‘పుష్ప’ అడ్డాలో అల్లు అర్జున్ తర్వాత ఆ రేంజ్లో కనిపించిన, వినిపించిన పాత్ర కేశవ. చిత్తూరు యాసలో సినిమాను పరిచయం చేసి, కథనం నడిపించిన కేశవ పాత్రధారి అచ్చంగా తెలంగాణ బిడ్డ. జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన జగదీశ్ ప్రతాప్ బండారి ‘పుష్ప’ సినిమాతో తెలుగువారందరికీ ‘మచ్చా’ అయిపోయాడు. దర్శకుడు కావాలనే లక్ష్యంతో హైదరాబాద్ వచ్చిన జగదీశ్.. నటుడిగా ఇక ‘తగ్గేదే లే’ అంటున్నాడు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం చిన్నకొడెపాక మా ఊరు. అక్కడి ప్రభుత్వ పాఠశాలలో ఆరో తరగతి వరకూ చదివా. పెంబర్తిలో పదో తరగతి పూర్తయింది. హనుమకొండలో ఇంటర్, డిగ్రీ చదివా. ఇంటర్లో ఉన్నప్పుడే నటుణ్ని అవుతాననే నమ్మకం ఉండేది. ఎక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినా పాల్గొనేవాణ్ని. మా నాన్న నన్ను పోలీస్‌గా చూడాలనుకున్నారు. నేనేమో ఇలా నటుణ్ని అయ్యాను. సినిమాల్లోకి వెళ్తా అంటే, మన ప్రాంతంలో ఎవరైనా వద్దనే అంటారు. మా ఇంట్లోనూ అలాగే అన్నారు. కానీ, నా తపన చూసి సరే అన్నారు.
సినిమాల్లో అవకాశం రావడమే కష్టమంటే, గుర్తింపు పొందడం ఇంకా కష్టం. డైరెక్టర్ అవ్వాలనే లక్ష్యంతో హైదరాబాద్ వచ్చా. అవకాశం వస్తే నటుడిగానూ చేయాలనుకున్నా. ఒక్క సీన్లో ఏదో ఒక మూల కనిపించినా చాలు అనుకునేవాణ్ని. ‘నిరుద్యోగ నటులు’ అనే యూట్యూబ్ సీరిస్‌లో మొదటిసారిగా నటించాను. కొన్ని సినిమాల్లో సైడ్ క్యారెక్టర్ చేసినా గుర్తింపు రాలేదు. ఏదో ఒక రోజు మంచి పాత్ర దొరక్కపోదన్న నమ్మకంతో వచ్చిన ప్రతి పాత్రనూ చేసేవాణ్ని. 2019లో మల్లేశం, జార్జిరెడ్డి, గాడ్, ఊబి, పలాస-1978, కొత్త పోరడు, పిక్ పాకెట్.. సినిమాల్లో నటించాను. అనుకోకుండా డైరెక్టర్ సుకుమార్ గారు ‘పుష్ప’ సినిమాలో కేశవ పాత్ర ఇచ్చారు. అలా హీరో అల్లు అర్జున్ స్నేహితుడిగా పెద్ద క్యారెక్టర్ వచ్చింది. మొదట కొంత భయపడినా దర్శకుడు, హీరో ఎంతో ప్రోత్సహించారు. ఆ పాత్రలో లీనమై చేశాను. అందరూ బాగా చేశావని మెచ్చుకున్నారు. ఆ విషయం సినిమా చూశాక గానీ నాకూ అర్థం కాలేదు! బొమ్మ సూపర్ హిట్ అయింది. నాకూ మంచి గుర్తింపు వచ్చింది. సుకుమార్ సార్‌కు ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. అల్లు అర్జున్ గారితో నటించడం చాలా గొప్ప అనుభూతి. ఇప్పుడు చాలా సినిమాలకు అవకాశాలు వస్తున్నాయి. పుష్ప విడుదలైన రోజు నుంచి నా ఫోన్ ఖాళీగా లేదు. కాల్స్, మెసేజ్‌లు వస్తూనే ఉన్నాయి.
సినిమా అంతా చిత్తూరు జిల్లా తిరుపతి ప్రాంతంలో జరిగినట్టు ఉంటుంది. ఎర్రచందనం స్మగ్లింగ్, దాని వినియోగం గురించి నా పాత్ర పరిచయం చేస్తూ సినిమా మొదలవుతుంది. సినిమా కథ, వివిధ క్యారెక్టర్లను నా పాత్రే పరిచయం చేస్తుంది. ఇందులో అన్ని పాత్రలూ చిత్తూరు యాసలోనే మాట్లాడతాయి. సినిమాకు నేనే డబ్బింగ్ చెప్పా. ఆ యాస చూసి చాలా మంది నన్ను రాయలసీమ వాడిననే అనుకుంటున్నారు. ‘డబ్బింగ్ నువ్వే చెప్పావా?’ అని ప్రశ్నిస్తున్నారు. సినిమాల్లో నిలబడాలంటే అందుకు అవసరమైనవన్నీ నేర్చుకోవాలి. తెలుగు రాష్ర్టాల్లోని వివిధ యాసలపై అవగాహన పెంచుకున్నా. అది ఈ సినిమాకు బాగా సాయపడింది. సుకుమార్ సార్ ఇచ్చిన ధైర్యంతో కేశవ పాత్ర చేయగలిగా. ప్రతి మాటనూ ఎలా పలకాలో తెలుసుకున్నాను. సినిమాలో ఎక్కువ నిడివి ఉన్న పాత్ర కావడం నాకు పెద్ద సంతృప్తిని ఇచ్చింది. ఈ ప్రయాణం ఇలాగే కొనసాగుతుందని ఆశిస్తున్నా. పుష్ప-2 గురించి మాత్రం ఇప్పుడే మాట్లాడను మచ్చా!
మా నాన్న బండారి చంద్రమౌళి పోస్టుమ్యాన్, అమ్మ లలిత వ్యవసాయం చేస్తుంటుంది. అక్కకు పెండ్లయ్యింది. చెల్లె డిగ్రీ పూర్తి చేసింది. నాన్న వీధినాటకాలు వేసేవారు. పద్యాలు, పాత పాటలు పాడేవారు. నాన్నే నా రోల్ మోడల్. 30 ఏండ్ల కిందట ఓ రోడ్డు ప్రమాదంలో నాన్న కుడికాలు విరిగింది. మోకాలు ఆపరేషన్ చేస్తే బాగవుతుందని, చాలా డబ్బులు అవసరమని డాక్టర్లు చెప్పారు. నాన్న కాలులో రాడ్ ఉంది. ఇప్పటికీ సరిగ్గా నడవలేరు, కాలు మడుచుకోరాదు. నాకు వచ్చే డబ్బులతో నాన్నకు ఆపరేషన్ చేయిస్తా. నేను సినిమాల్లోకి రావడానికి నాన్నే స్ఫూర్తి. ఆయన అనుకున్నట్లుగా పోలీసు ఆఫీసర్ కాలేకపోయినా ఇప్పుడు తృప్తి చెందారని అనుకుంటున్నా.
పిన్నింటి గోపాల్