రావణుడు మహా పండితుడు. కానీ, సీత పట్ల పెంచుకున్న వ్యామోహమే ఆ అసురుడి పతనానికి దారితీసింది. కీచకుడు వీరాధివీరుడు. కానీ, ద్రౌపదిని వశం చేసుకోవాలనే దుర్బుద్ధి అతని నాశనానికి కారణమైంది. గొప్పగొప్ప హోదాల్లో ఉన్నవారు కూడా లైంగిక బలహీనత వల్ల అప్రతిష్ఠ పాలవుతున్నారు. ఆ లోపాన్ని వదిలించుకోడానికి ఓ వేదికంటూ ఉంటే ఇంతటి దుస్థితి వచ్చేది కాదేమో. ఆ దిద్దుబాటు చర్య కోసమే ‘సెక్స్ ఎడిక్షన్ ఎనానిమస్’ సంస్థ రంగంలో దిగింది.
చిన్నారిపై ఐటీ ఉద్యోగి లైంగిక దాడి. ‘నా భర్త సెక్స్ మృగం’ ఓ భార్య ఫిర్యాదు. పని మనిషితో ఓ ఉన్నతాధికారి అసభ్య ప్రవర్తన.. ఇలాంటి శీర్షికలు లేకపోతే పత్రిక నిండదు. ప్రైమ్‌టైమ్ టీవీ న్యూస్ పరిపూర్ణమూ కాదు. ఎందుకిలా జరుగుతున్నది? లోపం ఎక్కడుంది? అనే కోణంలో ఆలోచిస్తే.. సగానికి సగం లైంగిక దుశ్చర్యలకు కారణం మానసిక రోగాలే. ఆ జాడ్యాన్ని వదిలించుకోవాలని అనుకునేవారి కోసం ఓ వేదిక ఉంది. అదే, ‘సెక్స్ ఎడిక్షన్ ఎనానిమస్’.
బెంగళూరు మహానగరం. అది పాతబడిన ఓ కంప్యూటర్ ల్యాబ్. చుట్టూ ఉన్న పరికరాలు దుమ్ముకొట్టుకుని ఉన్నాయి. వాటిమధ్య కూర్చున్న కొందరు వ్యక్తులు మాత్రం మార్పునకు ప్రతినిధుల్లా కనిపిస్తున్నారు. తమ ఆలోచనలను మార్చుకుంటూ, గతం అనే దుమ్మును విదిలించుకుంటూ, వదిలించుకుంటూ అప్‌గ్రేడ్ అవుతున్నారు. లైంగిక వ్యసనం ప్రమాదకరం. కుటుంబాలను కూలుస్తుంది. బంధాలను బలి తీసుకుంటుంది. ఆకాశమంత ఎత్తుకు ఉన్నవారిని సైతం పాతాళానికి తొక్కేస్తుంది. చాలా సందర్భాల్లో ఇదొక మానసిక సమస్య. కౌన్సెలింగ్‌తో, మందులతో కొంత ఉపయోగం కనిపించినా అది తాత్కాలికమే. మందుల వాడకం ఆగిపోగానే.. లేదంటే కౌన్సెలింగ్ నిలిచిపోగానే వ్యసనం మళ్లీ తిరగబెడుతుంది. ఇలాంటివారికి నిరంతర సాయం, సహకారం అవసరం. ఆ బాధ్యత తీసుకుంది.. ‘సెక్స్ ఎడిక్షన్ ఎనానిమస్’.
ఆల్కహాలిక్స్ ఎనానిమస్ గురించి చాలామందికి తెలుసు. మద్యాన్ని వదిలించుకోవాలనుకునేవారి వేదిక అది. సభ్యులంతా తరచూ కలుసుకుంటారు. మాట్లాడుకుంటారు. మనసులోని భావాలు పంచుకుంటారు. చేయీ చేయీ కలిపి మద్యపాన
వ్యసనాన్ని దూరం చేసుకుంటారు. ఈ ఫార్ములా ప్రపంచవ్యాప్తంగా విజయవంతమైంది. ఎంతోమంది కొత్త జీవితాలు ప్రారంభించారు.ఆ స్ఫూర్తితోనే ‘సెక్స్ ఎడిక్షన్ ఎనానిమస్’ ఆరంభమైంది. ఇదీ అంతర్జాతీయ వేదికే. ఇందులో చేరాలనుకునేవారు.. వ్యక్తిగత వివరాలు పంచుకోవాల్సిన అవసరం లేదు. కొత్తగా చేరినవారికి ఓ మెంటర్‌ను కేటాయిస్తారు. 12 steps of recovery లాంటి వినూత్న పద్ధతుల ద్వారా వ్యసనం నుంచి బయటపడేందుకు దారి చూపిస్తారు. ఈ సంస్థ సభ్యులు తరచూ కలుసుకుంటూ ఉంటారు. తమ అనుభవాలను పంచుకుంటూ, ఒకరికొకరు భరోసాగా నిలుస్తూ వ్యసనాన్ని దాటే ప్రయత్నం చేస్తారు.
లైంగిక వ్యసనాన్ని మానసిక సమస్యగానే చూడకూడదనే వాదన ఉంది. కొన్నిసార్లు శరీరంలోని పురుషత్వ హార్మోన్ల ఊట స్థాయికి మించడం వల్ల కూడా ఇలా జరుగుతుంది. దీనికి ఔషధాలే పరిష్కారం. యాంటీ ఆండ్రోజన్ చికిత్స ద్వారా.. ఆ ప్రవాహానికి అడ్డుకట్ట వేస్తారు. నిజానికి ప్రతి సమస్యకూ ఓ పరిష్కారం ఉంటుంది. కానీ, దాన్నో సమస్యగా గుర్తించడానికే చాలామంది సాహసించడం లేదు.
సెక్సువల్ ఎడిక్షన్‌కు రకరకాల కారణాలు. అవి జన్యుపరమైనవి కావచ్చు. చైల్డ్ అబ్యూజ్ లాంటి చేదు అనుభవాలూ కావచ్చు. ఒక పక్క అదుపులో లేని ప్రవర్తన, ఆ ప్రవర్తన వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలు, పశ్చాత్తాపం, శత్రుభయం, సిగ్గు, నలుగురిలో తల ఎత్తుకోలేని పరిస్థితి ఆ వ్యక్తిని కుంగదీస్తాయి. Compulsive Sexual Behaviour Disorder మనిషిని రాక్షసుడిగా మార్చిన ఉదాహరణలూ ఉన్నాయి. అలా అని వాళ్లేం దుర్మార్గులు కాదు. ఆ క్షణానికి తమ మీద తాము నియంత్రణ కోల్పోతారు. విచక్షణ వదిలేస్తారు. చదువు, సంస్కారం, భార్య, పిల్లలు, కుటుంబం.. ఏవీ గుర్తుకురావు. వ్యసనం మెదడును ఆక్రమిస్తుంది. ఆఫీసులో ఉన్నా అవే ఆలోచనలు తొలిచేస్తుంటాయి. పతనం వైపుగా అది తొలి అడుగు. ఒక తప్పు వంద తప్పులుగా మారుతుంది. హత్యలకు, దాడులకు దారితీస్తుంది. జీవితభాగస్వామి విడాకులు ఇచ్చేస్తుంది. పిల్లలు అసహ్యించుకుంటారు. బంధువులు దూరం పెడతారు. సమాజం వెలివేసినంత పని చేస్తుంది.
ఆ ఊబిలోంచి బయటపడాలనే కోరిక బలంగా ఉన్నప్పుడు మాత్రమే లైంగిక వ్యసనాన్ని జయించవచ్చు. మనిషి ఆత్మబలం ఔషధాల కంటే శక్తిమంతం. Sex Addicts Anonymous మనసు కేంద్రంగా పరిష్కారాన్ని వెతుకుతుంది. ‘ఈ ఒక్కరోజు వ్యసనం జోలికి వెళ్తాను, రేపటి నుంచి మానేస్తాను’ అని చాలామంది తమకు తాము సర్దిచెప్పుకొంటారు. కానీ, రేపు ఎల్లుండి అవుతుంది. ఎల్లుండి వచ్చేనెల అవుతుంది. ఆ వాయిదాకు అంతే ఉండదు. అలా కాకుండా ‘ఇవాళే, ఈ క్షణమే నియంత్రించుకుంటాను..’ అని తీర్మానించుకోగల మనో బలాన్ని ఇస్తుందీ సంఘం. ఆలోచనలు అదుపు తప్పినప్పుడు, వాటిని నియంత్రించుకునేందుకు కొన్ని రకాల ‘టూల్స్’నూ అందిస్తుంది. పురుషులకే పరిమితం కాకుండా, మహిళల కోసమూ పనిచేస్తుందీ వేదిక. saa.india.helpline@gmail.com ద్వారా ‘సెక్స్ ఎడిక్షన్ ఎనానిమస్’ను సంప్రదించవచ్చు. సమావేశాలు ఆన్లైన్లోను, ఆఫ్లైన్లోనూ జరుగుతుంటాయి. ఫోన్ మీటింగ్లూ ఉంటాయి. ఈ సంస్థకు దేశవ్యాప్తంగా శాఖలు ఉన్నాయి.