఒక సహజసిద్ధ నీటి పాయలో శుభ్రం చేసుకుంటారు. ఈ నీటిలో సహజంగా ఉండే విటమిన్లు జుట్టును బలంగా, పొడవుగా పెంచుతాయి. కెమికల్స్ లేకుండా సహజంగా సంరక్షణ చేస్తారు. వారానికి ఒకసారి మాత్రమే ఇలా తలస్నానం చేస్తారు.
ఇక్కడి మహిళలు తమ జుట్టును మూడు విధాలుగా మడుస్తారు. పొడవాటి జుట్టు ఉండే ఈ తెగలో హెయిర్ స్టయిల్ అనేది కూడా సంస్కృతిలో ఒక భాగం. వివాహం కాని అమ్మాయిలు జుట్టును విరబోసుకునే ఉంటారు. పెళ్లయిన వాళ్లు జుట్టును చుట్టి కట్టుకుంటారు. పిల్లలు ఉన్న మహిళలు ప్రత్యేకంగా తలపై తలపాగా తరహాలో చుట్టుకుంటారు. అంటే వెంట్రుకలు ముడివేసే స్టయిల్ చూసి వారి జీవిత స్థితిని తెలుసుకోవచ్చు. ఇక ఈ తెగ ప్రజల్లో అరవై పైబడిన వారిలోనే కాదు ఎనభై ఏండ్ల వారిలో కూడా జుట్టు తుమ్మెద రెక్కల్లా నిగనిగలాడుతూ ఉంటుంది. ప్రకృతి సోయగాలకు నెలవుగా ఉండే ఈ గ్రామంతో పాటు ఈ సిగసరులనూ చూసేందుకు పర్యాటకులు వస్తుంటారట. సహజ సంప్రదాయ పద్ధతులను పాటిస్తే మన ఆరోగ్యం, అందం ఎలా నిలుస్తాయో ఈ గ్రామం ప్రపంచానికి చూపుతున్నది!